ఉత్సాహకరం..జీఎస్టీ రేట్లపై హర్షం వ్యక్తం చేసిన పన్ను నిపుణులు

Fri,May 19, 2017 02:18 AM

Tax experts who expressed interest in GST rates

GST
న్యూఢిల్లీ, మే 18: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన పన్ను రేట్లు ఇండస్ట్రీకి ఉత్సాహకరంగా ఉన్నాయని నిపుణులు అన్నారు. జీఎస్టీ హయాంలో వినియోగదారుల వస్తువుల రేట్లు గణనీయంగా తగ్గనున్నాయని పేర్కొన్నారు. దేశంలో ఏకరీతి పరోక్ష పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో రూపొందించిన జీఎస్టీ చట్టాన్ని జూలై 1 నుంచి అమలు తేవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో కూడిన, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న జీఎస్టీ కౌన్సిల్ గురువారం నాటి సమావేశంలో ఏయే వస్తువుపై ఎంత పన్ను విధించాలనే విషయంపై నిర్ణయం తీసుకుంది. మొత్తం 1,211 వస్తువుల్లో ఆరు మినహాయించి మిగతా అన్నింటికీ పన్ను రేటును నిర్ణయించింది. బంగారం, పాదరక్షలు, బ్రాండెడ్ వస్తువులు, బీడీలపై పన్నును శుక్రవారం నాటి సమావేశంలో నిర్ణయించనున్నారు. మొదటి రోజు పన్ను రేట్లు నిర్ణయించిన వస్తువుల్లో సబ్బులు, టూత్‌పేస్ట్, తలనూనె లాంటివి 18 శాతం పన్ను శ్లాబు పరిధిలోకి రానున్నాయని, దాంతో వినియోగదారులకు ప్రస్తుత స్థాయి కంటే తక్కువ ధరకే ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. వంటనూనెలు, తేయాకు పొడి, కాఫీ, చక్కెర వంటి ఆహారోత్పత్తులను 5 శాతం పన్ను శ్లాబులోకి తీసుకొచ్చారు. ఇది కూడా ఇండస్ట్రీకి సానుకూలమేనని పీడబ్ల్యూసీకి చెందిన పన్ను నిపుణులు ప్రతీక్ జైన్ అన్నారు.

జీఎస్టీ మండలి ఇప్పటివరకు నిర్ణయించిన పన్ను రేట్లు అనుకూలంగా ఉన్నాయని, జీఎస్టీ అమలుతో ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావాన్ని వీలైనంతగా తగ్గించేందుకు మండలి ప్రయత్నించినట్లుగా అన్పిస్తున్నదని బీఎంఆర్ అండ్ అసోసియేట్స్ ఎల్‌ఎల్‌పీకి చెందిన రాజీవ్ దిమ్రీ అన్నారు. జీఎస్టీని జూలై 1 నుంచే అమలు చేస్తారా..? లేదా..? అనే విషయంపై ఇండస్ట్రీ వర్గాలు స్పష్టత కోరుకుంటున్నారని డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్‌ఎల్‌పీకి చెందిన సలోనీ రాయ్ అన్నారు. ఎందుకంటే, లక్ష్యానికి అనుగుణంగా జీఎస్టీని అమలు చేసేందుకు కేంద్రానికి ఇంకా 42 రోజుల సమయమే ఉంది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించిన పన్ను రేట్లు అంచనాలకు తగ్గ స్థాయిలోనే ఉన్నట్లు ట్యాక్స్‌మ్యాన్.

కామ్ సీనియర్ కన్సల్టంట్ వీఎస్ దాతే అన్నారు. జీఎస్టీ హయాంలోనూ పన్ను రేట్లను ప్రస్తుత స్థాయికి కాస్త, అటు ఇటుగానే నిర్ణయిస్తామని జైట్లీ ఇంతక్రితమే సంకేతాలిచ్చారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. అయినప్పటికీ ఇంకా ఎంతో కసరత్తు చేయాల్సి ఉందని దాతే పేర్కొన్నారు. 81 శాతం కమోడిటీలను 18 శాతంలోపు పన్ను శ్లాబుల పరిధిలోకి తేవడం ద్వారా జీఎస్టీ కౌన్సిల్ అత్యుత్తమ నిర్ణయం తీసుకుందని ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్‌నర్ సురేశ్ నాయర్ అభిప్రాయపడ్డారు.

జీఎస్టీ ఓ మైలురాయి: మేఘ్వాల్


దేశ ఆర్థిక వృద్ధిలో జీఎస్టీ అమలు అత్యంత కీలకమైన మైలురాయి కానుందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. పెద్ద నోట్ల రద్దుతో వృద్ధికి భారీ గండిపడవచ్చని గడిచిన కొన్ని త్రైమాసికాల్లో పలువురు ఆందోళన వ్యక్తం చేశారని, కానీ అందుకు భిన్నంగా వృద్ధి పెరిగిందన్నారు.

1012

More News

VIRAL NEWS