అమెజాన్‌లో విజయ పాలు

Fri,February 22, 2019 12:54 AM

Vijaya Dairy Milk now available in Amazon

-ఇప్పటికే బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్, సూపర్‌డైలీలలో లభిస్తున్న ఉత్పత్తులు

హైదరాబాద్, నమస్తేతెలంగాణ: ఇక ఆన్‌లైన్‌లోనూ విజయ డెయిరీ పాలు లభించనున్నాయి. ఇందుకోసం విజయ డెయిరీ..బిగ్‌బాస్కెట్ డైలీ, ఫ్లిప్‌కార్ట్, సూపర్‌డైలీ వంటి ప్రముఖ ఆన్‌లైన్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నది. రెండు నెలల నుంచి ఈ మూడు ఆన్‌లైన్ సంస్థల్లో కంపెనీకి చెందిన ఉత్పత్తులు లభిస్తుండగా.. వచ్చే నెల నుంచి ప్రముఖ ఆన్‌లైన్ సంస్థ అమెజాన్‌కు చెందిన అమెజాన్ నౌ ద్వారా ఈ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయని పశు సంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన వెల్లడించారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే ఎలాంటి అదనపు కమీషన్ చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. అడ్వాన్స్ బుక్ చేసుకుంటే నెల, రెండు నెలల వరకు ఇంటికి పాలు, పెరుగు, ఇతర ఉత్పత్తులను పంపించే సదుపాయం కూడా ఉందన్నారు. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో ప్రారంభించిన ఈ సేవలను మున్ముందు ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తామని ఆయన వెల్లడించారు.
స్విగ్గీ ద్వారా కూడా...
బుకింగ్‌ల ద్వారా హోటళ్ల నుంచి ఆహార పదార్థాలను, ఇతర తినుబండారాలను సరఫరా చేస్తున్న స్విగ్గీతో కూడా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు విజయ డెయిరీ మార్కెటింగ్ వింగ్ ఇంఛార్జీ అరుణ్ తెలిపారు. తద్వారా తక్షణమే పాలు, పాల పదార్థాలు పొందడానికి వీలుంటుందని ఆయన తెలిపారు. కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులకు రాష్ట్రంలోనే కాకుండా... ఢిల్లీ, ముంబై నగరాల్లో బాగా డిమాండ్ ఉన్నది. ఢిల్లీ మార్కెట్‌లో విజయ నెయ్యికి ఎక్కువ ఆర్డర్లు ఉన్నట్లు వెల్లడించిన సుల్తానియా .. దూద్‌పేడకు అక్కడ ప్రజల్లో ఎక్కువ ఆదరణ లభిస్తుందని చెప్పారు. విజయ డెయిరీ అందిస్తున్న నాణ్యత కారణంగానే ఇతర రాష్ట్రాల్లో కూడా ఆదరణ లభిస్తోందని...రాష్ట్రంలో మరింత విస్తృత ప్రచారం కల్పించి వినియోగదారులకు అందుబాటులో విజయ పాల ఉత్పత్తులను తీసుకొస్తామన్నారు.

2048
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles