ఎన్టీఆర్ ధైర్యాన్నిచ్చారు!


Wed,March 13, 2019 11:54 PM

118 Movie Producer Mahesh Koneru Interview

118 కొత్త తరహా కథ. తొలుత కథ వినిపించినప్పుడు ఈ చిత్రాన్ని కల్యాణ్‌రామ్ సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో చేద్దాం అన్నారు. అయితే ఇలాంటి విభిన్నమైన చిత్రాన్నినా సంస్థలోనే చేయాలని నిర్మించాను అన్నారు. మహేష్ కోనేరు. ఆయన నిర్మించిన తాజా చిత్రం 118. నందమూరి కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించారు. కె.వి.గుహన్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత మహేష్ కోనేరు బుధవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు.

నేను సమర్పకుడిగా వ్యవహరించిన నా నువ్వే ఆశించిన ఫలితాన్ని అందించలేదు. నన్ను నమ్మి కల్యాణ్‌రామ్ ఆ సినిమా చేశారు. అలా నమ్మి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ఆయనకు ఫ్లాప్ సినిమా ఇచ్చానే అని బాధపడ్డాను. ఆ సినిమా ఫలితం ఇచ్చిన షాక్ నుంచి బయటికి రావడానికి చాలా సమయం పట్టింది. ఆ సమయంలో గుహన్ చెప్పిన కథ నచ్చడంతో 118ని మొదలుపెట్టాం. తొలుత ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలనుకున్నాం. అయితే కల్యాణ్‌రామ్ ఎన్టీఆర్ బయోపిక్ అంగీకరించడంతో చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చింది. దాంతో ఇటీవల విడుదల చేయాల్సి వచ్చింది. ఏది ఏమైనా మా సినిమాను మంచి టైమ్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. మంచి జరగాలని వుంటే ఆ దేవుడు మంచే చేస్తాడు.

ఎన్టీఆర్ ధైర్యాన్నిచ్చారు..

ఈ చిత్రాన్ని ముందు ఎన్టీఆర్‌కు చూపించాం. సినిమా చూసిన ఆయన బాగుంది, కొత్తగా వుంది. ఖచ్చితంగా జనాలకి నచ్చుతుందని మాకు ధైర్యాన్నిచ్చారు. ఆ తరువాత దిల్‌రాజు, శిరీష్‌లకు చూపించాం. సినిమా చూసి వాళ్లూ ఇదే మాట చెప్పడంతో పాటు మా చిత్రాన్ని పంపిణీ చేశారు. వారికి సినిమా నచ్చిందంటే ఫలితం ఎలా వుంటుందో అందరికి తెలిసిందే. మేము నమ్మి చేసిన చిత్రానికి ఈ రోజు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండటం ఆనందంగా వుంది. విడుదలైన తొలి రోజు కొంత డివైడ్ టాక్ వచ్చినా ఆ తరువాత 70 నుంచి 80 శాతం ఆక్యుపెన్సీతో మంచి వసూళ్లని రాబడుతోంది. పటాస్ కల్యాణ్‌రామ్ కెరీర్‌లో భారీ వసూళ్లని సాధించిన సినిమాగా నిలిస్తే 118 నటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

హరీష్‌శంకర్‌తో కలిసి...

హరీష్‌శంకర్‌తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాను. మంచి కథలు కుదిరితే అతనితో కలిసి వరుసగా కొత్త తరహా చిత్రాలు నిర్మించాలన్న ఆలోచన వుంది. కీర్తిసురేష్‌తో నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ జరుగుతోంది. మేలో 40 రోజుల పాటు అమెరికాలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. ఈ ఏడాది ద్వితీయార్థంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. త్వరలో ఓ పెద్ద హీరోతో సినిమా చేయబోతున్నాను. ఎన్టీఆర్‌తో సినిమా తీసే అవకాశం వస్తే దాన్ని మించిన అదృష్టం లేదు.

2379

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles