నిరాశపరిచిన ఎస్‌బీఐ

Sat,May 11, 2019 04:48 AM

State Bank of India Q4 FY19 disappointing

-క్యూ4లో రూ.838 కోట్ల లాభం.. రూ.75 వేల కోట్లు దాటిన ఆదాయం

న్యూఢిల్లీ, మే 10: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఆర్థిక ఫలితాలు విశ్లేషకుల అంచనాలకు చేరుకోలేకపోయింది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.838.40 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. బ్యాంక్ నిరర్థక ఆస్తులు తగ్గుముఖం పట్టడం లాభాల్లోకి రావడానికి దోహదం చేశాయి. 2017-18 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో నమోదైన రూ.7,718.17 కోట్ల నష్టంతో పోలిస్తే ఆశాజనకంగా ఉండగా, మూడోత్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే మాత్రం భారీగా తగ్గింది. బ్యాంక్ ఆదాయం 11 శాతం పెరిగి రూ.75,670.50 కోట్లుగా ఉన్నది. మార్చి 31తో ముగిసేనాటికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 10.91 శాతం నుంచి 7.53 శాతానికి తగ్గడం కొంత ఊరటనిచ్చింది. నికర ఎన్‌పీఏ లేదా బ్యాంక్ మొండి బకాయిలు కూడా 5.73 శాతం నుంచి 3.01 శాతానికి పరిమితమయ్యాయి. ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ రజ్‌నీష్ కుమార్ మాట్లాడుతూ..తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న పలు ఖాతాలను పూడ్చుకోవడానికి అధికంగా నిధులు కేటాయించడంతో లాభాల్లో భారీ తరుగుదల నమోదైందన్నారు. మిగతా విషయంలో బ్యాంక్ అన్ని రంగాల్లో దూసుకుపోయిందని, ఆస్తుల నాణ్యతలో పెరుగుదల కనిపిస్తున్నదని ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మెరుగైన ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నదన్న ఆయన..ఈ ఏడాది వృద్ధిరేటు 10-12 శాతం మధ్యలో ఉంటుందన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ. 3.030 లక్షల కోట్ల ఆదాయంపై రూ.3,069.07 కోట్ల లాభాన్ని గడించింది.

ఆర్థిక ఫలితాల్లో పలు ముఖ్య అంశాలు..

-బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 7.53 శాతం తగ్గి రూ.1,72,750 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది ఇవి రూ.2,23,427 కోట్లుగా ఉన్నాయి.
-నికర ఎన్‌పీఏ కూడా 5.73 శాతం (రూ.1,10,855 కోట్లు) నుంచి 3.01 శాతానికి (రూ.65,895 కోట్లు) తగ్గాయి.
-తాజాగా రూ.7,505 కోట్ల రుణాలు మొండి బకాయిల జాబితాలోకి చేరాయి. గతేడాది మొత్తానికి ఇవి రూ.32,738 కోట్లుగా ఉన్నాయి.
-దివాల చట్టంతో బ్యాంక్ గతేడాది రూ.37 వేల కోట్ల రుణాలను తిరిగి వసూలు చేయగలిగింది.
-ప్రొవిజనింగ్ రేషియో 66.17 శాతం నుంచి 78.73 శాతానికి పెరిగింది.
-ఎస్సార్ స్టీల్, భూషణ్ పవర్ అండ్ స్టీల్, అలోక్ ఇండస్ట్రీస్ ఖాతాల పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళిక అధునాతన దశలో ఉన్నదని కుమార్ పేర్కొన్నా రు. ఈ మూడు ఖాతాల నుంచి రూ.16 వేల కో ట్లు తిరిగి రాగలవని ఆయన అంచనావేస్తున్నారు.
-ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఇచ్చిన రూ.3,487 కోట్ల రుణాల్లో రూ.1,125 కోట్ల రుణాలు ఎన్‌పీఏలోకి చేరబోతున్నాయి
-స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి బ్యాంక్ షేరు ధర 3 శాతం పెరిగి రూ.308.05 వద్ద ముగిసింది.

జెట్ కోసం ఎతిహాద్ బిడ్డింగ్

ఆర్థిక సంక్షోభంతో మూతపడిన జెట్ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేయడానికి ఎతిహాద్‌తోపాటు మరో కొన్ని అయాచిత సంస్థలు బిడ్లు దాఖలు చేశాయని కుమార్ తెలిపారు. ఎస్‌బీఐ నేతృత్వంలోని 26 బ్యాంకుల కన్సార్షియానికి జెట్ ఎయిర్‌వేస్‌లో 51 శాతం వాటా ఉన్నది. జెట్‌ను కొనుగోలు చేయాలనుకునే సంస్థలు ఏప్రిల్ 8 నుంచి 12 వరకు బిడ్లు దాఖలు చేయాలని గతంలోనే ఎస్‌బీఐ సూచించింది. సీల్డ్ కలిగిన బిడ్డింగ్‌ను ఎతిహాద్ ఎయిర్‌వేస్ సమర్పించిందని, మిగతా కొన్ని సంస్థలు కూడా దరఖాస్తు చేసుకున్నాయని ఎస్‌బీఐ క్యాప్ వెల్లడించింది. ప్రస్తుతం జెట్‌కు రూ.8 వేల కోట్ల అప్పు ఉన్నది.

వడ్డీరేట్లను తగ్గించిన బ్యాంక్

ఖాతాదారులకు శుభవార్తను చేరవేసింది బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ. అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో గృహ, వాహన, ఇతర రుణాలపై వడ్డీరేట్లు మరింత తగ్గినట్లు అయింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్‌ఆర్) 8.5 శాతం నుంచి 8.45 శాతానికి దిగొచ్చింది. ఈ తగ్గించిన వడ్డీరేట్లు తక్షణమే అమల్లోకి రానున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది. సవరించిన రేట్ల ప్రకారం ఒక నెల కాలపరిమితి కలిగిన రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 8.15 శాతంనుంచి 8.10 శాతానికి తగ్గింది. మూడు, ఆరు నెలల రుణాలపై వడ్డీరేటు వరుసగా 8.15 శాతం, 8.30 శాతానికి తగ్గాయి. వీటితోపాటు రెండు, మూడేండ్ల కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 8.55 శాతానికి, 8.65 శాతానికి తగ్గాయి. గడిచిన నెల రోజుల్లో వడ్డీరేట్లను తగ్గించడం ఇది రెండోసారి. వీటితోపాటు గృహ రుణాలపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు కోత విధించింది.

2391
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles