ఇంకెంతో కాలం భరించలేం

Wed,July 10, 2019 04:17 AM

Trump issues a fresh tariffs threat to India before trade talks this week

-అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలపట్ల ట్రంప్తీరు మారకపోతే ఇబ్బందేనని మరోసారి హెచ్చరిక
వాషింగ్టన్, జూలై 9: అమెరికా ఉత్పత్తులపై భారత్ సుంకాలను మరోసారి ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. ఇంకెంతో కాలం వీటిని సహించలేమంటూ మంగళవారం హెచ్చరించారు. ఇటీవలి జపాన్ జీ-20 సమావేశాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయిన కొద్దిరోజుల వ్యవధిలోనే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నాడు ద్వైపాక్షిక వాణిజ్యంపై ఇరు దేశాల అధినేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ వాణిజ్య వివాదాలను రెండు దేశాల వాణిజ్య శాఖ మంత్రుల చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ట్రంప్, మోదీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాపై భారత్ అధిక సుంకాలు కొనసాగుతున్నాయి. వీటిని ఇంకెంతో కాలం భరించలేం అని ట్వీట్ చేశారు. ఈ వారం అమెరికా వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రాస్, ఇంధన శాఖ మంత్రి రిక్ పెర్రీ.. వాషింగ్టన్ డీసీలో ఓ భారీ భారతీయ సదస్సునుద్దేశించి మాట్లాడనున్నారు. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు భారత్‌పట్ల అమెరికా వైఖరికి అద్దం పట్టేలా ఉన్నాయి. ఇదే నిజమైతై రాబోయే సదస్సులో అగ్రరాజ్య మంత్రులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

తరచూ విమర్శలు

ఇటీవలికాలంలో భారత్‌ను టారీఫ్ కింగ్‌గా ట్రంప్ తరచూ అభివర్ణిస్తున్న సంగతీ విదితమే. వీలు చిక్కినప్పుడల్లా భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. చాలా కాలం నుంచి అమెరికా ఉత్పత్తులపై భారత్‌లో అధిక సుంకాలు పడుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీతో దీని గురించి మాట్లాడాలని చూస్తున్నాను. ఈ మధ్యనే ఈ సుంకాల భారాన్ని మరింత పెంచారు కూడా. వీటిని తప్పక ఉపసంహరించాలి అని జీ-20 సమావేశాలకు వెళ్తూ కూడా ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పటికే అమెరికా మంత్రి పాంపి యో.. భారత్‌లో పర్యటించి ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమై వాణిజ్య సుంకాలు తదితర అంశాలపై చర్చించారు. భారత ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా సుంకాలు విధించడం, భారత్‌కున్న వాణిజ్య ప్రాధాన్య హోదా (జీఎస్పీ)ను తొలగించడం మధ్య మోదీ సర్కారు సైతం అమెరికాకు చెందిన 28 ఉత్పత్తులపై సుంకాలను పెంచినది తెలిసిందే. ఏటా అమెరికాకు భారత్ నుంచి దాదాపు 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ ఎగుమతులు 47.9 బిలియన్ డాలర్లుగా నమోదైయ్యాయి. అమెరికా నుంచి భారత్‌కు దిగుమతులు 26.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్యపరంగా అమెరికా వెనుకబడిన దేశాలతో సుంకాల సమరానికి ట్రంప్ కాలు దువ్వుతుండగా, చైనాతోనూ ఇదే కారణంగా వాణిజ్య యుద్ధానికి తెర తీశారు.

వద్ద టెక్కీల ఆందోళన

ట్రంప్భారత్ డేటా లోకలైజేషన్‌పై అమెరికా టెక్నాలజీ సంస్థలు ట్రంప్ వద్ద ఆందోళన వ్యక్తం చేశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. దేశీయ చెల్లింపుల సమాచారాన్ని స్థానికంగానే భద్రపరుచాలంటూ స్పష్టం చేసిన నేపథ్యంలో అమెరికాకు చెందిన గూగుల్, మాస్టర్‌కార్డ్, వీసా, అమెజాన్ సంస్థలు.. ట్రంప్‌కు తమ గోడును వెళ్లబోసుకున్నాయి. ఆర్బీఐ నిబంధనలకు తలొగ్గితే నిర్వహణ ఖర్చులు పెరుగుతాయని చెప్పాయి. దీంతోనే వాణిజ్యపరంగా భారత్‌పై ఒత్తిడిని పెంచే వ్యూహాన్ని ట్రంప్ అమలు చేస్తున్నారని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

1761
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles