టీసీఎస్ అదరహో..

Thu,January 10, 2019 11:38 PM

-క్యూ3లో 24 శాతం పెరిగిన లాభం
-రూ.8,105 కోట్లుగా నమోదు
-ఒక ్ర తైమాసికంలో ఇదే అత్యంత గరిష్ఠం
-రూ.4 మధ్యంతర డివిడెండ్ ప్రకటన

ముంబై, జనవరి 10: దేశంలో అతిపెద్ద ఐటీ ఎగుమతుల సంస్థయైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఆర్థిక ఫలితాలు అదరహో అనిపించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.8,105 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.6,531 కోట్ల లాభంతో పోలిస్తే 24.1 శాతం పెరుగుదల కనిపించింది. ఒక త్రైమాసికంలో ఇంతటిస్థాయిలో లాభాలను ఆర్జించడం కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి. అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో కంపెనీ ఆదాయం రూ.30,904 కోట్ల నుంచి రూ.37,338 కోట్లకు ఎగిసింది. వృద్ధి పరంగా చూస్తే 20.8 శాతంగా ఉన్నది. కంపెనీకి కీలకంగా ఉన్న ఉత్తర అమెరికా మార్కెట్‌లో అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకోవడంతోపాటు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగాలు మెరుగైన పనితీరు కనబర్చడంతో నికర లాభంలో 23 శాతం వృద్ధిని నమోదు చేసుకోవడానికి దోహదపడిందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేష్ గోపినాథన్ తెలిపారు. గడిచిన త్రైమాసికంలో ఆర్డర్లో భారీ వృద్ధి నమోదైంది.. నూతన సంవత్సరానికి ఈ ఫలితాలు దిక్సూచిగా మారనున్నాయన్నారు. ఆర్థిక ఫలితాల్లోని ముఖ్య అంశాలు..
-గడిచిన త్రైమాసికం ముగిసేనాటికి సంస్థ వద్ద 5.9 బిలియన్ డాలర్ల కాంట్రాక్టులు ఉన్నాయి. గతేడాది ఇవి 4.9 బిలియన్ డాలర్లు.
-100 మిలియన్ డాలర్ల కంటే అధిక విలువైన ఆర్డర్‌ను ఒక్కటి దక్కించుకున్నది.
-కంపెనీకి వచ్చిన మొత్తం ఆదాయంలో డిజిటల్ వాటా 30 శాతంగా నమోదైంది. గతేడాదితో పోలిస్తే 52.7 శాతం వృద్ధి కనబరిచింది.
-కొత్తగా 6,827 మంది సిబ్బందిని నియమించుకోవడంతో మొత్తం సంఖ్య 4.18 లక్షలకు చేరుకున్నది. వలసలు 11.2 శాతంగా ఉన్నాయి.
-సంస్థ వద్ద రూ.43 వేల కోట్ల మిగులు నిధులు ఉండటంతో ఇతర కంపెనీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నది.
-ప్రతి షేరుకు రూ.4 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. 18న చెల్లించనున్నది.
-బీఎఫ్‌ఎస్ రంగం 8.6 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, ఎనర్జీ యుటిలిటీ 18.1 శాతం, సైన్స్ అండ్ హెల్త్‌కేర్ 15.7 శాతం, కమ్యూనికేషన్స్ అండ్ మీడియా 10.8 శాతం, రిటైల్ అండ్ సీపీజీ 10.5 శాతం పెరిగాయి.
-కంపెనీ షేరు రూ.1,888.15 వద్ద ముగిసింది.

983
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles