టీసీఎస్ లాభం రూ.7,901 కోట్లు

Thu,October 11, 2018 11:47 PM

TCS reports net profit of Rs 7901 crore

-డిజిటల్ సర్వీసులకు ఎనలేని డిమాండ్
-రూ.4 మధ్యంతర డివిడెండ్ ప్రకటన

ముంబై, అక్టోబర్ 11: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన 3 నెలల కాలానికి సంస్థ రూ.7,901 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలానికి నమోదైన రూ.6,446 కోట్ల లాభంతో పోలిస్తే 22.6 శాతం ఎదుగుదల కనిపించింది. మొదటి త్రైమాసికంలో రూ.7,340 కోట్లుగా ఉన్నది. డిజిటల్ సర్వీసులకు ఎనలేని డిమాండ్ ఉండటం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 20.7 శాతం పెరిగి రూ.36,854 కోట్లుగా నమోదైంది. 2016-17 ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఆదాయం రూ.30,541 కోట్లుగా ఉన్నది. ప్రతిషేరుకు రూ.20.66 చొప్పున ఆర్జించింది. ఈ సందర్భంగా టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేశ్ గోపినాథన్ మాట్లాడుతూ..రెండో త్రైమాసికంలో అన్ని రంగాల్లో మెరుగైన పనితీరు కనబరిచినట్లు, డిజిటల్ సర్వీసులకు ఎనలేని డిమాండ్‌తో ఆదాయం భారీగా వృద్ధి చెందిందన్నారు. వీటితోపాటు బీఎఫ్‌ఎస్‌ఐ(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా), రిటైల్ రంగాలకు భవిష్యత్తులో డిమాండ్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రెండంకెల వృద్ధి సాధించేదానిపై నమ్మకం ఏర్పడిందని ఫలితాల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. అనలాటిక్స్, క్లౌడ్, ఆటోమేషన్ రంగాల్లో ఐటీ సేవలకు డిమాండ్ నెలకొందని టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి, ఈడీ ఎన్ గణపతి సుబ్రమణియం తెలిపారు. ప్రతిషేరుకుగాను సంస్థ రూ.4 డివిడెండ్‌ను ప్రకటించింది. గడిచిన త్రైమాసికంలో నికరంగా 10,227 మంది సిబ్బంది చేరడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,11,102కి చేరారు. వీరిలో క్యాంపస్‌ల ద్వారా 1,800 మందిని రిక్రూట్ చేసుకున్నది. గతేడాది 20 వేల మంది సిబ్బందిని క్యాంపస్‌ల ద్వారా ఎంపిక చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గడిచిన 12 త్రైమాసికాల్లో ఇంతటి భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడం ఇదే తొలిసారి. కంపెనీలో వలసలు తగ్గుముఖం పట్టి 10.9 శాతానికి పరిమితమయ్యా యి. బ్రిటన్‌లో 22.8 శాతం వృద్ధి ని నమోదు చేసుకున్న సంస్థ.. యూరోపియన్ దేశాల్లో 17.4 శాతం పెరుగుదల కనిపించింది. క్లయింట్ల విషయానికి వస్తే 100 మిలియన్ డాలర్ల విలువైన క్లయింట్లను నలుగురిని ఆకట్టుకున్న సంస్థ..20 మిలియన్ డాలర్ల విభాగంలో ఏడు, 10 మిలియన్ డాలర్లలో పది వచ్చాయని ఆయన వెల్లడించారు. గడిచిన మూడు నెలల్లో ఆశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించినప్పటికీ స్టాక్ మార్కెట్లకు రుచించలేదు. ఇంట్రాడేలో 5 శాతం వరకు పడిపోయిన షేరు ధర చివరకు రూ. 3.10 శాతం పతనం చెంది రూ.1,979.75 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలోనూ 2.37 శాతం తగ్గి రూ.1,995 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 3.58 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 47 లక్షల షేర్లు చేతులు మారాయి.

378
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS