కొచ్చర్ కథ కంచికేనా?

Mon,April 16, 2018 01:09 AM

Two years back RBI found no quid pro quo in ICICI loans to Videocon RBI docs

-రోజురోజుకూ మసకబారుతున్న ప్రతిష్ఠ
-ఐసీఐసీఐ బ్యాంక్‌లో సన్నగిల్లుతున్న విశ్వాసం
బలవంతపు రాజీనామాకు పెరుగుతున్న ఒత్తిడి
-బోర్డులో మధ్యంతర సీఈవో కోసం అంతర్గత అన్వేషణ

Kochhar
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: చందా కొచ్చర్.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ శక్తిమంత మహిళల్లో ఒకరు. కార్పొరేట్ రంగంలో రారాణి. ఐసీఐసీఐ బ్యాంకులో తిరుగులేని అధికారం. అయితే ఇదంతా ఒకప్పుడు. నాణేనికి రెండు వైపులున్నట్లే ఇప్పుడు చందా కొచ్చర్ జీవితంలోనూ రెండు కోణాలు బయటపడుతున్నాయి. దీంతో ఐసీఐసీఐలోనూ ఆమెపై విశ్వాసం సన్నగిల్లుతున్నది. వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్‌తో కొచ్చర్ కుటుంబానికి ఉన్న సంబంధాలు.. ఆ సంస్థకు ఐసీఐసీఐ ఇచ్చిన రూ.3,250 కోట్ల రుణాన్ని వివాదాస్పదం చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశం బ్యాంక్ సీఈవోగా చందా కొచ్చర్‌పై బంధుప్రీతి, అవినీతి ఆరోపణలకూ కారణమవగా, ఐసీఐసీఐతో దాదాపు మూడున్నర దశాబ్దాల అనుబంధం ముక్కలైపోయింది. సుమారు పదేండ్లుగా బ్యాంక్ ఎండీ, సీఈవోగా ఆమె సాధించిన విజయాలను మసకబార్చింది.

ప్రస్తుత పరిణామాలు ఆమె పరువును మంటగలిపేస్తుండగా.. బలవంతపు రాజీనామాకూ దారితీస్తున్నాయి. వీడియోకాన్ కేసు వ్యవహారంలో ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. చందా కొచ్చర్ మరిది రాజీవ్ కొచ్చర్‌ను వరుస విచారణలు చేస్తుండగా, చందా కొచ్చర్‌తోపాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లపై లుకౌట్ నోటీసులనూ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుత దర్యాప్తులో చందా కొచ్చర్ నిజాయితీ బయటపడేదాకా ఆమె తన పదవి నుంచి తప్పుకోవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు నిన్నమొన్నటిదాకా చందా కొచ్చర్‌పై ఎనలేని విశ్వాసం కనబరుస్తూ వచ్చిన ఐసీఐసీఐ బోర్డు కూడా.. కొత్తకొత్త విషయాలు వెలుగుచూస్తుండటంతో అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నది. దీంతో బోర్డులో కొచ్చర్‌కున్న ప్రభుభక్తికి బీటలు వారుతున్నాయి.

ఫలితంగా కొచ్చర్ కథ ఇక కంచికేనా? అన్న సందేహాలూ వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై కొచ్చర్ వివరణ ఇచ్చే వీలున్నట్లు కూడా తెలుస్తున్నది. కాగా, వీడియోకాన్ కేసు దర్యాప్తు వేగవంతమవుతున్న నేపథ్యంలో రాబోయే మూడు, నాలుగు నెలల్లో కొచ్చర్ తన పదవి నుంచి తప్పుకునే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మాజీ చీఫ్ ఎం దామోదరన్ జోస్యం చెప్పారు. వాటాదారులు, సంస్థాగత మదుపరులు అడుగుతున్న ప్రశ్నలు, వార్తా పత్రికల కథనాలు, దర్యాప్తు సంస్థల విచారణల మధ్య కొచ్చర్ తనంతట తానైనా తప్పుకోవాలి, లేదంటే బోైర్డెనా పక్కకు పెట్టడం ఖాయమన్న అంచనాల్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. 2012లో 20 బ్యాంకుల నుంచి వీడియోకాన్ గ్రూప్ రూ.40,000 కోట్ల రుణాలను పొందగా, అందులో ఐసీఐసీఐ బ్యాంకిచ్చిన రూ.3,250 కోట్ల రుణం కూడా ఉన్నది.

తన భర్త దీపక్, వీడియోకాన్ అధిపతి ధూత్‌ల మధ్య ఉన్న వ్యాపార సంబంధాల కారణంగానే ఈ రుణాన్ని చందా కొచ్చర్ మంజూరు చేసిందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అంతేగాక వీడియోకాన్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్.. చందా కొచ్చర్ కుటుంబాల మధ్య లావాదేవీలకు రెండు దశాబ్దాల చరిత్రనే ఉందని తెలుస్తున్నది. కొచ్చర్ కుటుంబ సభ్యులకు, వీడియోకాన్ గ్రూప్‌నకు క్రెడెన్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే సంస్థతో వ్యాపార సంబంధాలు ముడిపడి ఉన్నాయి. పైగా దీపక్, ధూత్‌లు ప్రత్యేకంగా నూపవర్ సంస్థనూ స్థాపించగా, ఐసీఐసీఐ రుణాన్ని అందుకున్న ఆరు నెలలకే నూపవర్‌లోని రూ.64 కోట్ల విలువ చేసే షేర్లను కేవలం రూ.9 లక్షలకే దీపక్‌కు ధూత్ ఇచ్చినట్లు సమాచారం ఉన్నది. ప్రస్తుతం ఐసీఐసీఐ రుణం మొండి బకాయిల జాబితాలో ఉండగా, చందా కొచ్చర్ భవితవ్యంపైనా నీలినీడలు కమ్ముకున్నాయి.

క్విడ్‌ప్రోకో దాఖలాల్లేవట!

ముంబై: వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్ రుణాల పొడిగింపులో వచ్చిన ఆరోపణలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాదాపు రెండేండ్ల క్రితమే దర్యాప్తు చేసింది. అయితే దర్యాప్తులో భాగంగా జరిగిన సమగ్ర పరిశీలనలో ఎలాంటి క్విడ్‌ప్రోకో దాఖలాలు బయటపడలేదని ఆర్బీఐ చెబుతున్నది. ఈ ఆరోపణలపై విచారణకు ప్రధాని కార్యాలయం సిఫార్సు చేసిన నేపథ్యంలో మొత్తం ఈ రుణ వ్యవహారంపై 2016 జూలైలోనే ఆర్బీఐ స్రూటినీ నిర్వహించగా, ఎలాంటి అక్రమాలను తాము గుర్తించలేదని ఆర్బీఐ అంటున్నది. ఈ రుణ వ్యవహారం చందా కొచ్చర్ పదవికే ముప్పు తెచ్చిపెడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ దర్యాప్తు వివరాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయినప్పటికీ చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్‌కు చెందిన నూపవర్‌లో మారిషస్ ఆధారిత ఫస్ట్ లాండ్ హోల్డింగ్స్ రూ.325 కోట్లు పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఆర్బీఐ అనుమానాల్ని వ్యక్తం చేసింది.

రేసులో ఎవరున్నారంటే..

వీడియోకాన్ వ్యవహారం నేపథ్యంలో చందా కొచ్చర్ తప్పుకున్నైట్లెతే.. ఆమె స్థానంలోకి వచ్చేదెవరన్నది ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డులోనూ మధ్యంతర సీఈవో కోసం అంతర్గత అన్వేషణ జరుగుతున్నట్లు తెలుస్తున్నది. బ్యాంక్ నూతన ఎండీ, సీఈవో రేసులో కొందరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల పేర్లూ జోరుగా వినిపిస్తున్నాయి. ఐసీఐసీఐకి సీఈవోల కర్మాగారం అన్న పేరున్న నేపథ్యంలో ఈ జాబితా కాస్త పెద్దగానే ఉన్నది. లలితా గుప్తా, కల్పనా మోర్పారియా, ఎస్ ముఖర్జీ, నచికేత్ మోర్, హెచ్‌ఎన్ సైనర్ వంటి సీనియర్లు వెళ్లిపోయినప్పటికీ.. ఇంకా ఓ ఆరుగురు సీనియర్లు మాత్రం లైన్‌లోనే ఉన్నారు.

సందీప్ బక్షీ

57 ఏండ్ల సందీప్ బక్షీ పేరు జాబితాలో ముందున్నది. ప్రస్తుతం ఈయన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అధిపతిగా ఉన్నారు. గతంలో కొంతకాలం బ్యాంక్ డిప్యూటీ ఎండీగా కూడా పనిచేశారు.

విశాఖ ములీ

బ్యాంక్‌లో హోల్‌సేల్ బ్యాంకింగ్ అధిపతిగాఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్నారు. వ్యూహ, కోశ, ఆర్థిక నిర్మాణాల్లో మంచి అనుభవం ఈమె సొంతం. కేవీ కామత్ హయాంలో ఐసీఐసీఐ గ్రూప్ సీఎఫ్‌వోగా కూడా పనిచేశారు.

అనుప్ బగ్చీ

ఐసీఐసీఐ బ్యాంక్ రిటైల్ పోర్ట్‌ఫోలియో బాధ్యతల్ని మోస్తూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఈయన పనిచేస్తున్నారు. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లో దీర్ఘకాలం పనిచేసిన బగ్చీ.. అందులో ఎండీ, సీఈవోగా బాధ్యతల్ని నిర్వర్తించారు.

ఎన్‌ఎస్ కన్నన్

ఫైనాన్స్, ట్రెజరీ తదితర శాఖల బాధ్యతలతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఐసీఐసీఐ బ్యాంక్‌లో చాలాకాలం నుంచి కన్నన్ పనిచేస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో విశేష అనుభవం ఈయనకున్నది.

భార్గవ్ దాస్‌గుప్తా

ఐసీఐసీఐ గ్రూప్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఐసీఐసీఐ లాంబార్డ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా పనిచేస్తున్నారు. బీమా రంగంలో ఐసీఐసీఐ విజయవంత ప్రయాణంలో ఈయన పాత్ర గొప్పదే.

నిమేశ్ షా

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా ఈయన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. భారత్-22 ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్)ను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీనే నిర్వహిస్తున్నది.

802
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS