జూన్ నాటికి లాభాల్లోకి..

Sat,January 12, 2019 11:56 PM

Syndicate Bank hopes to recover Rs 1500 crore from NPAs

-ఆరు నెలల్లో రూ.1,500 కోట్ల ఎన్‌పీఏల వసూళ్లు
-సిండికేట్ బ్యాంక్ ఎండీ, సీఈవో మృత్యుంజయ్ మహాపాత్ర

హైదరాబాద్, జనవరి 12: మొండి బకాయిలతో సతమతమవుతున్న ప్రభుత్వరంగ బ్యాంకైన సిండికేట్ బ్యాంక్ వీటిని తగ్గించుకునేపనిలో పడింది. వీటిని వసూళ్లు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించిన బ్యాంక్..వచ్చే మూడు నుంచి ఆరు నెలలకాలంలో రూ.1,500 కోట్ల ఎన్‌పీఏలను రాబట్టాలనుకుంటున్నట్లు బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. బ్యాంక్ చీఫ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మొండి బకాయిదారులపై చర్యలను వేగవంతం చేయడానికి 1,200 మంది బ్యాంక్ అధికారులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లు, దీంతో జూన్ 30తో ముగిసేనాటికి బ్యాంక్ మళ్లీ లాభాల్లోకి వచ్చే అవకాశాలు మెండుగావున్నాయన్నారు. ఎంఎస్‌ఎంఈ, కార్పొరేట్ రంగాల్లో ఆశించిన స్థాయిలో వృద్ధిని నమోదు చేసుకోకపోవడంతో 2018-19లో బ్యాంకింగ్ రంగ వృద్ధి 7-8 శాతానికి పరిమితం కానున్నదన్నారు. రుణాల వసూళ్లలో హైదరాబాద్ జోన్ ఆశించిన స్థాయిలో వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, ఈ ఏడాది కూడా రెండంకెల వృద్ధి సాధించేదానిపై ఆయన గట్టి నమ్మకాన్ని వ్యక్తంచేశారు.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ..సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయడంతోపాటు ఆదాయ పన్నును తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. తద్వారా వేతన జీవులకు ఎంతో ఊరట లభించనున్నదని తెలిపారు. అలాగే ఉద్యోగుల వాటా కొనుగోలు పథకం కింద రూ.500-600 కోట్ల వరకు నిధులను సేకరించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే పలు మార్గాల ద్వారా రూ.2,360 కోట్ల నిధులను సేకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. బ్యాంక్ మెరుగైన వృద్ధిని సాధించడానికి రిటైల్, ఎంఎస్‌ఎంఈ, హౌజింగ్, వ్యక్తిగత ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించినున్నట్లు చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే ద్రవ్యలోటు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించిన ఆయన..ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏమి చెప్పాడో కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులేమి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

638
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles