ఎన్‌పీఏలు తగ్గితే జీడీపీకి బలం

Tue,April 16, 2019 12:32 AM

-ఈసారి వృద్ధిరేటు 60 బేసిస్ పాయింట్లు పెరుగొచ్చు..
-గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా

ముంబై, ఏప్రిల్ 15: ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా బ్యాంకింగ్ రంగం కీలకం. బ్యాంకులు బలంగా ఉంటే.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పరిపుష్ఠిగా ఉన్నట్లే. అమెరికాకు చెందిన ప్రముఖ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భారతీయ బ్యాంకులు లాభపడుతున్నకొద్దీ.. దేశ జీడీపీ పెరుగుతూ పోతుందని చెప్పింది. దేశీయ బ్యాంకింగ్ రంగంలో ప్రమాదకర స్థాయిలో ఉన్న మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) తగ్గుతుండటం భారత వృద్ధిరేటును పెంచుతుందని, ఈ పరిణామం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో 0.60 శాతం జీడీపీకి ఊతమివ్వగలదని అభిప్రాయపడింది. మొండి బకాయిలు తగ్గితే బ్యాంకుల లాభాలు పెరుగుతాయని, రుణాల మంజూరు కూడా అధికమవుతుందని, దీనివల్ల అన్ని ప్రధాన రంగాల్లో కార్యకలాపాలు పుంజుకుంటాయని వివరించింది. 1.40 శాతం రుణ లభ్యత పెరిగితే.. వ్యవస్థలో 2 శాతం పెట్టుబడుల వృద్ధికి ఆస్కారముంటుంది. జీడీపీ 0.60 శాతం పెరుగవచ్చు అని సోమవారం గోల్డ్‌మన్ సాచ్స్ చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ నెలారంభంలో ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ 7.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఫిబ్రవరి అంచనా కంటే ఇది 20 బేసిస్ పాయింట్లు తక్కువ. అయితే బ్యాంకింగ్ రంగంలో ఎన్‌పీఏలు తగ్గితే.. వృద్ధిరేటు పెరుగుతుందని గోల్డ్‌మన్ సాచ్స్ చెబుతుండటాన్ని చూస్తే ఈసారి జీడీపీ ఆర్బీఐ అంచనాలకు మించి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 2.30 శాతంగా ఉన్న ఎన్‌పీఏలు.. 2019-20లో 1.20 శాతానికి తగ్గే వీలుందని, ఇదే జరిగితే మొండి బకాయిలు రూ.3.3 లక్షల కోట్ల నుంచి రూ.1.9 లక్షల కోట్లకు రావచ్చని చెప్పింది.

432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles