ఈ అనుభూతి ఇలాగే వుండిపోవాలి!

Wed,April 17, 2019 11:51 PM

నాని.. మన పక్కింటి అబ్బాయిలా అనిపించే హీరో. తొలి సినిమా నుంచే ప్రేక్షక హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న ఆయన గత కొంత కాలంగా వరుస విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు. గతంలో ఒక గొప్ప సినిమా చేశాననే భావనలో నేను ఎప్పుడూ లేనని, ఆ అనుభూతిని జెర్సీ సినిమాతో పొందుతున్నానని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారాయన. నాని నటించిన తాజా చిత్రం జెర్సీ. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో నాని బుధవారం పాత్రికేయులతో ముచ్చటించారు.


రామన్ లాంబ లైఫ్ స్టోరీని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా చేశారా?

అయితే ఇదొక ఫిక్షనల్ స్టోరీ. రామన్ లాంబ కూడా క్రికెట్‌ని మధ్యలోనే వదిలేసి బయటికి వెళ్లి మళ్లీ క్రికెట్‌లోకి వచ్చారేమో. అందుకే అంతా ఆయన లైఫ్‌కి దగ్గరగా వుందని జెర్సీ టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసి అలా అనుకుంటున్నారెమో. కానీ మా సినిమాకు ఆయన జీవితానికి ఎలాంటి సంబంధం వుండదు.

ప్రత్యేకంగా ఈ చిత్రానికి జెర్సీ అనే టైటిల్ పెట్టడానికి కారణం?

జెర్సీ అంటే క్రికెట్ యూనిఫాం. క్రికెట్‌లోనే కాదు ప్రతి ఆటలో క్రీడాకారుడు వేసుకునే డ్రెస్‌ను జెర్సీ అంటాం. కేవలం ఇది క్రికెట్ నేపథ్యంలో రూపొందిన సినిమా కాబట్టి ఈ టైటిల్ పెట్టామని అనుకోవద్దు. జెర్సీ అనే టైటిల్ పెట్టడానికి సినిమాలో బలమైన కారణం వుంది. అది ఏమిటన్నది రేపు సినిమా చూస్తే మీకే తెలిసిపోతుంది.

ఇటీవల క్రికెట్ నేపథ్యంలో మజిలీ సినిమా వచ్చింది. మీ సినిమాలోనూ క్రికెట్ ప్రధానంగా సాగుతుంది. ఈ రెండు సినిమాలకు చాలా దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయి?

మజిలీ చిత్రాన్ని నేను చూడలేదు. కాబట్టి పోలికల గురించి చెప్పలేను. నేను నటించిన నిన్నుకోరి సినిమాతోనే శివ నిర్వాణ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మజిలీ తొలి టీజర్ దగ్గరి నుంచి శివ నాకు చూపించాడు. అవన్నీ నాకు చాలా నచ్చాయి. జెర్సీ పనుల్లో పడి మజిలీ సినిమా చూడలేకపోయాను. అయితే మా సినిమాకు ఆ సినిమాకు ఏ విషయంలోనూ పోలికలు వుండవు.

సినిమాలో మీరు సక్సెస్‌ఫుల్ క్రికెటర్‌గా కనిపిస్తారా? లేక ఫ్రస్ట్రేషన్‌తో విసిగిపోయిన క్రికెటర్‌లా కనిపిస్తారా?

మా ట్రైలర్‌లోనే సినిమా ఏంటనేది చెప్పేశాం. అర్జున్‌ని మిగతావారు లూజర్ అంటూ హేళన చేయడం, తక్కువ చేసి చూడటం, ఇక నీ వయసు అయిపోయింది. నీవల్ల కాదు.. అనడంతో అర్జున్‌కు ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. అయితే అది దేనికి దారితీసింది అన్నదే ఈ చిత్రంలో ఆసక్తికరం. నా గత చిత్రాలతో పోలిస్తే అతి తక్కువ సమయంలోనే ఈ చిత్ర కథని ఓకే చేశాను. చివరి డైలాగ్ విన్న వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నాం అని చెప్పేశాను.

జెర్సీకి ముందు క్రికెట్ ఆడేవారా?

చిన్నతనంలో ఇంటి ముందు అంతా ఆడినట్టే నేనూ గల్లీ క్రికెట్ ఆడేవాడిని. స్కూల్ టీమ్‌లో నేను ఎక్స్‌ట్రా ప్లేయర్‌ని. మన టీమ్‌లో అంతా ఔటయిపోతే మనకు బ్యాటింగ్ వస్తుందని చాలా మంది కోరుకుంటారు. నేను అలాంటి బ్యాచ్ అన్నమాట. స్కూల్ డేస్‌లో నన్నెవరూ సీరియస్ ప్లేయర్‌గా పరిగణలోకి తీసుకునేవారు కాదు.

ఈ సినిమా విషయంలో మీరు ఏమైనా నేర్చుకున్నారా?

క్రికెట్ అంటే ఏంటో నేర్చుకున్నాను. బాల్‌ని బ్యాట్‌తో కొట్టడమే క్రికెట్ అని అనుకునేవాళ్లం. అయితే ఈ సినిమాతో క్రికెట్ పట్ల నా దృక్పథం పూర్తిగా మారింది. గతంలో టీవీలో క్రికెట్ వస్తోందంటే ఛానల్ మార్చేవాడిని. ఇప్పుడు అలా చేయడం లేదు. ఈ సినిమా కోసం డానియల్ అనే కోచ్ వద్ద ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను.

సినిమాలో మీ పేరు అర్జున్, మీ కొడుకు పాత్ర పేరు నాని ఎలా?

నిజమే. అయితే కావాలని ఏదీ ప్లాన్ చేసుకోలేదు. గౌతమ్ కథ రాసుకున్నప్పుడే ఆ పేర్లతో రాసుకున్నాడు. ఆ ప్రకారమే కంటిన్యూ చేశాడు. భావోద్వేగాల పరంగా ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకే చిత్రమిది.

ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నట్టున్నారు?

సినిమాలో వున్న భావోద్వేగాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. అందుకే సినిమాపై ఇంత నమ్మకంతో వున్నాను. నా కెరీర్‌లోనే జెర్సీ ప్రత్యేకమైన సినిమా అనుకోవచ్చు. ఈ సినిమా విషయంలో అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతున్నాను. ఇంతకంటే ఇంకా ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. సినిమా పట్ల నాకున్న సంతృప్తి ఇలాగే వుండిపోవాలని వుంది. గతంలో ఒక గొప్ప సినిమా చేశాననే భావనలో నేను ఎప్పుడూ లేను. ఆ అనుభూతిని ఈ సినిమాతో పొందుతున్నాను.

యంగ్ ఏజ్‌లో ఫాదర్‌గా నటించడం ఇబ్బందిగా అనిపించిందా?

నాకు అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు. కథ డిమాండ్‌ని బట్టి ముసలి పాత్రలోనూ నటించడానికి నేను సిద్ధమే. రియల్ లైఫ్‌లో తండ్రిని అయిన నాకు రీల్ లైఫ్‌లో అదే తరహా పాత్రలో నటించడం ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు.

చిత్రీకరణ సమయంలో చాలా గాయాలైనట్టున్నాయి?

భీమిలి కబడ్డీ జట్టు చిత్రీకరణ సమయంలో రోజూ మోకాళ్లు కొట్టుకుపోయేవి. అప్పట్లో సోషల్ మీడియా ఇంతగా లేదు కాబట్టి ఆ విషయం ఎవరికీ తెలియలేదు. కానీ ఇప్పుడలా కాదు చిన్న దెబ్బతగిలితే వెంటనే తెలిసిపోతోంది.

మీ అబ్బాయి మిమ్మల్ని జడ్జ్ చేస్తాడా?

ప్రతి తండ్రి ప్రపంచం దృష్టిలో ఎలా వున్నా ఫరవాలేదు కానీ కొడుకు దృష్టిలో మాత్రం హీరో కావాలనుకుంటాడు. అందుకే సినిమాలోని డైలాగ్ అంత పాపులర్ అయింది. నన్ను జడ్జ్ చేసే వయసు అర్జున్‌కు ఇంకా రాలేదు. ఆ వయసు వచ్చినా వాడు నన్ను జడ్జ్ చేయలేడు.

మిమ్మల్ని ఎవరైనా విమర్శించారా? వాటిని మీరు ఎలా తీసుకున్నారు?

నా సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినప్పుడు కూడా నా నటన గురించి ఎవరూ కామెంట్ చేయలేదు. కానీ వరుసగా కమర్షియల్ విజయాల్ని అందుకుంటుంటే మాత్రం ఏంటీ ఇక నాని కమర్షియలేనా అన్నారు. దాన్ని నేను విమర్శగా ఎప్పుడూ తీసుకోలేదు. మొదట్లో విమర్శలకు బాగా ఫీలయ్యే వాడిని. ఆ తరువాత అర్థమైంది. అలా రాయడం వాళ్ల బాధ్యత. విని ఊరుకోవడం మన ధర్మం అని.

స్టార్‌డమ్‌ని నమ్ముతారా?

ఖచ్చితంగా నమ్ముతాను. అయితే ఆ పదానికి ఇప్పుడున్న అర్థాన్ని మాత్రం నమ్మను. కంటెంట్ ఎవరికైనా స్టార్‌డమ్ తీసుకొస్తుందని బలంగా నమ్ముతాను.

బిగ్‌బాస్ మీలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టింది?

బిగ్‌బాస్ నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది. పిల్ల జమీందార్ చిత్రంలో మనం ప్రపంచానికి పరిచయం అవటం కంటే మనకు ప్రపంచం పరిచయం కావడం ముఖ్యం అని ఓ డైలాగ్ వుంది. ఆ డైలాగ్‌లాగే బిగ్‌బాస్‌తో ప్రపంచం నాకు పరిచయమైంది. బిగ్‌బాస్ నాకొక బిగ్గెస్ట్ లెస్సన్. ఎందుకంటే ప్రతీ ఎపిసోడ్ మరో ఎపిసోడ్‌తో సంబంధం లేకుండా కొత్తగా ఊహించని విధంగా సాగింది.

జెర్సీ చిత్రాన్ని చైనాలో కూడా విడుదల చేసే ఆలోచన చేస్తున్నారని తెలిసింది?

ప్లాన్ అయితే వుంది. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. ఎప్పుడు, ఎలా విడుదల చేయాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన సినిమా కాబట్టి దీన్ని తప్పకుండా చైనాలో రిలీజ్ చేయాలనుకున్నాం. చైనాలో ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌లకు ఆదరణ ఎక్కువ. ఆ కారణంగానే ఈ చిత్రాన్ని అక్కడి ప్రేక్షకులకు అందించాలనుకుంటున్నాం.

2269

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles