మనోహర సాగరకన్య


Mon,May 20, 2019 11:35 PM

Aishwarya Rai Bachchan Turns into Golden Mermaid at Cannes 2019

కేన్స్ చలన చిత్రోత్సవంలో భారతీయ తారలు తమ అందచందాలతో వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు. ప్రతి ఏడాది కేన్స్ ఎర్రతివాచీపై సరికొత్త ఫ్యాషన్స్‌తో విలక్షణతను ప్రదర్శించే ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ఆగమనం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. వారందరిని ఆనందపరవశుల్ని చేస్తూ ఆదివారం రాత్రి కేన్స్ రెడ్‌కార్పెట్‌పై ఐశ్వర్యరాయ్ నడయాడింది. సాగరకన్యలా ముస్తాబై ఆహుతుల్ని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తింది. పసిడి వర్ణంతో తయారుచేసిన కలిడియోస్కోపిక్ క్రోమ్ గౌనులోమ తళుకులీనింది. ఫిఫ్‌కట్‌తో కూడిన ఈ వస్త్రధారణ అందరి దృష్టిని ఆకట్టుకుంది. లెబనీస్ డిజైనర్ జీన్ లూయిస్ సబాజీ రూపొందించిన ఈ ప్రత్యేకగౌను ఆదివారం కేన్స్ రెడ్‌కార్పెట్‌పై ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ఐశ్వర్యరాయ్ తనయ ఆరాధ్య పసుపురంగు గౌనులో అమ్మతో పాటు రెడ్‌కార్పెట్‌పై నడిచి వచ్చింది.

72వ కేన్స్ చలన చిత్రోత్సవాలు ఫ్రాన్స్‌లోని రివేరా నది తీరంలో వైభవంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ తారల రాకతో కేన్స్ వేదిక క్రొంగొత్త శోభను సంతరించుకుంది. ఇప్పటికే భారత్ నుంచి కంగనారనౌత్, ప్రియాంకచోప్రా, దీపికాపదుకునే, హీనాఖాన్, హుమాఖురేషి హాజరై సందడి చేశారు. సోనమ్‌కపూర్‌తో పాటు మరికొంతమంది భారతీయ తారలు విచ్చేయబోతున్నారు. ప్రతి ఏడాది కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవానికి తప్పకుండా హాజరవుతుంటుంది ఐశ్వర్యరాయ్. పారిస్‌కు చెందిన ప్రఖ్యాత సౌందర్య ఉత్పత్తుల సంస్థ లారియల్‌కు ఐశ్వర్య ప్రచారకర్తగా వ్యవహరిసున్న విషయం తెలిసిందే. కేన్స్ ఫెస్టివల్ జ్యూరీ సభ్యురాలిగా కూడా ఐశ్వర్యరాయ్ పనిచేస్తున్నది.

2296

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles