పెరిగిన ఆస్తి-అంతస్తులు

Thu,November 22, 2018 12:35 AM

Top 100 realtors wealth soars 27% to Rs 2.37 tln in 2018

-రియల్టర్ల సంపద రయ్.. రయ్
-దేశంలోని టాప్-100 రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద రూ.2.37 లక్షల కోట్లు
-రూ.27,150 కోట్లతో మొదటి స్థానంలో మంగళ్ లోధా.. 14వ స్థానంలో రామేశ్వర్ రావు జూపల్లి

ముంబై, నవంబర్ 21: దేశీయ నిర్మాణ రంగం సంక్షోభంలో ఉన్నప్పటికీ.. బడా రియల్టర్ల సంపద మాత్రం భారీగానే పెరుగుతున్నది. టాప్-100 రియల్టర్ల సంపద ఈ ఏడాది 27 శాతం పుంజుకోగా, రూ.2.37 లక్షల కోట్లకు చేరింది. ముంబైకి చెందిన బీజేపీ సీనియర్ నేత, లోధా గ్రూప్ వ్యవస్థాపకుడైన మంగళ్ ప్రభాత్ లోధా అందరికంటే ముందంజలో ఉన్నారు. తెలంగాణకు చెందిన మై హోం కన్‌స్ట్రక్షన్స్ అధినేత రామేశ్వర్ రావు జూపల్లి 14వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో తొలిసారి స్థానం సంపాదించినా టాప్-10కు సమీపంలోకి రావడం విశేషం. కాగా, దేశీయ నిర్మాణ రంగ దిగ్గజం డీఎల్‌ఎఫ్ గ్రూప్ వ్యవస్థాపకుడు కుషల్ పాల్ సింగ్ టాప్-10లో కూడా లేకపోవడం గమనార్హం. గతేడాది జాబితాలో సింగ్ మొదటి స్థానంలో ఉన్నారు. హురున్ సంపన్నుల జాబితా-2018 ప్రకారం 62 ఏండ్ల లోధా సంపద విలువ అత్యధికంగా రూ.27,150 కోట్లుగా ఉన్నది. గతేడాది రూ.18,610 కోట్లతో రెండో స్థానంలో ఉన్న లోధా.. కేవలం ఏడాది వ్యవధిలో దాదాపు రూ.10,000 కోట్ల సంపదను పెంచుకోవడం విశేషం. మరోవైపు నిరుడు రూ.23,460 కోట్లతో అగ్రస్థానంలో ఉన్న డీఎల్‌ఎఫ్ అధినేత కుషల్ పాల్ సింగ్.. ఈ యేడు టాప్-10లోనూ చోటు దక్కించుకోలేకపోయారు. అయితే ఆయన కుమారుడు రాజీవ్ సింగ్ రూ.17,690 కోట్లతో ఈసారి మూడో స్థానంలో నిలిచారు. డీఎల్‌ఎఫ్ రోజువారి కార్యకలాపాల నుంచి వైదొలిగిన కుషల్ పాల్ సింగ్.. తన షేర్లను కుమారుడు రాజీవ్‌కు, కూతురు ప్రియాకు బదిలీ చేయడం ఇందుకు దోహదం చేసింది. ఇక బెంగళూరు ఆధారిత ఎంబసీ గ్రూప్‌నకు చెందిన జితేంద్ర విర్వాణీ రూ.23,160 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

రూ.14,420 కోట్ల సంపదతో కే రహేజా గ్రూప్‌నకు చెందిన చంద్రూ రహేజా నాలుగో స్థానంలో, రూ.10,980 కోట్ల ఆస్తులతో వికాస్ ఒబెరాయ్ ఐదో స్థానంలో ఉన్నారు. ఆరు, ఏడు స్థానాల్లో హీరానందని సోదరులుండగా, నిరంజన్ (హీరానందని గ్రూప్), సురేంద్ర (హౌజ్ ఆఫ్ హీరానందని)ల సంపద రూ.7,880 కోట్ల చొప్పున ఉన్నట్లు తేలింది. ముకేశ్ అంబానీ వియ్యంకుడు అజయ్ పిరామల్ కుటుంబం ఎనిమిదో స్థానంలో నిలిచింది. వీరి సంపద రూ.6,380 కోట్లుగా నమోదైంది. బిలియనీర్ సోదరులు మనోజ్ మెందా, రాజ్ మెందాలు తొమ్మిది, పదో స్థానాల్లో ఉండగా, వీరి సంపద రూ.5,900 కోట్ల చొప్పున ఉన్నది. ఈ ఏడాది టాప్-100 రియల్ ఎస్టేట్ డెవలపర్ల సంపద రూ.2,36,610 కోట్లుగా ఉన్నది. గతేడాది ఇది రూ.1,86,700 కోట్లే. ఈ ఏడాది కాలంలో 27 శాతం పెరిగింది అని హురున్-గ్రోహ్ ఇండియా (జర్మనీ శానిటరీ వేర్ తయారీదారు) ధనవంతుల జాబితా-2018 పేర్కొన్నది. ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరు నాటికి ఉన్న సంపద వివరాలతో ఈ జాబితా రూపొందగా, నాడు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ప్రకారం లెక్కించారు. అప్పుడు రూపాయి విలువ 72.46గా నమోదైంది.
Lodha

తాజా జాబితాలో దాదాపు 59 శాతం మంది తొలి తరం ఎంటర్‌ప్రెన్యూర్సే ఉన్నారు. కాగా, ఈ 100 మంది సంపన్న రియల్టర్లలో 35 మంది ముంబైలో ఉంటున్నవారే. ఢిల్లీ వాస్తవ్యులు 22 మంది, బెంగళూరుకు చెందినవారు 21 మంది ఉన్నారు. పుణె వాసులు ఐదుగురని హురున్ తెలిపింది. ఈ శ్రీమంతుల సగటు వయసు 59 ఏండ్లవగా, బెంగళూరుకు చెందిన ఆర్‌ఎంజెడ్ గ్రూప్ కునాల్ మెందా (24 ఏండ్లు) చిన్న వయస్కుడిగా, ఈస్ట్ ఇండియా హోటల్స్‌కు చెందిన పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ (89 ఏండ్లు) పెద్ద వయస్కుడిగా ఉన్నారు. 40 ఏండ్లలోపున్నవారు నలుగురే అవగా, మొత్తం జాబితాలో తొమ్మిది మంది మహిళలున్నారు. డీఎల్‌ఎఫ్‌కు చెందిన రేణుకా తల్వార్ 19వ స్థానంలో ఉండగా, 10 మంది కొత్తవారికి చోటు దక్కింది. ప్రపంచంలోనే జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశమైన భారత్‌లో ఇండ్లు లేనివారే చాలా ఎక్కువని, కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఎప్పటికీ లాభదాయకమేనన్న అభిప్రాయాన్ని ఈ సందర్భంగా హురున్ రిపోర్ట్ ఇండియా చీఫ్ రిసెర్చర్, ఎండీ అనస్ రెహమాన్ వ్యక్తం చేశారు. మున్ముందు కాలంలో మరింతగా రియల్టర్ల సంపద పుంజుకోవచ్చన్న అంచనాను వెలిబుచ్చారు.

ఆగని భారతీయుల వలసలు


migration
ఓవైపు దేశంలో సంపద పెరుగుతున్నా.. మరోవైపు భారతీయులు విదేశాలకు వలసపోతూనే ఉన్నారు. గతేడాది కోటీ 70 లక్షల మంది వివిధ దేశాలకు వెళ్లిపోయారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా వలసపోతున్న దేశస్తుల్లో భారత్ మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. ఐక్యరాజ్యసమితి ఆర్థిక వ్యవహారాల విభాగం నుంచి సేకరించిన ఇండియాస్పెండ్ ఎనాలసిస్ గణాంకాల ప్రకారం 1990లో 70 లక్షలుగా ఉన్న వార్షిక వలసలు.. 2017కు 143 శాతం పెరిగి 1.70 కోట్లకు చేరాయి. నిజానికి ఈ 27 ఏండ్లలో దేశ తలసరి ఆదాయం 522 శాతం ఎగిసింది. నాడు రూ.80,661.42గా ఉంటే, నేడు రూ.5,01,822.15గా ఉన్నది. అయినప్పటికీ పరాయి దేశాలకు వలసలు మాత్రం తగ్గడం లేదు. కాగా, విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వెళ్లేవారి కంటే కూడా ఉపాధి నిమిత్తం భారత్ నుంచి వెళ్తున్నవారే ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. అలాగే 2011తో పోల్చితే 2017లో నైపుణ్యం లేనివారి వలసలు 6,37,000ల నుంచి 3,91,000లకు పడిపోయాయని కూడా ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) తాజా నివేదిక చెబుతున్నది.

Rameswar-Rao-Jupally

1612
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles