నగ్నత్వాన్ని కళాత్మకంగా..


Wed,July 17, 2019 12:12 AM

Aame Telugu movie interview Amalapaul

మహిళా ప్రధాన ఇతివృత్తాల ఎంపికలో మరింత కొత్తదనానికి ప్రాధాన్యతనివ్వాలని అంటున్నది అమలాపాల్. నవీన మగువ ప్రతిరంగంలో తనదైన ప్రభావాన్ని చూపిస్తున్నదని, వారి కథలు వెండితెరపై దృశ్యమానం కావాలన్నదే తన అభిలాష అని చెప్పింది. ఆమె కథానాయికగా నటించిన తమిళ చిత్రం అడై తెలుగులో ఆమె పేరుతో అనువాదమవుతున్నది. రత్నకుమార్ దర్శకుడు. ఈ నెల 19న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా అమలాపాల్ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..

తెలుగులో ఇప్పటివరకు ఐదు సినిమాలు చేశాను. ఇటీవలకాలంలో తెలుగులో ఆఫర్లు వచ్చాయి కానీ కథలు నచ్చక అంగీకరించలేదు. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్, మహిళా ప్రధాన సబ్జెక్ట్స్ వస్తే తెలుగు సినిమా చేద్దామనుకున్నాను. కానీ అలాంటి అవకాశాలు రాలేదు. కీర్తి సురేష్ నటించిన మహానటి నాకు బాగా నచ్చింది. అభినయానికి ఆస్కారం ఉన్న అలాంటి పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతం నేను తమిళ పరిశ్రమ మీద దృష్టిపెట్టాను. మలయాళంలో ఓ సినిమా చేస్తున్నాను. ఏ భాషా చిత్రాల్లోనైనా నవ్యమైన ఇతివృత్తాల కోసం ఎదురుచూస్తున్నాను. లేడీ ఓరియెంటెడ్ కథలు, మహిళాసాధికారతను చర్చించే ఇతివృత్తాలు చాలా వస్తున్నాయి. అలాంటి వాటికి భిన్నంగా మహిళల చుట్టూ పరిభ్రమించే వినూత్న కథలు చేయాలనుకుంటున్నాను.

నటిగా పరిణితి సాధించాను..

కెరీర్ ఆరంభంలో చాలా కమర్షియల్ చిత్రాలు చేశాను. అయితే ఈ ప్రయాణంలో నాలో మార్పు వచ్చింది. నటిగా ఎంతో పరిణితి సాధించాను. వినూత్న కథాంశాల్ని ఎంపిక చేసుకోవాలనే తపన పెరిగింది. సినిమాల ద్వారా డబ్బులు సంపాదించుకుందామనే ధ్యాస కన్నా అందరికి గుర్తుండిపోయే మంచి సినిమాలు చేయాలనే సంకల్పం ఎక్కువైంది.అంత మాత్రాన కమర్షియల్ సినిమాలకు దూరం కాను.వాటిలో కూడా ప్రయోగాత్మక కథలకు ప్రాధాన్యతనివ్వాలనుకుంటున్నాను.

అశ్లీలత లేకుండా ఆవిష్కరించాం...

ఆమె చిత్రంలో కథాంశంపరంగా నగ్నత్వం అనే అంశం ఉంటుంది. దానిని హద్దులు మీరకుండా సినిమాలో చూపించాలనుకున్నాం. అశ్లీలత లేకుండా చక్కటి సౌందర్యభావనతో కళాత్మకంగా ఆ సన్నివేశాల్ని తెరకెక్కించాం. కథలో భాగంగానే ప్రేక్షకులు ఆ సీన్స్‌ను స్వీకరిస్తారు. ఈ సినిమాలో నేను కామిని అనే యువతి పాత్రలో కనిపిస్తాను. ఆమె ఎవరి మెప్పు పొందాలని ప్రయత్నించదు. కొంచెం స్వార్థం ఎక్కువ. ఎవరిని లెక్కచేయనితనంతో అతిచురుకైన అమ్మాయిగా కనిపిస్తుంది. భిన్న పార్శాలున్న ఆ పాత్రను పోషించడం సవాలుగా తీసుకున్నాను. కొద్ది సంవత్సరాల క్రితం వరకు నేను కూడా కామినిలాంటి దృక్పథంతో ఉండేదాన్ని (నవ్వుతూ). జీవితం నేర్పిన పాఠాలతో పాటు యోగాలో శిక్షణ తీసుకోవడంతో ఇప్పుడు మనసుకు ప్రశాంతత చేకూరింది.

పంథా మారాలి...

సమకాలీన సినిమాలో కథానాయికను గ్లామర్ కోణంలో చూసే 80ల కాలం నాటి భావజాలం క్రమంగా తొలగిపోతున్నది. నేటి సమాజంలో మహిళలు అత్యంత శక్తివంతులుగా ఎదుగుతున్నారు. నవీన మగువ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తున్నది. వారి చుట్టు ఉన్న కథల్ని చూపించాల్సిన అవశ్యకత ఉంది. తెలుగులో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. రాజమౌళిగారి దర్శకత్వంలో నటించాలన్నది నా డ్రీమ్. ప్రస్తుతం తమిళంలో కడావర్ అనే చిత్రాన్ని చేస్తున్నాను. ఇదొక ఫొరెన్సిక్ థ్రిల్లర్ చిత్రం. కేరళకు చెందిన లెజెండరీ ఫొరెన్సిక్ సర్జన్ ఉమాదత్తన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. నేనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాను. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో నిర్మించబోతున్నాను.

1083

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles