మాంద్యం మహమ్మారి

Mon,September 9, 2019 12:32 AM

Suzuki Motor India to hold back investment due to slowdown

-దేశ ఆర్థిక వ్యవస్థను నిలువెల్లా కొల్లగొడుతున్న మందగమనం
-వృద్ధిరేటు మూలాలను హరిస్తున్న నిస్తేజపు ఛాయలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 5 శాతానికి పడిపోయింది. మార్చి 2013 నుంచి చూస్తే ఇదే అత్యల్పం. నాడు 4.7 శాతంగా నమోదైంది. మళ్లీ ఆ దరిదాపుల్లోకి జీడీపీ వెళ్లడం ఇదే. ఇక వరుసగా ఐదు త్రైమాసికాలు వృద్ధిరేటు పతనం చెందడం 1997 నుంచి గమనిస్తే తొలిసారి. గతేడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికం నుంచి వృద్ధిరేటు క్రమేణా దిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ జూలై-సెప్టెంబర్ కాలంలోనూ వృద్ధిరేటు 5 శాతానికి దిగువకు క్షీణిస్తే వరుసగా ఆరు త్రైమాసికాలు దిగజారినట్లు. ఇలా ఆరు త్రైమాసికాలు వరుసగా జీడీపీ పతనం కావడం మాత్రం ఇదే మొదటిసారి అవుతుంది.

వినియోగ సామర్థ్యం కుదేలు

భారత జీడీపీలో ప్రైవేట్ రంగ వినియోగ సామర్థ్యం పాత్ర అంతా ఇంతా కాదు. అలాంటిది ఈ జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రైవేట్ తుది వినియోగ వ్యయం (పీఎఫ్‌సీఈ) 3 శాతంగానే ఉన్నది. ఇక గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఇది 3.1 శాతంగానే నమోదైంది. పీఎఫ్‌సీఈ వృద్ధిరేటు 5.6 శాతం క్షీణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ స్థాయిలో వినియోగ సామర్థ్యం పడిపోతే అమ్మకాలు సహజంగానే ప్రభావితం అవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ సామర్థ్యం కుదేలైంది. పట్టణ ప్రాంతాల్లోనూ వినియోగదారుల సెంటిమెంట్ దెబ్బతిన్నది.

పెట్టుబడులకు విఘాతం

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం భయాలు ఇప్పటికే భారత్ వంటి దేశాలను వణికిస్తుండగా, మాంద్యం ప్రభావం.. దేశ ఎగుమతులకున్న అవకాశాలకు గండి కొడుతున్నది. దీంతో పెట్టుబడులకు విఘాతం కలుగుతుండగా, స్టాక్ మార్కెట్ల నుంచి రిటైల్ మార్కెట్ల వరకు ఈ ప్రభావం కనిపిస్తున్నది. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లో కదలాడుతున్నది చూస్తూనే ఉన్నాం. విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను ఏ స్థాయిలో వెనుకకు తీసుకుంటున్నారో గమనిస్తూనే ఉన్నాం.

కీలక రంగాల్లో స్తబ్ధత

దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మాంద్యం.. కీలక రంగాల్లో స్తబ్ధతకు దారితీస్తున్నది. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో కనిపిస్తున్న నిస్తేజపు ఛాయలు.. మార్కెట్ వృద్ధిని గాయపరుస్తున్నాయి. ఈ పరిణామం నూతన ప్రాజెక్టులకు ఇబ్బందికరంగా మారుతున్నది. వ్యాపార విస్తరణ అవకాశాలకూ గండి కొడుతున్నది. కీలక రంగాల్లో మందగమనం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదంటూ ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.

బాండ్ల రాబడిపై ప్రభావం

ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న అనిశ్చితి.. బాండ్ల రాబడినీ ప్రభావితం చేస్తున్నది. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత భారత జీడీపీ అధిక వృద్ధితో పరుగులు పెట్టింది. అయితే ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల్లోనూ ఇప్పుడు ఇలాంటి గడ్డు పరిస్థితులే ఉండగా, అటు ఆర్బీఐ, ఇటు కేంద్రం ఆధారపడిన బాండ్ల కొనుగోళ్లకూ మందగమనం అడ్డుగా నిలుస్తున్నది. విదేశీ మదుపరులు వీటిపై పెట్టుబడులకు ఆసక్తి చూపకపోతే ప్రభుత్వ పెట్టుబడులకు ఇబ్బంది తప్పదు.

తలసరి ఆదాయం తలకిందులు

మాంద్యం దెబ్బకు తలసరి ఆదాయం తలకిందులు అవుతున్నది. ఆదాయంలో క్షీణత, ఉద్యోగాల తొలగింపులు వంటి పరిణామాలు ప్రజల ఆర్థిక పరిస్థితుల్లో మార్పులకు కారణమవుతున్నాయి. వృద్ధిరేటు పెరిగితే తప్ప.. మళ్లీ తలసరి ఆదాయం పుంజుకోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఆదాయ వనరులు సజీవంగా ఉంటేనే.. దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి మాంద్యా న్ని పారద్రోలేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

పెట్టుబడులపై సుజుకీ వెనక్కి!

వ్యాపార విస్తరణకోసం గతంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన ఆటోమొబైల్ సంస్థలు ప్రస్తుతం వెనక్కితగ్గుతున్నాయి. ఇప్పటికే మారుతి, మహాంద్రా, హ్యుందాయ్‌లు తమ భవిష్యత్తు ప్రణాళికను వెనక్కితీసుకోగా..తాజాగా ఈ జాబితాలోకి సుజుకీ మోటార్ ఇండియా చేసింది. ఆటోమొబైల్ రంగంలో ఉన్న మందకొడి పరిస్థితుల కారణంగా ద్విచక్ర వాహన ఉత్పత్తిని తగ్గించుకుంటున్నట్లు కంపెనీ సీనియర్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీటికితోడు వచ్చే ఏప్రిల్ నుంచి బీఎస్-6 ప్రమాణాలు అమలులోకి రానుండటం సంస్థలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొక తప్పదని ఆయన హెచ్చరించారు. వాహన విక్రయాలు సింగిల్ డిజిట్‌కు పరిమితంకాగా, ద్విచక్ర వాహనాలు మాత్రం రెండం
కెల వృద్ధిని కనబరిచాయి. ప్రస్తుతం సంస్థకు గురుగ్రామ్‌లో ఉన్న ప్లాంట్ ద్వారా ప్రతియేటా 10 లక్షల వాహనాలను ప్రొడ్యుస్ చేస్తున్నది. వీటిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 8 లక్షల వాహనాలను విక్రయించనుండగా, లక్ష యూనిట్లను ఇతర దేశాలకు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా మందగమనం దెబ్బకు ప్రభావితం అవుతున్నాయి. అటు రిటైల్ ద్రవ్యోల్బణం, ఇటు హోల్‌సేల్ ద్రవ్యోల్బణం తిరిగి కోరలు చాస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం సైతం మళ్లీ విజృంభిస్తున్న దాఖలాలున్నాయి. దీంతో ద్రవ్యోల్బణం అదుపు తప్పితే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పన్ను వసూళ్లలో క్షీణత

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నామినల్ జీడీపీని 12 శాతంగా అంచనా వేశారు. అయితే 8 శాతానికే ఇది పరిమితం కావడం.. పన్ను వసూళ్లలో భారీ క్షీణతలకు సంకేతాలనిస్తున్నది. ఇప్పటికే వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రాకతో పన్నుల ఆదాయం ఖజానాకు తగ్గింది. నామినల్ జీడీపీ తగ్గడం.. మరింత పన్ను ఆదాయం తగ్గుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఆదాయం పన్ను (ఐటీ), కార్పొరేట్ ట్యాక్స్, జీఎస్టీ వసూళ్లు ప్రభావితమవుతున్నాయి.

ఆర్బీఐ పాలసీపై ఒత్తిడి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల కోతలతో ఎంతగా దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిద్దామని చూస్తున్నా.. మాంద్యం కారణంగా అది నెరవేరడం లేదు. పెట్టుబడిదారులను ఆకర్షించినా ఫలితం లేకుండా పోతున్నది. ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్వహించిన ప్రతిసారి దేశ జీడీపీ పురోగతిపై ఆర్బీఐ కొంత ఆందోళన వ్యక్తం చేస్తుండటం కూడా పెట్టుబడులను ఆటంకపరుస్తున్నది.

జీడీపీ అంచనాలకు దెబ్బ

ప్రస్తుత మందగమనం.. దేశ ఆర్థిక వ్యవస్థకు అదనపు సవాళ్లను విసురుతున్నది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే నామినల్ జీడీపీ వృద్ధి కుప్పకూలుతున్నది. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 8 శాతంగానే నమోదైంది. జీడీపీ అంచనాలు తలకిందులు కావడం వల్ల ప్రభుత్వ ఆదాయ, వ్యయాలే ప్రభావితమవుతున్నాయి.
GDP1

నిరుద్యోగం

పడిపోతున్న అమ్మకాలు.. ఉద్యోగుల తొలగింపులకు కారణమవుతున్నాయి. ఆటో రంగం పరిస్థితి చూస్తూనే ఉన్నాం. మూడు లక్షలకుపైగా ఉద్యోగాలను మాంద్యం మహమ్మారి పొట్టనబెట్టుకున్నది. మరో 10 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. నిర్మాణ రంగంలోనూ లక్షలాది అసంఘటిత రంగ కార్మికులు ఉపాధిని కోల్పోయారు. దీంతో దేశంలో మళ్లీ నిరుద్యోగ భూతం బలం పుంజుకుంటున్నది. పట్టణ ప్రాంతాల్లో 2017-18లో మహిళల నిరుద్యోగ రేటు 27.2 శాతంగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో 13.6 శాతంగా ఉన్నది. పురుషుల విషయానికొస్తే గ్రామాల్లో 17.4 శాతం, పట్టణాల్లో 18.7 శాతంగా ఉన్నది.
Jobs

ఆందోళన వద్దు - జవడేకర్

దేశ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు వద్దని, భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు చాలా పటిష్ఠంగా ఉన్నాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ అన్నారు. మందగమనం అనేది నిరంతర ప్రక్రియలో ఓ భాగమన్న ఆయన ఇలాంటివి దేశ ప్రగతిని దెబ్బతీయవని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సాగిన 100 రోజుల పాలనపై ఆయన ఆదివారం ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మందగమనం.. మార్కెట్లను, ప్రజల ప్రవర్తనా శైలిని మారుస్తున్నప్పటికీ, అతిగా ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు అన్నారు. నిజానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటూనే ఉందన్నారు. తర్వలోనే పరిస్థితులు చక్కబడగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Javadekar

1037
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles