విప్రోకు సైబర్ దాడుల భయం

Mon,June 19, 2017 02:42 AM

Wipro is afraid of cyber attacks

wipro
న్యూఢిల్లీ, జూన్ 18: దేశీయ ఐటీ దిగ్గజం విప్రోకు సైబర్ దాడుల భయం పట్టుకుంది. సంస్థ వ్యాపారానికి పొంచి ఉన్న ముప్పుల్లో సైబర్ భద్రత ఉల్లంఘనలు కూడా ఒకటని విప్రో పేర్కొంది. ఒకవేళ సంస్థ ఐటీ వ్యవస్థపై సైబర్ దాడుల వల్ల తమ క్లయింట్లకు భారీ పరిహారం చెల్లించాల్సి రావచ్చని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్‌కు సమర్పించిన ఫైలింగ్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. క్లౌడ్‌కు అనుసంధానితమయ్యే కంప్యూటర్లు, సర్వర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని, తదనుగుణంగా సైబర్ దాడికి గురయ్యే అవకాశాలు కూడా పెరుగుతున్నాయని విప్రో పేర్కొంది. తమ ఐటీ వ్యవస్థను రక్షించుకునేందుకు తగిన ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు భద్రతా స్థాయిని సమీక్షించుకుంటున్నప్పటికీ.. అంతర్జాలంలో సంక్లిష్టత పెరుగుతున్న నేపథ్యంలో అన్ని సందర్భాల్లో సైబర్ దాడులను సమర్థవంతంగా నివారించడం సాధ్యపడకపోవచ్చని విప్రో అభిప్రాయపడింది. ఈమధ్యే భారత్‌తోపాటు వందకు పైగా దేశాల్లో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేట్ వెబ్‌సైట్లు, ఐటీ నెట్‌వర్క్‌లు వాన్నా క్రై ర్యాన్‌సమ్‌వేర్ దాడికి గురయ్యాయి. ఈ దాడికి గురైన వాటిల్లో చాలావరకు మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీ వంటి పాత వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే కంప్యూటర్లే. గత ఏడాదిలో కనీసం 138 కోట్ల రికార్డుల డాటా చౌర్యానికి గురైందని ఫిర్యాదులందాయి. అంటే, సెకండుకు 43 రికార్డుల చొప్పున హ్యాకింగ్‌కు గురయ్యాయన్నమాట.

సోషల్ మీడియాకు జంకుతున్న కార్పొరేట్ దిగ్గజాలు సామాజిక మాధ్యమాలతో తమ కీర్తి, ప్రతిష్ఠలకు భంగం వాటిల్లవచ్చని కార్పొరేట్ సంస్థల్లో ఆందోళన పెరిగింది. ఈమధ్యకాలంలో దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్, అంతర్జాతీయ పొగాకు ఉత్పత్తుల సంస్థ బ్రిటిష్ అమెరికన్ టొబాకో(బీఏటీ) ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేశాయి. ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ సైట్లలో తప్పుడు ఆరోపణల పోస్టింగ్‌లపై స్పందిస్తే వ్యాపారం నుంచి కంపెనీ బోర్డు, సీనియర్ మేనేజ్‌మెంట్ దృష్టి మళ్లే ప్రమాదం ఉందని, సంస్థ గౌరవానికి భంగం కలుగవచ్చని ఇన్ఫోసిస్‌తోపాటు పలు కార్పొరేట్లు అభిప్రాయపడుతున్నాయి.

151

More News

VIRAL NEWS