జీడీపీ 7 శాతమే: వరల్డ్ బ్యాంక్


Thu,October 12, 2017 12:00 AM

World-Bank
వాషింగ్టన్, అక్టోబర్ 11: భారత వృద్ధిరేటు అంచనాను ప్రపంచ బ్యాంకు మరోమారు తగ్గించింది. పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కారణంగా ఈ ఏడాది జీడీపీ 7 శాతానికే పరిమితం కావచ్చని అంచనా వేసింది. 2015లో ఇది 8.6 శాతంగా ఉండటం గమనార్హం. గత రెండు అంచనాలతో పోల్చితే ఇది 0.5 శాతం తక్కువ. చైనా జీడీపీ అంచనా 6.8 శాతం కంటే కూడా దిగువే. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు సైతం ఇప్పుడు దేశ వృద్ధి అంచనాలను కోత పెట్టడం కలవరపెడుతున్నది. ఇకపోతే ప్రైవేట్ రంగ పెట్టుబడుల్లో మందగమనం దేశ వృద్ధిరేటు సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నదని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. భారత ఆర్థిక వ్యవస్థను పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు మధ్య తలెత్తుతున్న సమస్యలు ప్రభావితం చేస్తున్నాయి అని రెండేండ్లకోసారి వెల్లడించే దక్షిణాసియా ఆర్థిక పరిస్థితి నివేదికలో ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

2015లో 8.6 శాతంగా నమోదైన భారత జీడీపీ.. 2017లో 7 శాతంగానే ఉండొచ్చని, ప్రైవేట్ రంగ పెట్టుబడులు పెరిగితే మాత్రం 2018లో 7.3 శాతానికి పెరుగవచ్చంది. కాగా, పేదరిక నిర్మూలన, ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడుల్లో పురోగతి వంటివి నిలకడైన వృద్ధిరేటుకు దోహదపడగలవని చెప్పింది. ఇదిలావుంటే దక్షిణాసియా వృద్ధిరేటును భారత వృద్ధిరేటు పతనం ప్రభావితం చేస్తున్నదన్న ప్రపంచ బ్యాంకు.. దీనివల్ల తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాల తర్వాత దక్షిణాసియా దేశాల్లోనూ జీడీపీ క్షీణిస్తుండటంపై ఒకింత ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవిక జీడీపీ వృద్ధి 2016లో 7.1 శాతానికి పడిపోయింది. 2015-16లో 8 శాతంగా ఉంది అని బ్యాంక్ వెల్లడించింది.

114
Tags

More News

VIRAL NEWS