వృద్ధికి సంస్కరణలే ఊతం

Sat,August 10, 2019 01:21 AM

Special focus on industrial communities

-కేంద్రం, ఆర్బీఐలు ఆ దిశగా కృషి
-కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ, ఆగస్టు 9:ఆర్థిక వ్యవస్థకు మరింత బూస్ట్‌నివ్వడానికి కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంకులు గట్టిగా కృషి చేస్తున్నాయని పారిశ్రామిక వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఏర్పాటు చేసిన సమావేశానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన వృద్ధికి ఊతమివ్వడానికి వచ్చే కొద్ది రోజుల్లో కీలక రంగాల్లో సంస్కరణలు తీసుకురానున్నట్లు, తద్వారా వృద్ధి మళ్లీ మెయిన్ ట్రాక్‌లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌లో సంపన్న వర్గాలపై సర్‌చార్జ్ విధించడంతో విదేశీ పెట్టుబడిదారుల్లో నెలకొన్న ఆందోళనను తగ్గించడానికి మంత్రి..శుక్రవారం ఎఫ్‌పీఐలు, ఇతర పెట్టుబడిదారులతో కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా పన్ను వేధింపులపై పడుతున్న మనోవేధనలకు సంబంధించి వాటిపై ప్రధానంగా చర్చించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ అతి వేగవంతమైన వృద్ధిని నమోదు చేసుకుంటున్న భారత్‌ను మరో ఉన్నత శిఖరాలకు చేర్చడానికి సెంట్రల్ బ్యాంక్, ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయన్నారు.

పారిశ్రామిక వర్గాలపై ప్రత్యేక దృష్టి

పారిశ్రామిక వర్గాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడు కృషి చేస్తున్నదని, ముఖ్యంగా వాహన విక్రయాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ సంస్థలకు ఊతమివ్వడానికి త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని మంత్రి సంకేతాలిచ్చారు. బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యపై మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సమస్యల సుడిగుండం నుం చి బయటపడేందుకు త్వరలో చర్యలు తీసుకోబోతున్నట్లు ఆమె సంకేతాలిచ్చారు. ఇన్వెస్టర్లు లేవనెత్తిన పలు అంశాలపై తిరిగి దృష్టి సారించనున్నట్లు వారికి మంత్రి హామీ ఇచ్చారు. సంపన్న వర్గాలపై విధించిన సర్‌చార్జ్‌ని ఎత్తివేయాలని ఇండస్ట్రీ వర్గాలు ఈ సందర్భంగా మంత్రికి సూచించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆమె..త్వరలో జరుగబోయే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు.

జీఎస్టీ తగ్గించండి: సియామ్

అమ్మకాలు పడిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ వాహన తయారీ సంస్థలు నేరుగా ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాయి. వాహనాలపై విధిస్తున్న జీఎస్టీని వెంటనే 18 శాతానికి తగ్గించాలని దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నది. ఇటీవల ఆర్థిక మంత్రితో జరిగిన సమావేశంలో ఇదే విషయాన్ని స్పష్టం చేయడంజరిగిందని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వాధేరా తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలులోకి రానున్న బీఎస్-6 ప్రమాణాలు అమలుచేయాలంటే ప్రస్తుతం జీఎస్టీని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం వాహనాలపై 28 శాతం జీఎస్టీతోపాటు 22 శాతంవరకు అదనపు సెస్‌ను విధిస్తున్నారు. మరోవైపు వాహనాలకు డిమాండ్ పడిపోవడంతో ఉత్పత్తిని భారీ స్థాయిలో తగ్గించుకుంటున్నా యి సంస్థలు. ఇప్పటికే మారుతి తగ్గించుకోగా.. తాజాగా ఈ జాబితాలోకి టాటా మోటర్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలు వచ్చిచేరాయి. ప్రస్తుత త్రైమాసికంలో మహీంద్రా ఏకంగా 8 నుంచి 14 రోజుల వరకు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించగా..టాటా మోటర్స్ కూడా డిమాండ్ లేకపోవడంతో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు సంకేతాలిచ్చింది.

235
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles