మనసు మాట వింటాను!

Sat,September 28, 2019 12:06 AM

అప్పుడే చక్కెరపాకంలోంచి వాయి తీసిన తాజా జిలేబీలా, హేమంతపు మంచుధారల్లో తడిసి ముద్దయిన మంత్రపుష్పంలా ఊరిస్తూ మైమరిపిస్తుంటుంది పంజాబీ సోయగం మెహరీన్‌. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేసిన ఈ అమ్మడికి యువతరంలో ఫాలోయింగ్‌ ఎక్కువే. ప్రస్తుతం వరుస సినిమాలతో దక్షిణాదిలో బిజీగా ఉంది. ఆమె కథానాయికగా గోపీచంద్‌ సరసన నటిస్తున్న తాజా చిత్రం ‘చాణక్య’ అక్టోబర్‌ 5న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా మెహరీన్‌ పాత్రికేయులతో సంభాషించింది..


‘చాణక్య’ చిత్రంలో మీ పాత్ర చిత్రణ ఎలా ఉంటుంది?

-ఈ సినిమాలో నా పాత్రపేరు ఐశ్వర్య. కొరియర్‌ కంపెనీ నడిపించే చలాకీ అమ్మాయిగా కనిపిస్తాను. లక్ష్యం కోసం పోరాడుతున్న హీరోకు చేదోడుగా ఉంటాను. తొలిసారిగా నేను స్పైథ్రిల్లర్‌ (గూఢచారి నేపథ్య) చిత్రంలో నటించాను. అలీ, సునీల్‌తో కలిసి నేను పండించే హాస్యం ఆద్యంతం నవ్వుల్ని పంచుతుంది.

స్పై థ్రిల్లర్‌ సినిమాలంటే ఎన్నో మలుపులతో సాగుతాయి. మీ పాత్రలో అలాంటి సర్‌ప్రైజ్‌లు ఏమైనా ఉంటాయా?

-నా పాత్రలో అనూహ్య మలుపులు ఏమీ కనిపించవు. అయితే గూఢచారి ఇతివృత్తం కాబట్టి కథాగమనంలోనే చాలా ట్విస్ట్‌లు ఉంటాయి. సినిమాలో నా ప్రేమకథ మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది. హీరో ఐడెంటిటీ ఏమిటో పూర్తిగా తెలియకుండానే ప్రేమలో పడతాను. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉత్సుకతను కలిగిస్తాయి.

తొలిసారి గూఢచారి సినిమాలో నటించడం ఎలాంటి అనుభూతినిచ్చింది?

-ప్రేమకథా చిత్రాల్లో మన పాత్ర ఏమిటో స్పష్టంగా తెలిసిపోతుంది. కథలో పెద్దగా మలుపులు ఉండవు. కానీ స్పైథ్రిల్లర్‌ చిత్రాలు స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగుతూ అనుక్షణం ఉత్కంఠను పంచుతాయి. ఈ తరహా సినిమాల్లో నటించడం కథానాయికలకు ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. దర్శకుడు తిరు సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఆసక్తినిరేకెత్తించేలా తీర్చిదిద్దాడు. సెకండాఫ్‌ కొంచెం పాకిస్థాన్‌ నేపథ్యంలో కథ నడుస్తుంది. అది ఎందుకన్నది కథలో ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్‌గా చెప్పవచ్చు.

సాధారణంగా గూఢచారి థ్రిల్లర్‌ సినిమాల్లో ప్రేమకథకు అంతగా ప్రాధాన్యత ఉండదు కదా..?

-అలాంటిదేమి లేదు. స్పైథ్రిల్లర్‌ అనగానే సినిమా ఆద్యంతం యాక్షన్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో ఉంటుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ సినిమాలో వినోదం, కుటుంబ అనుబంధాలు, సెంటిమెంట్‌ అన్ని అంశాలు ఉంటాయి. ముఖ్యంగా హాస్యానికి పెద్దపీట వేశారు.

గోపీచంద్‌తో కలిసి నటించిన రెండో సినిమా ఇది. ఆయనతో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?

-గోపీచంద్‌గారు సెట్‌లో చాలా ప్రశాంతంగా ఉంటారు. సీన్‌ పూర్తవగానే తన పనిలో నిమగ్నమవుతారు. ఆయన కోపగించుకున్న సందర్భాన్ని ఎప్పుడూ చూడలేదు. ‘పంతం’ తర్వాత గోపీచంద్‌గారితో మరో మంచి సినిమాలో నటించడం గొప్ప అనుభూతినిచ్చింది.

మీ కెరీర్‌పరంగా ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారు?

-తారల కెరీర్‌లో ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకమని నా అభిప్రాయం. కథ నచ్చితేనే నేను సినిమా అంగీకరిస్తాను. ఏ భాషా చిత్రమైనా ఉత్తమ నటనను కనబరచాలని తపిస్తాను. నా గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా కోసం వందశాతం అంకితభావంతో పనిచేశాను. కాబట్టి ప్రేక్షకులు ఇచ్చే తీర్పు మన ప్రతిభ గురించి చెబుతుంది. అయితే నటనాపరంగా ప్రతి సినిమాలో పరిణితి సాధించాననే సంతృప్తి మాత్రం మిగిలింది.

కెరీర్‌ తొలినాళ్లలో మంచి విజయాలు సాధించారు. ఆ తర్వాత కొన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కోవడం ఎలా అనిపించింది?

-ప్రతి ఒక్కరి జీవితంలో సంఘర్షణ ఉంటుంది. అన్నీ మనం కోరుకున్నట్లుగానే జరగాలని లేదు కదా. కథ నచ్చితేనే సినిమా అంగీకరిస్తాం. ఫలితం మన చేతిలో ఉండదు. ఓ సినిమా పరాజయానికి చాలా కారణాలుంటాయి. జయాపజయాలు జీవితంలో ఓ భాగం. కాబట్టి ఏం జరిగినా ఆశావహదృక్పథంతో ముందుకుసాగాలన్న సిద్ధాంతాన్ని నేను నమ్ముతాను.

ఈ సినిమాకు సొంతంగా డబ్బింగ్‌ చెప్పారా?

-లేదు. ‘ఎఫ్‌2’ చిత్రానికి సొంతంగా డబ్బింగ్‌ చెప్పాను. నా దృష్టిలో డబ్బింగ్‌ అంటే ఒక ఆర్ట్‌. అందులో పరిపూర్ణత సాధించడానికి సమయం తీసుకుంటుంది. ప్రస్తుతం నా మాతృభాష పంజాబీలో ఓ సినిమా చేస్తున్నాను. అయినప్పటికీ డబ్బింగ్‌ చెప్పడం కాస్త కష్టంగానే అనిపిస్తున్నది. తెలుగులో మరింత పర్‌ఫెక్షన్‌ సాధించిన తర్వాత సొంతంగా డబ్బింగ్‌ చెబుతాను.

మీకు స్వతహాగా ఎలాంటి పాత్రలంటే ఇష్టం? ఏమైనా డ్రీమ్‌ రోల్స్‌ ఉన్నాయా?

-కథ విన్నప్పుడు నా పాత్ర తెరపై ఎలా ఉంటుందో అని ఊహించుకుంటాను. ఓ ప్రేక్షకురాలి కోణంలో ఆలోచిస్తాను. నాకు సంతృప్తిగా అనిపిస్తే సినిమాకు ఓకే చెబుతాను. కాబట్టి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌, యాక్షన్‌, లవ్‌స్టోరీస్‌...ఏ తరహా కథలైనా చేయగలననే నమ్మకం కలిగింది. ‘అరుంధతి’ ‘మహానటి’ ‘ఓ బేబీ’ ‘క్వీన్‌' సినిమాల్లోని కథానాయికల పాత్రలంటే నాకు చాలా ఇష్టం. అవి నా డ్రీమ్‌రోల్స్‌. ప్రస్తుతం నా మాతృభాష పంజాబీలో కూడా రెండు సినిమాలు చేస్తున్నాను.

దక్షిణాది సినిమాలతో పాటు పంజాబీలో కూడా నటిస్తున్నారు. వ్యక్తిగతంగా మీరు దేనికి ప్రాధాన్యతనిస్తారు?

-తెలుగు చిత్రసీమ నాకు అమ్మలాంటిది. నేను ఇక్కడే కెరీర్‌ ఆరంభించాను. ఏ భాషా చిత్రంలో నటిస్తున్నా...తెలుగుకే నా తొలిప్రాధాన్యత. టాలీవుడ్‌లో మంచి పాత్ర లభిస్తే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోను. దక్షిణాదిలో బిజీగా ఉండటం వల్ల హిందీపై దృష్టిపెట్టలేకపోతున్నా. మంచి సబ్టెక్ట్‌ దొరికితే బాలీవుడ్‌లో సినిమా చేయాలని ఉంది. నాయికగా కుటుంబ కథా చిత్రాల్నే నేను ఎక్కువగా ఇష్టపడతాను.

-జీవితం ప్రతిరోజు మనకు కొత్తపాఠాన్ని నేర్పుతుంది. వాటినుంచి పాజిటివ్‌ అంశాల్ని తీసుకొని ముందుకుసాగాలి. చిన్న విషయాలకే క్రుంగిపోతే కెరీర్‌లో రాణించలేం. ప్రతి సినిమాలో నా బెస్ట్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. నిజాయితీగా శ్రమిస్తాను. ఏదిఏమైనా చివరగా మనకు మనమే సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సినిమాల ఎంపికలో నా హృదయం చెప్పిన మాటే వింటాను.

708

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles