పిచాయ్‌కే పట్టం

Thu,December 5, 2019 12:40 AM

-అల్ఫాబెట్ సీఈవోగా నియామకం
-గూగుల్ సారథిగానూ కొనసాగనున్న భారత బిడ్డ

వాషింగ్టన్, డిసెంబర్ 4: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. అల్ఫాబెట్ సీఈవోగా నియమితులైయ్యారు. ఇకపై గూగుల్‌తోపాటు దాని మాతృ సంస్థ అల్ఫాబెట్‌కూ పిచాయ్ సారథ్యం వహించనున్నారు. ఈ ఇంటర్నెట్ దిగ్గజం వ్యవస్థాపకులు లర్రీ పేజ్, సర్గే బ్రిన్ వైదొలుగడంతో భారత సంతతికి చెందిన పిచాయ్‌కి ఇరు సంస్థల నాయకత్వ బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు మంగళవారం అల్ఫాబెట్ అధికారికంగా ప్రకటించింది. 47 ఏండ్ల పిచాయ్.. ప్రస్తుతం గూగుల్ సీఈవోగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవస్థాపకులు తప్పుకున్న వేళ.. సంస్థలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న పిచాయ్‌కే పట్టం కట్టాలని యాజమాన్యం నిర్ణయించింది.

పిచాయ్‌పైనే నమ్మకం

2004 ఏప్రిల్ 1 నుంచి గూగుల్‌లో పిచాయ్ పనిచేస్తున్నారు. అంతకుముందు మెకిన్సీ అండ్ కో వద్ద కన్సల్టెంట్‌గా పనిచేశారు. కాగా, పిచాయ్ చేరిన రోజే గూగుల్.. జీమెయిల్‌ను ప్రారంభించడం గమనార్హం. గూగుల్ ఇంటర్నెట్ వ్యాపారంలో ప్రోడక్ట్, ఇంజినీరింగ్ ఇంచార్జిగా పనిచేసిన పిచాయ్.. గూగుల్ క్రోమ్ ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించారు. నూతన టెక్నాలజీలను పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుండే పిచాయ్‌కి ఆండ్రాయిడ్ వ్యాపారం పగ్గాలనూ గూగుల్ అందించింది. 2015లో గూగుల్ సీఈవోగా పిచాయ్ నియమితులయ్యారు.

ఓ శకం ముగిసింది

లర్రీ పేజ్, సర్గే బ్రిన్.. స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు. రెండు దశాబ్దాల క్రితం 1997లో స్కాట్ హసన్ అనే మరొకరితో కలిసి గూగుల్‌ను వీరిరువురు స్థాపించారు. ఇంటర్నెట్‌కు మరోపేరుగా గూగుల్‌ను తీర్చిదిద్దడంలో పేజ్, బ్రిన్‌ల పాత్రే కీలకం. నాలుగేండ్ల క్రితం 2015లో అల్ఫాబెట్ సంస్థను సృష్టించగా, గూగుల్‌ను అందులో భాగం చేశారు. అప్పట్నుంచి మాతృ సంస్థకు ఈ ఇద్దరు నేతృత్వం వహిస్తున్నారు. పేజ్ అల్ఫాబెట్ సీఈవోగా, బ్రిన్ అధ్యక్షుడిగా సేవలందించారు.
goglee

చాలా ఆనందంగా ఉంది. లర్రీ, సర్గేలకు నా కృతజ్ఞతలు. టెక్నాలజీ ద్వారా పెను సవాళ్లను ఎదుర్కోవడంపై అల్ఫాబెట్ సుదీర్ఘ లక్ష్యాల సాధనకు కృషి చేస్తా. అందరి సహకారంతో సంస్థ బలోపేతానికి నా వంతు బాధ్యతల్ని నేను నిర్వర్తిస్తా
- సుందర్ పిచాయ్, అల్ఫాబెట్/గూగుల్ సీఈవో

238
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles