ప్రపంచ కుబేరుల్లో బిల్‌గేట్స్ టాప్

Tue,March 21, 2017 12:34 AM

-భారీగా తగ్గిన ట్రంప్ ర్యాంకింగ్
-33వ స్థానంలో ముకేశ్ అంబానీ
-భారత్ నుంచి 101 మందికి చోటు

billgates
న్యూయార్క్, మార్చి 20: ప్రముఖ అమెరికన్ మ్యాగజైన్ ఫోర్బ్స్.. ఈ ఏడాదికి గాను ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌కు మరోసారి అగ్రస్థానం దక్కింది. ఇక అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాంక్ మాత్రం 220 పాయింట్లు పడిపోయింది. గతసారి జాబితాలో 1,810 మందికి ఈ జాబితాలో చోటు లభించగా.. ఈ ఏడాది సంఖ్య 13 శాతం పెరిగి 2,043 మందికి చేరుకుంది. అందులో అధిక మంది అమెరికన్లే. భారత్ నుంచి 101 మంది ఈ జాబితాలో నిలిచారు. దేశంలో అత్యంత ధనవంతుడిగా పేరున్న ముకేశ్ అంబానీకి 33వ స్థానం దక్కింది. స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్‌కు 56వ స్థానం, హిందూజా సోదరులకు 64వ స్థానం, విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీకి 72వ స్థానం, షాపూర్‌జీ పల్లోంజీ చైర్మన్ అయిన పల్లోంజీ మిస్త్రీకి 77వ స్థానం, సన్‌ఫార్మా చీఫ్ దిలీప్ సంఘ్వీకి 84వ స్థానం, హెచ్‌సీఎల్ చైర్మన్ శివ్‌నాడార్‌కు 102వ స్థానం లభించింది. అంటే, టాప్-100లో మనోళ్లు ఆరుగురేనన్నమాట. గత 31 ఏండ్లుగా ఫోర్బ్స్ మ్యాగజైన్ శ్రీమంతుల జాబితాను విడుదల చేస్తున్నది. ఈసారి రికార్డు స్థాయిలో అత్యధిక మంది లిస్ట్‌లో స్థానం దక్కించుకోగలిగారు.

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్ 8,600 కోట్ల డాలర్ల ఆస్తితో ఫోర్బ్స్ రిచ్ లిస్ట్‌లో నంబర్ వన్‌గా నిలిచారు. ఆయనకు జాబితాలో మొదటి స్థానం దక్కడం ఇది వరుసగా నాలుగోసారి. ప్రపంచంలోని ప్రముఖ స్టాక్ ఇన్వెస్టర్‌గా పేరున్న బెర్క్‌షైర్ హ్యాత్‌వే చీఫ్ వారెన్ బఫెట్‌కు రెండో స్థానం దక్కింది. ఆయన ఆస్తి 7,560 కోట్ల డాలర్లు. అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ 7,280 కోట్ల డాలర్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు. టాప్-10లో చోటు దక్కించుకున్న ఇతర ప్రముఖుల్లో ఫేస్‌బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకెర్‌బర్గ్ (5,600 కోట్ల డాలర్ల ఆస్తితో 5వ స్థానం), ఒరాకిల్ సహ వ్యవస్థాపకులు ల్యారీ ఎల్లిసన్ (5,220 కోట్ల డాలర్లతో 7వ స్థానం) కూడా ఉన్నారు. గతంలో ఒకసారి నంబర్ వన్ స్థానానికి చేరిన మెక్సికన్ టెలికం దిగ్గజం కార్లోస్ స్లిమ్ హెలూ ఈసారి 5,450 కోట్ల డాలర్ల ఆస్తితో 6వ స్థానానికి పరిమితమయ్యారు. అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ట్రంప్ ఆస్తి గడిచిన ఏడాది కాలంలో వంద కోట్ల డాలర్లకు పైగా తగ్గి 350 కోట్ల డాలర్లకు పరిమితమైందని ఫోర్బ్స్ జాబితా వెల్లడించింది. దాంతో ఆయన ర్యాంకింగ్ గత ఏడాది నమోదైన 324వ స్థానం నుంచి ఈసారి ఏకంగా 544వ స్థానానికి పడిపోయింది.

618

More News

మరిన్ని వార్తలు...