వడ్డీరేట్లు ఎక్కడివక్కడే

Thu,December 6, 2018 01:32 AM

Urjit Patel refuses to take questions on RBI govt spat Viral Acharyas remarks on autonomy

-యథాతథంగా రెపో, రివర్స్ రెపో
-రుణ లభ్యతను పెంచాలన్న దేశీయ పరిశ్రమ

ముంబై, డిసెంబర్ 5: ఊహించినట్లుగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెపో రేటు (వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్బీఐ తీసుకునే వడ్డీరేటు)ను 6.5 శాతంగానే ఉంచగా, రివర్స్ రెపో (వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటు)ను 6.25 శాతం వద్దే నిలిపింది. మొత్తం ఆరుగురు సభ్యులున్న ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీసీ).. కీలక వడ్డీరేట్ల జోలికి ఈసారి వెళ్లకూడదనే తీర్మానించింది. సోమవారం ఇక్కడ మొదలైన ఈ మూడు రోజుల ఈ ఆర్థిక సంవత్సరపు (2018-19) ఐదో ద్వైమాసిక ద్రవ్యవిధాన పరపతి సమీక్ష బుధవారం ముగియగా, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బలపడుతుండటం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పడిపోతుండటం మధ్య వేచిచూసే ధోరణిని ఎంపీసీ అవలంభించిందని పైసాబజార్ డాట్‌కామ్ సహవ్యవస్థాపకుడు, సీఈవో నవీన్ కుక్రెజా అన్నారు. మరోవైపు వ్యవస్థలో నగదు కొరతను తీర్చి.. రుణ లభ్యతను పెంచాలని దేశీయ వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఆర్బీఐని కోరాయి.

వడ్డీరేట్లను తగ్గిస్తాం: పటేల్

ద్రవ్యోల్బణం అదుపులో ఉంటే మున్ముందు కీలక వడ్డీరేట్లు తగ్గుతాయన్న సంకేతాలను ఇచ్చారు ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్. తాజా సమీక్షలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) ద్వితీయార్ధానికి (అక్టోబర్-మార్చి)గాను ద్రవ్యోల్బణం అంచనాలను 2.7-3.2 శాతం శ్రేణికి తగ్గించినప్పటికీ.. రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగానే ఉంచింది ఆర్బీఐ. ఆహార ధరలు పెరిగే వీలుండటం, కనీస మద్దతు ధరల ప్రభావం, నిలకడలేని ముడి చమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ల ఒడిదుడుకుల మధ్య ఈసారి రెపో, రివర్స్ రెపో జోలికి ఆర్బీఐ వెళ్లలేకపోయింది. అయితే ప్రతికూల పరిస్థితుల ప్రభావం ద్రవ్యోల్బణంపై లేకుంటే రాబోయే ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లు తప్పక తగ్గుతాయన్న ఆశాభావాన్ని పటేల్ ఈ సందర్భంగా కనబరిచారు. మరోవైపు చాలామంది నిపుణులు, బ్యాంకర్లు వచ్చే రెండు, మూడు ద్రవ్యసమీక్షల్లో రెపో రేటు తగ్గే అవకాశాలే లేవని చెబుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా దీర్ఘకాలికంగా కీలక వడ్డీరేట్ల సవరణ ఉండకపోవచ్చంటున్నాయి.

ఇక సాయం అక్కర్లేదు: విరాల్

గత రెండు నెలలుగా తీసుకున్న చర్యలతో నగదు కొరత, నిధుల సమస్యలను ఎదుర్కొంటున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ)కు ఉపశమనం లభించిందని, ఆర్బీఐ నుంచి వాటికి ఇక ఎలాంటి సాయం అక్కర్లేదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్లలో ఒకరైన విరాల్ ఆచార్య అభిప్రాయపడ్డారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణ సంక్షోభం, మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ)తో ఇబ్బందిపడుతున్న బ్యాంకులపై అమల్లో ఉన్న ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (పీసీఏ) నిబంధనలతో ద్రవ్యవ్యవస్థలో నగదు కొరత విజృంభించిన విషయం తెలిసిందే. వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలకు బ్యాంకింగేతర రంగం నుంచే రుణాలు ఎక్కువగా అందుతుండటంతో ఆర్బీఐ రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సూచించిన సంగతీ విదితమే. ఈ క్రమంలో బుధవారం ఆర్బీఐ ద్రవ్యసమీక్ష సందర్భంగా విలేఖరులతో విరాల్ ఆచార్య మాట్లాడుతూ ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయని, రుణాల లభ్యత పెరిగిందని, అన్ని రంగాల్లో వృద్ధి ఆశాజనకంగా కనిపిస్తున్నదని అన్నారు.

