టీసీఎస్‌ బోణీ అదిరింది

Wed,July 10, 2019 04:36 AM

TCS Q1 profit rises 11Percentage YoY to Rs 8,131 crore beats Street estimates

-క్యూ1 లాభంలో 11 శాతం వృద్ధి
-రూ.8,131 కోట్లు ఆర్జించిన సంస్థ
-రూ.5 డివిడెండ్‌ను ప్రకటించిన కంపెనీ

ముంబై, జూలై 9: ఆర్థిక ఫలితాల బోణీ అదిరింది. దేశంలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థయైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) విశ్లేషకుల అంచనాలకుమించి లాభాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.8,131 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.7,340 కోట్లతో పోలిస్తే 10.8 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నట్లు కంపెనీ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలానికిగాను కంపెనీ ఆదాయం 11.శాతం పెరిగి రూ.38,172 కోట్లకు చేరుకున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికిగాను రూ.34,261 కోట్లుగా ఉన్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం కంపెనీకి కలిసొచ్చింది. ‘నూతన ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠ స్థాయి లాభాలతో ప్రారంభించాం..వినియోగదారులు కోరుకుంటున్న విధంగా సేవలు అందించడం, బలమైన ఆర్డర్‌ బుకింగ్‌, పలు ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైంది’ అని టీసీఎస్‌ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేష్‌ గోపినాథన్‌ తెలిపారు. కంపెనీకి వచ్చిన మొత్తం ఆదాయంలో డిజిటల్‌ వాటా గరిష్ఠమని, 32.20 శాతం వీటిని అందించడం ద్వారానే సమకూరినట్లు ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోపినాథన్‌ చెప్పారు.

గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో వృద్ధి పది శాతం కంటే తక్కువగా నమోదవగా, ఈసారి మాత్రం రెండంకెల వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్‌ నెలలో సిబ్బంది జీతభత్యాలు పెంచడంతో మార్జిన్లు 2.4 శాతం పడిపోయాయని టీసీఎస్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ అధికారి వీ రామకృష్ణన్‌ చెప్పారు. ప్రతిషేరుపై రూ.21.67 మేర ఆదాయం సమకూరినట్లు అయింది. గతేడాదితో పోలిస్తే 13 శాతం ఎదుగుదల కనిపించింది. మార్చి త్రైమాసికంలో నమోదైన 17.72 శాతం వృద్ధి, డిసెంబర్‌ క్వార్టర్‌లో 24 శాతం, సెప్టెంబర్‌లో 22.71 శాతం వృద్ధితో పోలిస్తే ఇది చాలా తక్కువ. జూన్‌ 31తో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.5 మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు ప్రకటించింది. కంపెనీల్లో ప్రమోటర్ల వాటాను తగ్గించుకునే అవకాశాలు లేవని గోపినాథ్‌ స్పష్టంచేశారు. స్టాక్‌ మార్కెట్లో లిైస్టెన ప్రతి సంస్థలో ప్రజల వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలని బడ్జెట్‌ ప్రతిపాదనలపై ఆయన నేరుగా స్పందించలేదు. ప్రస్తుతం టీసీఎస్‌లో టాటా గ్రూపునకు 75 శాతం వాటా ఉన్నది.

కొత్తగా 12,356 ఉద్యోగాలు

గడిచిన త్రైమాసికంలో సంస్థ 12,356 మంది సిబ్బందిని రిక్రూట్‌ చేసుకున్నది. ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయిలో ఉద్యోగ నియామకం చేపట్టడం గడిచిన ఐదేండ్లలో ఇదే తొలిసారి. దీంతో మొత్తం సిబ్బంది 4,36,641కి చేరుకున్నారు. అయినప్పటికీ కంపెనీల్లో వలసలు ఆగడం లేదు. గత త్రైమాసికంలో వలసలు 11.5 శాతంగా నమోదయ్యాయి. జూన్‌ చివరి నాటికి నూతన టెక్నాలజీకోసం 3.15 లక్షల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చింది సంస్థ. అలాగే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్ల ద్వారా ఎంపిక చేసిన 30 వేల మందికి నియమించుకున్నది.

రంగాల వారీగా ఆదాయం..

రంగాలవారీగా ఆదాయంలో భారీ వృద్ధిని నమోదు చేసుకున్నది. లైఫ్‌ సైన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ విభాగం భారీ వృద్ధిని నమోదు చేసుకున్నది. ఈ విభాగం 18.1 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐ 9.2 శాతం, రిటైల్‌ అండ్‌ ఈపీసీ 7.9 శాతం, కమ్యూనికేషన్స్‌ అండ్‌ మీడియా 8.4 శాతం, టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌ 7.8 శాతం, తయా రీ 5.5 శాతం వృద్ధిని కనబరిచాయి.

బ్రిటన్‌, యూరప్‌లది కీలక పాత్ర

కంపెనీకి వచ్చిన మొత్తం ఆదాయంలో బ్రిటన్‌, యూరప్‌ దేశాలు కీలకపాత్ర పోషించాయి. బ్రిటన్‌ నుంచి సమకూరిన ఆదాయంలో 16 శాతం పెరుగగా, భారత్‌లో 15.9 శాతం, యూరప్‌లో 15 శాతం, ఉత్తర అమెరికా 7.7 శాతం, ఆసియా పసిఫిక్‌ 9.5 శాతం, ఎంఈఏ 6.4 శాతం, లాటిన్‌ అమెరికాలో 6.4 శాతం పెరుగుదల నమోదైంది.

5 బిలియన్‌ డాలర్ల ఒప్పందాలు

గడిచిన త్రైమాసికంలో సంస్థ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో దూసుకుపోయింది. నికరంగా 5 బిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకున్నది. వీటిలో 100 మిలియన్‌ డాలర్ల విలువైన ఒప్పందాలు నాలుగు ఉన్నాయి. స్టాక్‌ మార్కెట్‌ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర 2.05 శాతం తగ్గి రూ.2,131.45 వద్ద స్థిరపడింది.

1937
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles