నిరాశపరిచిన టీసీఎస్

Fri,October 13, 2017 01:11 AM

TCS Q2 profit rises 8.4% YoY to Rs 6446 crore revenue up 4.3%

-క్యూ2లో 2 శాతం తగ్గిన లాభం
-రూ.7 మధ్యంతర డివిడెండ్ ప్రకటన
tcs
ముంబై, అక్టోబర్ 12: దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ 31తో ముగిసిన మూడు నెలలకాలంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 2.1 శాతం క్షీణించి రూ.6,446 కోట్లకు జారుకుంది. బ్యాంకింగ్, రిటైల్ రంగంలో నెలకొన్న స్తబ్దత కారణంగా లాభాల్లో ప్రతికూల వృద్ధి నమోదైందని, అయినప్పటికీ భవిష్యత్ వృద్ధి ఆశావాదంగా ఉంటుందని పేర్కొంది. 2016-17 సంవత్సరం ఇదే కాలానికి రూ.6,586 కోట్ల లాభాన్ని గడించినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. తొలి త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే మాత్రం 8.4 శాతం వృద్ధి కనబరిచింది. ఆదాయం విషయానికి వస్తే రూ.30,451 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఆర్జించిన రూ.29,284 కోట్లతో పోలిస్తే 4.3 శాతం పెరుగుదల కనిపించింది. డాలర్ రూపంలో కంపెనీ ఆదాయం 3.2 శాతం పెరిగి 4,739 మిలియన్ డాలర్లకు చేరుకుంది.

అతిపెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకున్నప్పటికీ.. రిటైల్, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాల్లో నెలకొన్న నిస్తేజం కారణంగా ఆశించిన స్థాయిలో ఫలితాలను ప్రకటించలేకపోయామని టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేష్ గోపినాథన్ ఈ సందర్భంగా తెలిపారు. డిజిటల్ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి అధిక స్థాయిలో నిధులను కేటాయించనున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే త్రైమాసికాల్లో రిటైల్ రంగం మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కంపెనీకి వచ్చిన మొత్తం ఆదాయంలో డిజిటల్ సేవల ద్వారా 31 శాతం సమకూరింది. అంతక్రితం ఏడాది ఇది 19.7 శాతంగా ఉంది. గడిచిన త్రైమాసికంలో టీసీఎస్‌లో సిబ్బంది వలసలు 0.3 శాతం తగ్గి 11.3 శాతంగా నమోదయ్యాయి. సమీక్షకాలంలో 15,868 మంది ఉద్యోగులు చేరగా, వలసలు మినహాయిస్తే నికరంగా 3,404 మంది చేరినట్లు అయింది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 3,89,213కి చేరుకున్నారు.

ప్రతిషేరుకు రూ.7 మధ్యంతర డివిడెండ్‌ను సంస్థ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 26న చెల్లింపులు జరుపనున్నది. గడిచిన త్రైమాసికంలో సంస్థ 48 క్లయింట్లను ఆకట్టుకున్నది. దీంట్లో 100 మిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్ ఒకటికాగా, 50 మిలియన్ డాలర్లు, 20 మిలియన్ డాలర్లు, 10 మిలియన్ డాలర్ల ఆర్డర్లు మరో 18ని చేజిక్కించుకున్నది. కంపెనీకి చెందిన ట్రావెల్, ఆతిథ్య రంగ విభాగం ఎనిమిది శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, విద్యుత్, యుటిలిటీ 7.2 శాతం, లైఫ్ సైన్స్-హెల్త్‌కేర్ విభాగం 3.6 శాతం పెరిగాయి. సిబ్బంది వేతనాలు పెరుగడం, వీసా ఖర్చులు అధికమవడంతో సంస్థపై స్వల్ప ప్రభావం చూపిందని గోపినాథన్ తెలిపారు. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర 1.92 శాతం పెరిగి రూ.2,548.55 వద్ద స్థిరపడింది.

238

More News

VIRAL NEWS