నిర్మాణ రంగానికి ఊతం: రియల్టర్లు

కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచడాన్ని నిర్మాణ రంగం స్వాగతించింది. ఆర్బీఐ నిర్ణయం ఊహించినదే అయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మార్కెట్ సెంటిమెంట్‌ను ఆర్బీఐ బలోపేతం చేసిందని, ఇండ్ల అమ్మకాలు పెరిగేందుకు ఇది ఎంతగానో దోహదపడగలదని నైట్ ఫ్రాంక్ సీఎండీ శిశిర్ బైజాల్ అన్నారు. వడ్డీరేట్లు పెరిగితే మార్కెట్ అవకాశాలు దెబ్బతినేవని అభిప్రాయపడ్డారు. జూన్, ఆగస్టు సమీక్షల్లో వడ్డీరేట్లు వరుసగా పెరుగడం వల్ల దేశీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమ ఎంతగానో నష్టపోవాల్సి వచ్చిందని జేఎల్‌ఎల్ ఇండియా దేశీయ అధిపతి రమేశ్ నాయర్ అన్నారు.

విభేదాలపై నో కామెంట్స్

కేంద్ర ప్రభుత్వం-ఆర్బీఐ మధ్య నెలకొన్న విభేదాలపై స్పందించేందుకు పటేల్ నిరాకరించారు. ద్రవ్యసమీక్ష అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలపై మాట్లాడుతూ ఇక్కడ మనం ద్రవ్యసమీక్ష సంగతుల్ని ముచ్చటించడానికి కలిశాం అన్నారు. డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య.. ఆర్బీఐ స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తికి సంబంధించి చేసిన వ్యాఖ్యలపైనా మాట్లాడేందుకు ససేమిరా అన్నారు. అక్టోబర్‌లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో తలెత్తిన అభిప్రాయభేదాల తర్వాత మీడియా ముందుకు ఆర్బీఐ రావడం ఇదే తొలిసారి. దీంతో అందరూ ఆయన్ను ఈ విభేదాలపైనే ప్రశ్నలు అడుగగా, పటేల్ మాత్రం తప్పించుకున్నారు.
rashish

ఎవరేమన్నారు.

ఆర్థిక వ్యవస్థలో రుణ విత రణను అత్యవసరంగా పెంచాల్సి ఉంది.క్రూడాయిల్ ధరలు తగ్గి న నేపథ్యంలో నిస్తేజిత ఆర్థిక వ్యవస్థలో పునరుత్తేజం కలిగిం చేందుకు మరిన్ని చర్యలు తీసు కోవాల్సి ఉంది.
- రశేష్ షా, అధ్యక్షుడు, ఫిక్కి
Rajnish-Kumar
కీలక వడ్డీ రేట్లను మార్కెట్ అంచనాలకు అనుగుణంగా యథాతథ స్థితిలో కొన సాగించింది. అయితే గైడెన్స్ మాత్రం ఆశ్చర్యం కలిగించింది. ద్రవ్యోల్బణ అంచనాలను గణనీ యంగా తగ్గించడం, లిక్విడిటీని పెంచడం కోసం వంటి చర్యలతో సమీప భవిష్యత్‌లో వడ్డీరేట్లను అంచనా వేయగలం. రూపాయిపై వడ్డీని హెడ్జ్ చేసు కునేందుకు ఎన్‌ఆర్‌ఐలకు అనుమతించడం ఆహ్వానిం చతగ్గ నిర్ణయం.
- రజనీష్ కుమార్, ఛైర్మన్, ఎస్‌బీఐ
Head-Treasury
వచ్చే జనవరి నుంచి ఎల్‌సీఆర్‌కు అనుగుణంగా ఎస్‌ఎల్‌ఆర్‌ను 150 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడం వల్ల ప్రభుత్వ సెక్యూరీటీలలో ఉన్న నిధులను రుణవితరణకు విని యోగించే వీలు కలుగుతుంది. ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని తగ్గించడం వల్ల స్వల్పకాలికంగా సెంటిమెంట్ మెరుగు పడుతుంది. ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించడంతో బాండ్లలో ర్యాలీ వచ్చింది. లిక్విడిటీకి సంబంధించి నిర్మాణాత్మక, వ్యవస్థాగతంగా ఉన్న అంశాలను పరిష్కరించే దిశగా పాలసీ ఉంది.
- ఆర్ కే గురుమూర్తి, లక్ష్మీ విలాస్ బ్యాంక్ ట్రెజరీ హెడ్

1277
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles