11న ఐపీవోకి ఆహ్లాద ఇంజినీర్స్

Sun,September 9, 2018 12:15 AM

Steel door makers to go for IPO

-రూ.51 కోట్ల వరకు నిధులను సేకరించనున్న సంస్థ
హైదరాబాద్, సెప్టెంబర్ 8: రాష్ర్టానికి చెందిన ప్రముఖ స్టీల్ డోర్లు, కిటికీల తయారీ సంస్థ ఆహ్లాద ఇంజినీర్స్ లిమిటెడ్ క్యాపిటల్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఈ నెల 11 నుంచి 18 వరకు పది రూపాయల ముఖ విలువ కలిగిన 34.05 లక్షల షేర్లను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ప్రైస్‌బాండ్ ధరను రూ.147 నుంచి రూ.150 మధ్యలో నిర్ణయించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ సురేశ్ రెడ్డి మాట్లాడుతూ..ఈ వాటా విక్రయం ద్వారా గరిష్ఠంగా సుమారు రూ.51 కోట్ల వరకు నిధులను సేకరించాలనుకుంటున్నట్లు చెప్పారు. వ్యాపారాన్ని భారీగా విస్తరించడానికి, మూలధన అవసరాల నిమిత్తం, డైరెక్టర్లు, ప్రమోటర్ల వద్ద తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి ఈ నిధులను వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 27న నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లోని ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్ కింద ఈ షేర్లు లిస్ట్ కానున్నాయి. హైదరాబాద్ చుట్టు ఉన్న మూడు ఉత్పత్తి కేంద్రాల్లో ప్రతి నెల 18 వేల యూనిట్ల స్టీల్ డోర్లు ఉత్పత్తి చేస్తుండగా, వ్యాపార విస్తరణలో భాగంగా ఈ ఏడాది చివరినాటికి 30 వేల యూనిట్లకు పెంచనున్నట్లు ఆయన ప్రకటించారు. టాటాస్టీల్ నుంచి వచ్చిన అతిపెద్ద ఆర్డర్ నేపథ్యంలో సంస్థ విస్తరణకు శ్రీకారం చుట్టిందన్నారు. గతేడాది నమోదైన రూ.128 కోట్ల టర్నోవర్ ప్రస్తుత సంవత్సరంలో రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు.

415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles