HomeBusiness News

టాటా మోటర్స్‌కు జేఎల్‌ఆర్ సెగ

Published: Fri,February 8, 2019 12:55 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

-క్యూ3లో రూ.26,961 కోట్ల నష్టం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 31తో ముగిసిన మూడు నెలల కాలానికి రూ.26, 960.8 కోట్ల నష్టం సంభవించింది. బ్రిటన్‌కు చెందిన తన అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు ఒకేసారి భారీగా నిధులను కేటాయించడం వల్లనే లాభాల్లో గండిపడిందని సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. 2017-18 ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి సంస్థ రూ.1,214.6 కోట్ల లాభాన్ని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 4.36 శాతం ఎగబాకి రూ.77,582.71 కోట్లకు చేరుకోవడం విశేషం. గతేడాది ఇది రూ.74,337 .70 కోట్లుగా ఉన్నట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. ఏకీకృత విషయానికి వస్తే పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభం రూ.211.59 కోట్ల నుంచి రూ.617.62 కోట్లకు చేరుకోగా, ఆదాయం రూ.16,186.15 కోట్ల నుంచి రూ.16,477.07 కోట్లకు ఎగబాకింది. జేఎల్‌ఆర్ కంపెనీ ఆదాయం మాత్రం ఒక్క శాతం తగ్గి 6.2 బిలియన్ పౌండ్లకు జారుకున్నది.


స్టాక్ మార్కెట్లో లిైస్టెన దానికంటే జేఎల్‌ఆర్ విలువ పడిపోయినందనుకుగాను దీనిని పూడ్చుకోవడానికి 3.1 బిలియన్ పౌండ్లు (రూ. 27,838 కోట్లు) నిధులను ఒకేసారి వెచ్చించడంతో టాటా మోటర్స్ లాభాల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది. వీటితోపాటు వాహనాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటం, నిర్వహణ ఖర్చులు పెరుగడం కూడా ప్రభావాన్ని మరింత పెంచాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ..దేశీయ వ్యాపారం మరింత బలోపేతం అయిందని, అటు మార్కెట్‌వాటాలోనూ, లాభాల్లోనూ వృద్ధిని నమోదు చేసుకున్నట్లు చెప్పారు. సంస్థను నవీనకరించాలనే ఉద్దేశంతో రూపొందించిన 2.0 వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు, దీంట్లోభాగంగా నూతన వాహనాలను విడుదల చేయడం, నిలకడైన వృద్ధిని సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కానీ, జేఎల్‌ఆర్‌తో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తున్నదన్నారు. మూడో త్రైమాసికంలో జేఎల్‌ఆర్ రిటైల్ విక్రయాలు 6.4 శాతం తగ్గి 1,44,602 యూనిట్లకు పడిపోయాయి.

1026

Recent News