టాటాలకు ఎదురుదెబ్బ


Fri,April 21, 2017 12:36 AM

వేలానికి తాజ్‌మాన్‌సింగ్ హోటల్
ఎన్‌డీఎంసీకి సుప్రీంకోర్టు అనుమతి

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ప్రముఖ ఐదు నక్షత్రాల హోటల్ తాజ్‌మాన్‌సింగ్‌ను ఈ-వేలం వేసేందుకు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌కు (ఎన్‌డీఎంసీ) అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ హోటల్ టాటా గ్రూపునకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) నిర్వహణలో ఉంది. దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న హోటల్ చేజారిపోవడం టాటా గ్రూపునకు పెద్ద ఎదురుదెబ్బ. హోటల్ వేలం ప్రక్రియను తిరస్కరించేందుకు టాటా గ్రూపునకు హక్కు లేదంటూ ఎన్‌డీఎంసీ వేసిన పిటిషన్‌తో జస్టిస్ పీసీ ఘోష్, ఆర్‌ఎఫ్ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం ఏకీభవించింది. అయితే ఈ-వేలంలో హోటల్‌ను ఐహెచ్‌సీఎల్ మళ్లీ దక్కించుకోలేకపోతే.. ఖాళీ చేసేందుకు ఆరు నెలల సమయం ఇవ్వాలని ఎన్‌డీఎంసీకి బెంచ్ కోరింది. ఎలాంటి మచ్చలేని ఐహెచ్‌సీఎల్ గత చరిత్రను కూడా వేలంలో పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.
HotelFacade
హోటల్‌ను వేలం వేయాలనుకుంటున్నట్లు ఎన్‌డీఎంసీ గతనెల 3న సుప్రీంకోర్టుకు తెలిపింది. అంతేకాదు, వేలానికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే వారం రోజుల్లోగా తెలుపాలని ఇంతక్రితమే కోర్టు ఐహెచ్‌సీఎల్‌ను కోరింది. మంచి ఆదాయం పంచుతున్న హోటల్‌ను ఎన్‌డీఎంసీ ఎందుకు వేలం వేయాలనుకుంటున్నదనే విషయంపై స్పష్టత లేదని సంస్థ కోర్టుకు తెలిపింది. అలాగే, ఈ హోటల్‌ను ఇతరులకు కేటాయించడం వల్ల ఎన్‌డీఎంసీకి వచ్చే ఆదాయం తగ్గవచ్చన్న నిపుణుల నివేదికలను న్యాయస్థానానికి సమర్పించింది.

ఢిల్లీ నగర నడిబొడ్డులోని ఈ హోటల్ నిర్వహణకు ఎన్‌డీఎంసీ-ఐహెచ్‌సీఎల్‌కు మధ్య కుదిరిన 33 ఏండ్ల లీజు ఒప్పందం అక్టోబర్ 2011తో ముగిసింది. మళ్లీ లీజును పునరుద్ధరించకుండా వేలం నిర్వహించడం ద్వారా అధిక వార్షిక లైసెన్సు ఫీజు పొందవచ్చన్న ఉద్దేశంతో ఎన్‌డీఎంసీ భావించింది. ఇందుకు అభ్యంతరం తెలుపుతూ టాటా గ్రూపు కోర్టునాశ్రయించింది. గడిచిన కొన్నేండ్లలో ఈ హోటల్ అభివృద్ధి కోసం ఎన్‌డీఎంసీ రూ.6 కోట్లు ఖర్చు చేస్తే.. టాటా గ్రూపు రూ.129 కోట్లు పెట్టుబడి పెట్టిందని కోర్టులో వాదించింది. కానీ కోర్టు ఈ వాదనను తోసిపుచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఎన్‌డీఎంసీకి అనుకూలంగా తీర్పునివ్వగా.. గత ఏడాది 8న ఐహెచ్‌సీఎల్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ-వేలంలో మేమూ పాల్గొంటాం: ఇండియన్ హోటల్స్


తాజ్‌మాన్‌సింగ్ హోటల్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని ఇండియన్ హోటల్స్ పేర్కొంది. అయితే, ఎన్‌డీఎంసీ నిర్వహించబోయే వేలంలో తాము కూడా పాల్గొంటామని సంస్థ స్పష్టం చేసింది.

316

More News

VIRAL NEWS