దిగొచ్చిన టోకు ధరలు


Tue,October 17, 2017 12:28 AM

గతనెలకు ద్రవ్యోల్బణ సూచీ 2.6 శాతంగా నమోదు
న్యూఢిల్లీ, అక్టోబర్ 16: కొన్ని నెలలుగా భగ్గుమన్న ఆహార పదార్థాల ధరలు దిగువముఖం పట్టాయి. ముఖ్యంగా కూరగాయల ధరలు భారీగా తగ్గడంతో గడిచిన నెలకుగాను టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 2.60 శాతానికి తగ్గడానికి దోహదపడింది. ఆగస్టు నెలలో ధరల సూచీ నాలుగు నెలల గరిష్ఠ స్థాయి 3.24 శాతానికి చేరుకున్న విషయం తెలిసిందే. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి నమోదైన 1.36 శాతంతో పోలిస్తే భారీగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. సెప్టెంబర్‌లో ఆహార పదార్థాలకు సంబంధించిన ద్రవ్యోల్బణం 2.04 శాతంగా నమోదైంది. ఆగస్టులో ఇది 5.75 శాతంగా ఉంది. రెండు నెలల క్రితం 44.91 శాతంగా ఉన్న కూరగాయల ధరల సూచీ ఆ మరుసటి నెలలో 15.48 శాతానికి పరిమితమైంది. కానీ ఉల్లి మరింత మండుతున్నది. గత నెలలో ఉల్లి ధరల సూచీ 70.78 శాతానికి చేరుకుంది. అలాగే కోడిగుడ్లు, మాంసం, చేపల ధరలు 5.47 శాతంగా ఉన్నాయి.
graph
తయారీ రంగ ఉత్పత్తుల సూచీ 2.45 శాతం నుంచి 2.72 శాతానికి చేరుకోగా, చమురు, ఇంధన రంగ సూచీ 9.01 శాతంగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుండటంతో గడిచిన రెండు నెలల్లో ఇంధన ధరల సూచీ భారీగా ఎగబాకింది. పప్పుదినుసుల ధరల సూచీ మాత్రం 24.26 శాతానికి తగ్గడం కొంత ఉపశమనాన్ని కల్గిస్తున్నది. అలాగే బంగాళాదుంప ధరలు 46.52 శాతంగాను, గోధుమలు 1.71 శాతంగా ఉన్నాయి. జూలై నెలకుగాను విడుదలైన టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

178

More News

VIRAL NEWS