జన్ ధన్ డిపాజిట్లు @ 64,564 కోట్లు

Mon,July 17, 2017 12:27 AM

Vague RBI guidelines see banks cap PM Jan Dhan Yojana accounts

PMJDY
న్యూఢిల్లీ, జూలై 16: దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లోని జన్ ధన్ ఖాతాల్లో డిపాజిట్లు సరికొత్త గరిష్ఠ స్థాయి రూ.64,564 కోట్లకు చేరుకున్నాయి. అందులో రూ.300 కోట్లకు పైగా నిధులు పెద్ద నోట్ల రద్దు తర్వాత మొదటి ఏడు నెలల కాలంలో వచ్చి చేరాయని ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తున్నది. దేశంలోని అన్ని కుటుంబాలను సంఘటిత బ్యాంకింగ్ సేవల పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా జూన్ 14 నాటికి 28.9 కోట్ల జన్‌ధన్ ఖాతాలను తెరిచారు. అందులో 23.27 కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తెరిచినవి కాగా.. గ్రామీణ బ్యాంకులు 4.7 కోట్ల ఖాతాలు, ప్రైవేట్ బ్యాంక్‌లు 92.7 లక్షల ఖాతాలు తెరిచాయి. సమాచార హక్కు చట్టప్రకారంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది. ఆర్థిక శాఖ వద్దనున్న సమాచారం ప్రకారం.. అన్ని జన్‌ధన్ ఖాతాల్లో కలిపి రూ.64,564 కోట్లు డిపాజిట్ అయ్యాయి. అందులో రూ.50,800 కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని ఖాతాల్లో డిపాజిట్ కాగా.. గ్రామీణ బ్యాంక్‌లలో రూ.11,683.42 కోట్లు, ప్రైవేట్ బ్యాంకుల్లో రూ.2,080.62 కోట్లు జమయ్యాయి.

ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ లోక్‌సభకు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాది నవంబర్ 16 నాటికి జన్ ధన్ ఖాతాల్లోని డిపాజిట్ల విలువ రూ.64,252.15 కోట్లుగా నమోదైంది. అప్పటి నుంచి ఈ ఏడాది జూన్ 14 వరకు డిపాజిట్లు మరో రూ.311.93 కోట్లు పెరిగాయి. గత ఏడాది నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. రద్దు చేసిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు డిసెంబర్ చివరివరకు గడువు ఇచ్చింది. అయితే, చాలామంది తమ వద్దనున్న నల్లధనాన్ని జన్ ధన్ ఖాతాల్లో జమ చేసినట్లుగా వార్తలొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఖాతాల్లో సొమ్ము డిపాజిట్‌పై పరిమితులు విధించిన విషయం తెలిసిందే.

346

More News

VIRAL NEWS