నా హృదయం చెప్పిన మాటే వింటాను!

Sat,February 23, 2019 11:31 PM

ప్రయోగాలకు పెద్దపీట వేస్తారు కల్యాణ్‌రామ్. ఏదో ఒక పంథాకు పరిమితమైపోకుండా కథాంశాల్లో నవ్యతకు ప్రాధాన్యతనిస్తారు. ఇమేజ్ ఛట్రంలో బందీకాకుండా తనని తాను నిత్యనూతనంగా ఆవిష్కరించుకోవాలని తపిస్తారు. ఒకేదారిలో పయనిస్తే బోర్ కొడుతుంది. ప్రయాణాన్ని మరింతగా ఆస్వాదించాలంటే కొత్తదారుల్ని వెతుక్కోవాల్సిందే అంటున్నారు కల్యాణ్‌రామ్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 118. కె.వి.గుహన్ దర్శకుడు. మహేష్ కోనేరు నిర్మాత. మార్చి 1న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్ పాత్రికేయులతో తన మనోభావాల్ని పంచుకున్నారు.ఈ సినిమా విజయంపై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాను. ముఖ్యంగా పతాకఘట్టాల్లోని చివరి ఇరవైనిమిషాలు ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. కొన్ని విజువల్స్ ప్రేక్షకులు ఇప్పటివరకు చూసి వుండదు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించాం.కమర్షియల్ చిత్రాలకు నిర్వచనమేమిటి? మంచి కామెడీ సీక్వెన్స్, ఐటెంసాంగ్, నాయకానాయికల మధ్య యుగళగీతాలు...ఇవన్నీ వాణిజ్య సినిమాకు కొలమానం అనుకుంటే అలాంటి ఎలిమెంట్స్ 118లో ఉండవు. అయితే ఆద్యంతం ఉత్కంఠను పంచే స్క్రీన్‌ప్లే ప్రేక్షకులు కథలోని భావోద్వేగాలతో సహానుభూతి చెందుతారు.

ఛాయాగ్రాహకుడు గుహన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ కథలో నచ్చిన అంశాలేమిటి?

నేను నటిస్తున్న తొలి థ్రిల్లర్ చిత్రమిది. కథ వినగానే బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి జీవితంలోని ఏదో ఒక సందర్భంలో కథలో చెప్పిన సంఘటనలు ఎదురవుతాయి. అయితే వాటి గురించి చెబితే ఎవరూ నమ్మరు. సినిమాలో నేను పరిశోధనాత్మక జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తాను. ప్రతి విషయంలో అతనికి ఉత్సుకత ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి విషయాన్నైనా శోధించి సాధించాలనే తపనతో కనిపిస్తాడు. అలాంటి వ్యక్తి తనకు ఎదురైన అనుభవాల వెనకున్న రహస్యాన్ని ఎలా ఛేదించాడన్నదే చిత్ర ఇతివృత్తం.

ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలంటున్నారు. మీరెప్పుడైనా అలాంటి వాటిని ఎదుర్కొన్నారా?

వ్యక్తిగతంగా తనకు ఎన్నోసార్లు ఆ తరహా ఘటనలు ఎదురయ్యాయని దర్శకుడు గుహన్ నాతో చెప్పారు. పదేపదే అవే సంఘటనలు పునరావృతం కావడంతో నాకే ఇలా ఎందుకు జరుగుతోంది? అని తర్కించుకున్నారట. వాటన్నింటిని ఓ కథారూపంలో తీసుకువచ్చాడు. అదే ఈ సినిమా.

ఈ కథలో సూపర్‌నేచురల్ అంశాలేమైనా ఉంటాయా?

అలాంటివేమీ ఉండవు. అయితే సినిమా చూస్తున్నప్పుడు సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్ ఉన్నాయేమోఅనే భావన కలుగుతుంది. దర్శకుడు గుహన్‌కు అతీంద్రియ శక్తులపై నమ్మకం లేదు. కాబట్టి వాటిని సినిమాలో చూపించలేదు.

ఇంతకి సినిమాకు 118 అనే టైటిల్ పెట్టడానికి కారణమేమిటి?

118 టైటిల్ ఎందుకు పెట్టాల్సివచ్చిందో ట్రైలర్‌లో సింబాలిక్‌గా చూపించాం. సినిమా మొత్తం చూస్తే ప్రేక్షకులకు ఈ టైటిల్ ఎందుకు పెట్టామో అర్థమవుతుంది. తొలుత ఈ సినిమాకు రక్షణ, అన్వేషణ అనే రకరకాల టైటిల్స్ అనకున్నాం. అయితే కథకు అవేవి యాప్ట్‌గా అనిపించలేదు. ప్రేక్షకుల్లో కాస్త ఉత్సుకతను పెంచాలంటే 118 టైటిల్ బాగుంటుంది అనుకున్నాం. ఈ సినిమా కథ మొత్తం నివేథా థామస్ చుట్టే నడుస్తుంది.

దేశంలో నెలకొన్న ఏదైనా సమకాలీన సమస్యను చర్చిస్తున్నారా?

అలాంటిదేమి లేదు. రాజకీయ, సాంఘిక అంశాలేమి సినిమాలో ఉండవు. ఈ కథలో హృదయాల్ని స్పృశించే ఆర్థ్రత, అనూహ్యమైన నాటకీయత ఉంటుంది. ఇందులో హీరో కూడా ఓ ప్రేక్షకుడిలా అనిపిస్తాడు. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు, హీరోకు కథలోని అన్ని విషయాలు ఒకేసారి తెలుస్తుంటాయి. ఆడియెన్స్ ప్రతిస్పందనే తెరపై హీరో వ్యక్తం చేస్తుంటాడు. స్క్రీన్‌ప్లే కూడా ఎలాంటి మలుపులు లేకుండా స్ట్రెయిట్ నరేషన్‌లో సాగుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన అంశాలున్నాయి కాబట్టే కథ వినగానే వెంటనే ఓకే చేశాను. నా టీమ్‌లో సభ్యుడైన మహేష్ కోనేరు కథ విని ఎంతో ఉద్వేగానికిలోనయ్యారు. తన స్వీయనిర్మాణ సంస్థ ఈస్ట్‌కోస్ట్ బ్యానర్ మీద సినిమా తీస్తానని ముందుకొచ్చారు. ఉన్నతమైన నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించారు. ముంబయిలో తీసిన అండర్‌వాటర్ సీక్వెన్స్ హైలైట్‌గా ఉంటుంది. నాకు ఈతలో అంతగా ప్రవేశం లేదు. స్విమ్మింగ్ సన్నివేశాల్లో సహజత్వం కనిపించాలని ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఈత నేర్చుకున్నాను.

కమర్షియల్ హీరో అయిఉండి కూడా మీరు తొలి నుంచి ప్రయోగాత్మక ఇతివృత్తాలకు ప్రాధాన్యతనిస్తుంటారెందుకని?

హరే రామ్ నుంచి నేను ప్రయోగాలు చేస్తూనే ఉన్నాను. కథాంశాలపరంగా కొత్తదనం చూపించాలన్నదే నా తపన. కమర్షియల్ సినిమాలతో పాటు ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఏ దర్శకుడైనా ఆ తరహా కథలతో నా దగ్గరకు వస్తే తప్పకుండా వాటి గురించి ఆలోచిస్తాను.

అపజయాల్ని మీరెలా స్వీకరిస్తారు. ప్రయోగాలు తలపెట్టిన ప్రతిసారి మీకు ఆశించిన విజయం దక్కడం లేదు కదా?

ఫెయిల్యూర్స్‌ను సమీక్షించుకుంటాను. ఎక్కడ తప్పు జరిగిందో నా బృందంతో కలిసి విశ్లేషిస్తాను. సాధ్యమైనంత వరకు పొరపాట్లను తిరిగి మరో సినిమాలో పునరావృతం చేయకుండా చూసుకుంటాను. ప్రయోగాలు, కొతజోనర్ సినిమాలు చేయడం నా అజెండా. మున్ముందు కూడా అదే దారిలో కొనసాగుతాను.

నివేథా థామస్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందంటున్నారు. ఆమె క్యారెక్టర్ గురించి...?

ఆమె పాత్ర చుట్టే కథ నడుస్తుంది. అంతమాత్రాన ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా కాదు. నివేథా థామస్ ప్రతిభావంతురాలైన కథానాయిక. నిన్నుకోరి, జెంటిల్‌మెన్ సినిమాలు చూపినప్పుడు బరువైన పాత్రలకు ఆమె గొప్పగా న్యాయం చేస్తుందనిపించింది. ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు చాలా ఉంటాయి. అందుకే నివేథా థామస్‌ను కథానాయికగా తీసుకున్నాం.

జర్నలిస్ట్ పాత్రను చేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?

పాత్రపరంగా నాకు సరికొత్త అనుభవమిది. నా లుక్ మొదలుకొని పాత్ర చిత్రణ వరకు ప్రతీది వైవిధ్యంగా ఉంటుంది.

ఈ తరహా థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువ మంది ఆడియెన్స్‌కు చేరువకావనే భావన ఉంది. ఈ కథ ఓకే చేసేముందు కమర్షియల్ సక్సెస్ గురించి ఆలోచించారా?

ఆ లెక్కల గురించి పెద్దగా ఆలోచించను. నా మనసు, హృదయం ఏం చెబుతుందో దాన్నే అనుసరిస్తాను. కొన్ని స్క్రిప్ట్స్ వినగానే తప్పకుండా చేయాలనే ఉత్సుకతను కలిగిస్తాయి. వాటిని వెంటనే అంగీకరిస్తాను. 118 ైక్లెమాక్స్ ఘట్టాల్లోని కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారు. అంతటి బలమైన భావోద్వేగాలు ఉన్న కథ ఇది.

2432

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles