అంతా మీరే చేశారు..!

Wed,June 13, 2018 12:34 AM

Videocon blames PM Modi Supreme Court and Brazil for bad debt pile

-మా అప్పులకు కారణం ప్రధాని మోదీ, సుప్రీం కోర్టులే
-బ్రెజిల్ ప్రభుత్వం కూడా ముంచింది
-నిందించిన వీడియోకాన్ గ్రూప్
Videocon
న్యూఢిల్లీ, జూన్ 12: ఇదంతా మీ వల్లే.. మా వ్యాపార నష్టానికి, అప్పుల భారానికి కారణం మీరే అంటూ వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు, బ్రెజిల్ ప్రభుత్వాలను నిందించింది. రూ.39,000 కోట్ల రుణ భారంతో వీడియోకాన్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం దివాలా అంచున ఊగిసలాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ఆ సంస్థ.. మోదీ, సుప్రీం కోర్టు, బ్రెజిల్ సర్కారు నిర్ణయాలే మా కొంప ముంచాయని వ్యాఖ్యానించింది. వినడానికి వింతగా, ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తున్న వీడియోకాన్ వాదన లోతుల్లోకి వెళ్తే.. 2016 నవంబర్ 8వ తేదీ రాత్రి పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని ప్రధాని మోదీ చేసిన సంచలన ప్రకటన, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో భాగంగా 122 లైసెన్సులను రద్దు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోవడం, బ్రెజిల్‌లో చమురు, గ్యాస్ వ్యాపారాలపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించడం వంటివి మా వ్యాపారాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయంటూ వీడియోకాన్ చెప్పుకొచ్చింది. పాత రూ.500, 1,000 నోట్ల రద్దుతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి సరుకు సరఫరా నిలిచి కాథోడ్ రే ట్యూబ్ (సీఆర్‌టీ) టెలివిజన్ల తయారీ ఇబ్బందుల్లో పడిందని, దాంతో టీవీ మార్కెట్‌ను కోల్పోవాల్సి వచ్చిందని తెలిపింది.

ఇక అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై 2జీ స్పెక్ట్రం వేలంలో పొందిన టెలికం లైసెన్సులను సుప్రీం కోర్టు రద్దు చేసిందని, దీంతో టెలీకమ్యూనికేషన్ వ్యాపారానికి ముగింపు పలుకాల్సి వచ్చిందన్నది. అలాగే బ్రెజిల్‌లో తమ చమురు, గ్యాస్ వ్యాపారాలకు అక్కడి ప్రభుత్వంనుంచి ఎదురుదెబ్బ తగిలిందన్నది. ఒకప్పుడు మార్కెట్‌లో ఓ వెలుగు వెలిగిన ఈ కన్జ్యూమర్ అప్లియెన్సెస్ తయారీదారును ఎస్‌బీఐ నేతృత్వంలోని రుణదాతల కూటమి.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కు గత వారం లాగిన సంగతి విదితమే. దీంతో దివాలా ప్రక్రియలో భాగంగా రాబోయే 180 రోజుల్లో వీడియోకాన్ ఇండస్ట్రీస్ కొనుగోలుకు బిడ్డర్ల అన్వేషణ మొదలైంది. అయితే మా సంస్థ మాకే కావాలంటూ వీడియోకాన్ పోరాడుతున్నదని స్టాక్ మార్కెట్ల వివరాల ప్రకారం తెలుస్తున్నది. ఇందులో భాగంగానే పైవిధంగా వీడియోకాన్ గ్రూప్ వ్యాఖ్యానించింది. గడిచిన ఐదేండ్లకుపైగా కాలంలో వీడియోకాన్ షేర్ల విలువ ఏకంగా 96 శాతం దిగజారడం గమనార్హం.

1470
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles