సంధి కుదిరింది

Sun,October 13, 2019 02:40 AM

-చైనాతో అమెరికా తొలి దశ వాణిజ్య ఒప్పందం
-రైతులకు గొప్ప లాభమన్న ట్రంప్

వాషింగ్టన్/బీజింగ్, అక్టోబర్ 12:ఏడాదికిపైగా కొనసాగిన అమెరికా-చైనా వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. చైనాతో తొలి దశ ట్రేడ్ డీల్ కుదిరిందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చైనా ఉప ప్రధాని లూ హీతో సమావేశం అనంతరం వైట్‌హౌజ్‌లో విలేకరులతో మాట్లాడుతూ మేధో సంపత్తి, ఆర్థిక సేవలపై ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఎంతో సమగ్రమైన ఈ సంధితో రైతులకూ గొప్ప లాభాలున్నాయన్న ఆయన 40-50 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయోత్పత్తులకు డిమాండ్ ఏర్పడిందని, రైతులు ఇందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అమెరికా నుంచి చైనా 17 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయోత్పత్తులనే కొనుగోలు చేస్తున్నదని, ఈ ఒప్పందం నేపథ్యంలో 40-50 బిలియన్ డాలర్ల కొనుగోళ్లకు మార్గం సుగమమైందన్నారు. కాబట్టి రైతులు మరింత వ్యవసాయ భూమిని సమీకరించుకోవాలని, భారీ ట్రాక్టర్లను వినియోగించాలని సూచించారు. ఇదిలావుంటే రెండో దశ వాణిజ్య ఒప్పందంలో చైనా టెక్నాలజీ దిగ్గజం హువావీపై నిషేధం అంశం ప్రస్తావనకు వచ్చే వీలుందని ట్రంప్ సర్కారు సంకేతాలిస్తున్నది. తొలి దశ డీల్ పూర్తయిన వెంటనే రెండో దశ డీల్‌కు వెళ్తామని అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్ మ్నూచిన్ తెలిపారు. కాగా, తాజా డీల్‌తో ఈ నెల చైనాపై ట్రంప్ విధిస్తామన్న సుంకాలు వాయిదా పడనున్నాయి. అమెరికాలోకి వస్తున్న చైనా దిగుమతుల్లో మరో 250 బిలియన్ డాలర్ల విలువైన వాటిపై సుంకాలను పెంచాలని ట్రంప్ నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ డీల్‌తో న్యూయార్క్ స్టాక్ మార్కెట్ కూడా లాభాల్లో పరుగులు తీస్తున్నది. ఈ రెండు అగ్ర దేశాల మధ్య నెలకొన్న సుంకాల సమరం.. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లనేగాక ప్రపంచ ఆర్థిక వ్యవస్థనూ దెబ్బ తీసిన విషయం తెలిసిందే.

స్వాగతించిన కంపెనీలు

అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందాన్ని వ్యాపార, పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. గత 15 నెలలుగా నడుస్తున్న వాణిజ్య యుద్ధానికి తెరపడిందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాయి. చైనా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న స్మార్ట్‌ఫోన్లు, ఇతర 160 బిలియన్ డాలర్ల విలువైన వస్తూత్పత్తులపై డిసెంబర్‌లో 15 శాతం సుంకం వేస్తామన్న ట్రంప్ ప్రకటనా వెనుకకు పోవాలని, రెండో దశ ఒప్పందం కూడా కుదురాలని ఆకాంక్షించారు. మొదటి డీల్‌తో వ్యవసాయ సంస్థలకు గొప్ప లాభం చేకూరిందన్నారు.

574
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles