హైదరాబాద్‌లో గ్జాండర్ పెట్టుబడి

Thu,October 11, 2018 02:29 AM

Xander signs 350 million dollars Hyderabad office project deal

ఫీనిక్స్ గ్రూప్‌తో ఒప్పందం.. కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అంతర్జాతీయ పెట్టుబడుల దిగ్గజం గ్జాండర్ గ్రూప్.. హైదరాబాద్ మార్కెట్‌లోకి భారీ డీల్‌తో దూసుకొచ్చింది. ఈ గ్రూప్ రియల్ ఎస్టేట్ ఈక్విటీ విభాగమైన గ్జాండర్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్.. భాగ్యనగరంలో తమ తొలి వాణిజ్య కార్యాలయ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇక్కడి ఫీనిక్స్ గ్రూప్ ప్రాజెక్టులో 45 లక్షల చదరపు అడుగుల కార్యాలయ విస్తీర్ణాన్ని సొంతం చేసుకున్నది. 2020 నుంచి 2023 వరకు దశలవారీగా ఈ ప్రాజెక్టు గ్జాండర్ చేతికి రానుండగా, దీనిపై రూ.2,590 కోట్ల పెట్టుబడుల (350 మిలియన్ డాలర్లు)ను పెడుతున్నది.

రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఆకర్షణీయం

దేశ, విదేశీ ఐటీ, ఐటీ అనుబంధ రంగాల సంస్థలు హైదరాబాద్‌లో కార్యాలయాల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాయి. ఫలితంగా ఐటీ ఎగుమతుల సంఖ్య భాగ్యనగరం నుంచి గణనీయంగా పెరుగుతున్నది. ఈ అంశంలో దేశీయ సగటు కంటే హైదరాబాద్ ఆకర్షణీయ వృద్ధి నమోదు చేసుకున్నది. దేశంలోనే తెలంగాణ అతిపిన్న రాష్ట్రమైనప్పటికీ.. గత ఆర్థిక సంవత్సరం (2017-18) ఐటీ రంగంలో 9.32 శాతం అభివృద్ధిని నమోదు చేసింది. ఇదే కాలంలో జాతీయ సగటు ఏడు నుంచి తొమ్మిది మధ్యే ఉన్నది. ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ సంస్థల్లో ఐదు లక్షల మంది కంటే ఎక్కువే పని చేస్తున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచేందుకు అత్యంత ఆకర్షణీయ, నూతన వ్యాపార విధానాలనూ టీఆర్‌ఎస్ సర్కారు అవలంభిస్తున్నది.

ఐటీ రంగంపై ప్రత్యేక దృష్టి

2020 నాటికి లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల విలువ గల ఐటీ ఎగుమతులను చేయాలన్న లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్నది. దీని ద్వారా నాలుగు లక్షల మందికి ప్రత్యక్షంగా, మరో 20 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధిని అందివ్వాలనుకుంటున్నది. ఈ క్రమంలోనే పెరిగే కొత్త ఉద్యోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడి సంస్థ గ్జాండర్.. గచ్చిబౌలిలోని ఫీనిక్స్ ప్రాజెక్టును అందిపుచ్చుకున్నది. ఈ సందర్భంగా గ్జాండర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రిన్సిపల్ అర్పిత్ సింగ్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో అడుగుపెట్టడం అనందంగా ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న తీరు తమకు అతికినట్లు సరిపోతుందని, ప్రస్తుతం ఆఫీసు సముదాయాల విభాగంలో ఆకర్షణీయమైన పరిస్థితులున్నాయని అభిప్రాయపడ్డారు. అందుకే ఇక్కడి ఆఫీసు విభాగాల్లో పెట్టుబడులు పెట్టడమే సరైన అవకాశంగా భావిస్తున్నామని చెప్పారు.

మెరుగైన ఉద్యోగావకాశాల కోసం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఐసీటీ పాలసీని ప్రవేశపెట్టింది. పలు వినూత్న పరిజ్ఞానాలపై సరికొత్త పాలసీలకు శ్రీకారం చుట్టింది. డేటా సెంటర్స్, ఓపెన్ డేటా, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి ఎనిమిది పాలసీలను మొదలెట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై స్పష్టత ఉండటంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్ పాలసీలను తెలంగాణ ఐటీ శాఖ తీసుకొచ్చింది. కేవలం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగంలో సుమారు రూ.10,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడానికి అడుగులు ముందుకేస్తున్నది. ఈ విభాగం ద్వారా ప్రత్యక్షంగా 50 వేల మందికి ఉద్యోగాల్ని అందించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఇలాంటి స్పష్టమైన విధానాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించడం వల్లే అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు హైదరాబాద్‌లో అడుగు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. గ్జాండర్ హైదరాబాద్‌లోకి అడుగుపెట్టడానికీ ప్రధాన కారణమిదే. ఇదే బాటలో మరిన్ని సంస్థలు హైదరాబాద్‌లోకి ప్రవేశించడానికి, పయనించడానికి సిద్ధమవుతున్నాయి.

2242
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles