అంచనాలుమించిన టీసీఎస్

Sat,April 13, 2019 02:33 AM

TCS net jumps 17.7percent to Rs 8,162 cr despite lagging margins

-క్యూ4లో రూ.8,162 కోట్ల లాభం
-ఆదాయంలో 19శాతం వృద్ధి
-రూ.18 తుది డివిడెండ్ ప్రకటన
ముంబై, ఏప్రిల్ 12: దేశీయ ఐటీ కంపెనీల లాభాల పంట పండింది. సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో అతిపెద్ద సంస్థయైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) విశ్లేషకుల అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలానికి కంపెనీ రూ.8,126 కోట్ల లాభాన్ని గడించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి నమోదైన రూ.6,904 కోట్ల లాభంతో పోలిస్తే 17.7 శాతం ఎగబాకింది. ఆదాయం విషయానికి వస్తే ఏడాది ప్రాతిపదికన 18.5 శాతం ఎగబాకి రూ.38,010 కోట్లకు చేరుకున్నది. ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించడం 15 త్రైమాసికాల తర్వాత ఇదే తొలిసారి. గడిచిన మూడు త్రైమాసికాలతో పోలిస్తే నాలుగో త్రైమాసికంలో ఆర్డర్ బుక్ భారీగా పెరిగిందని, ఒప్పందాలు కూడా మెరుగుపరుచుకున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ రాజేష్ గోపినాథన్ తెలిపారు.

మార్కెట్ పరిస్థితులు నిరుత్సాహకరంగా ఉన్నప్పటికీ నూతన ఆర్థిక సంవత్సరానికి లాభాలతో స్వాగతం పలికినట్లు ఆయన చెప్పారు. మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ 6.2 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు, దీంతో నూతన ఆర్థిక సంవత్సరంలో మెరుగైన వృద్ధి సాధించేదానిపై ఆయన గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు. ఆపరేటింగ్ మార్జిన్ 0.31 శాతం తగ్గి 25.10 శాతానికి పరిమితమైంది. అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ డిజిటల్ బిజినెస్‌పై ప్రత్యేక దృష్టి సారించడం కంపెనీకి కలిసొచ్చిందని, మొత్తం ఆదాయంలో ఈ విభాగం నుంచి 50 శాతం సమకూరుతుండటంతో వీటిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

వీటితోపాటు బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగంలో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నట్లు గోపినాథన్ పేర్కొన్నారు. కంపెనీకి వచ్చిన మొత్తం ఆదాయంలో ఉత్తర అమెరికా నుంచి 50 శాతం సమకూరగా, ఇంగ్లాండ్ నుంచి 21 శాతం లభించింది. కంపెనీలో 39 ఏండ్లుగా హెచ్‌ఆర్‌గా విధులు నిర్వహించిన అజయ్ ముఖర్జీ త్వరలో పదవీ విరమణ చేయబోతున్నారు. నికరంగా గడిచిన త్రైమాసికంలో 29,287 మంది సిబ్బందిని తీసుకున్నది సంస్థ. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4.24 లక్షలకు చేరుకున్నారు. ఉద్యోగుల పనితీరు ఆధారంగా వారి వేతనాన్ని 2-6 శాతం మధ్యలో పెంచినట్లు ఆయన చెప్పారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను వాటాదారులకు రూ.18 తుది డివిడెండ్‌ను సంస్థ ప్రకటించింది.

2018-19లోనూ అదే జోష్

నాలుగో త్రైమాసికంలో అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సంస్థ..పూర్తి ఏడాదిలోనూ అదే జోష్ కనిపించింది. 2018-19కి గాను కంపెనీ నికర లాభం 21.9 శాతం ఎగబాకి రూ.31,472 కోట్లకు చేరుకోగా, ఆదాయం 19 శాతం పెరిగి రూ.1,46,463 కోట్లుగా నమోదైంది. స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేరు ధర స్వల్పంగా లాభపడి రూ.2,013.75 వద్ద ముగిసింది.

834
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles