పారిశ్రామిక గణాంకాలే కీలకం

Mon,November 11, 2019 03:55 AM

-మార్కెట్లపై అయోధ్య ప్రభావం స్వల్పమే
-మంగళవారం సూచీలకు సెలవు

న్యూఢిల్లీ, నవంబర్ 10: దేశీయ స్థూల ఆర్థికాంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు ఇప్పటికే ముగియగా, తాజాగా అయోధ్యపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేదని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. గురునానక్ జయంతి సందర్భంగా మంగళవారం స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో ట్రేడింగ్ నాలుగు రోజులకు పరిమితంకానున్నది. సోమవారం పారిశ్రామిక వృద్ధిరేటు గణాంకాలు, ఆ మరుసటి రోజు ద్రవ్యోల్బణ ధరల సూచీ, గురువారం టోకు ధరల సూచీ గణాంకాలు మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్న అంశాలు ఇవేనని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో ఈవారం విడుదల కానున్న స్థూల ఆర్థికాంశాలపై మదుపరులు ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉన్నది. వీటికి తోడు ఈవారంలోనే కోల్ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎన్‌ఎండీసీలతోపాటు మరిన్ని కార్పొరేట్ సంస్థలు తమ రెండో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలను విడుదల చేయబోతున్నాయి.

అయోధ్య తీర్పు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది తప్పా, స్టాక్ మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపే అంశం కాదని ట్రేడింగ్‌బెల్స్ సీనియర్ విశ్లేషకులు సంతోష్ మీనా తెలిపారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న సూచీలు మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయంగా అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కిరానుండటం కూడా మదుపరులు వీటిపై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, విదేశీ సంస్థాగత పెట్టుబడులు కూడా మార్కెట్లకు కీలకంకానున్నాయి. భారత రేటింగ్‌ను ప్రతికూలానికి తగ్గిస్తూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ దెబ్బకు గత శుక్రవారం ఒకేరోజు సెన్సెక్స్ 330 పాయింట్లు పడిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ గతవారంలో సెన్సెక్స్ 158.58 పాయింట్లు లాభపడింది. పడకేసిన వృద్ధికి మళ్లీ ఉత్తేజపరుచడానికి ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న కేంద్రం..గతంలోనే కార్పొరేట్ ట్యాక్స్‌ను భారీగా తగ్గించింది.

170
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles