ఎటూతేలని డీసీ భవితవ్యం

Thu,July 12, 2018 12:14 AM

Srei Groups plan for DCHL resolution falls short of creditors votes

-బ్యాంకర్లను ఆకట్టుకోని శ్రేయీ ఆఫర్
-రిజల్యూషన్ ప్లాన్‌ను తిరస్కరించిన ఐసీఐసీఐ బ్యాంక్
-మరోసారి బిడ్డింగ్ ప్రక్రియకు క్రెడిటర్లు?
-సీవోసీతో చర్చిస్తున్నామన్న శ్రేయీ గ్రూప్ లీగల్ హెడ్

హైదరాబాద్, జూలై 11: డెక్కన్ క్రానికల్ భవితవ్యం ఇంకా ఎటూ తేలలేకపోతున్నది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి దివాలా ప్రక్రియలో కొట్టుమిట్టాడుతున్న డీసీహెచ్‌ఎల్ కోసం విజన్ ఇండియా ఫండ్ చేసిన ఆఫర్ కమిటీ ఆఫ్ క్రెడిటర్ల (సీవోసీ)ను ఆకట్టుకోలేకపోయింది. ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్‌లో భాగంగా తెచ్చిన ఈ రిజల్యూషన్ ప్లాన్‌పై బ్యాంకర్లలో ఏకాభిప్రాయం కుదరలేదు. ముఖ్యంగా డీసీ రుణాల్లో 10 శాతం వాటా కలిగిన ఐసీఐసీఐ బ్యాంక్.. ప్లాన్‌ను తిరస్కరించింది. 357 రోజులపాటు సుదీర్ఘంగా సాగిన దివాలా ప్రక్రియలో భాగంగా తెచ్చిన తీర్మాన ప్రణాళికలో శ్రేయీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని విజన్ ఇండియా ఫండ్ అత్యధికంగా రూ.800 కోట్లకుపైగా బిడ్‌తో ముందుకొచ్చింది. బిడ్డింగ్‌లో జీ గ్రూప్, టైమ్స్ గ్రూప్ కూడా పాల్గొన్నాయి. సోమ, మంగళవారాల్లో బిడ్డింగ్‌పై జరిగిన ఈ-ఓటింగ్‌లో శ్రేయీ ఆఫర్‌కు సీవోసీ నుంచి 55 శాతం మాత్రమే మద్దతు లభించింది. దీంతో సంస్థ పునరుద్ధరణ కష్టతరంగా మారింది. సంస్థ ఆస్తుల విక్రయానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం 66 శాతం లభించాల్సి ఉన్నది. మా బిడ్‌కు 55 శాతం ఓటింగ్ లభించింది. మరో 10 శాతం వస్తే విజయం దక్కేది. అయినప్పటికీ తగిన పరిష్కారం కోసం బ్యాంకర్లతో చర్చిస్తున్నాం. డెక్కన్ క్రానికల్ బ్రాండ్ చారిత్రకమైనది.

దానికి గొప్ప విలువున్నది అని శ్రేయీ గ్రూప్ లీగల్ హెడ్ పులక్ బగ్చీ అన్నారు. మరోవైపు తదుపరి కార్యాచరణపై నిర్ణయం కోసం బిడ్డింగ్ ప్రక్రియను మళ్లీ జరుపడమో లేదా బిడ్డింగ్‌లు పెరుగుతాయా అని చూడటమో లేదా నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)కు వదిలేయడమో ఏదో ఒకటి చేయాలని ఓ బ్యాంకర్ అన్నారు.

521
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS