ద్రవ్యలోటు లక్ష్యాలను మరువొద్దు


Thu,October 12, 2017 12:04 AM

ప్రభుత్వానికి పీఎంఈఏసీ సూచన
ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పరిష్కార మార్గాలు

ratan
న్యూఢిల్లీ, అక్టోబర్ 11: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మందగమనం నేపథ్యంలో ద్రవ్యలోటు లక్ష్యాలను మరువొద్దని ప్రభుత్వానికి ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారు మండలి (పీఎంఈఏసీ) సూచించింది. దిగాలుపడిన దేశ ఆర్థిక వ్యవస్థలో నూతనోత్తేజం కలిగించేందుకు వివిధ రంగాలకు ఆర్థిక ఉద్దీపనలు ప్రవేశపెట్టాలని చూస్తున్న నరేంద్రమోదీ సర్కారుకు పీఎంఈఏసీ ఈవిధంగా సలహా ఇచ్చింది. నీతి ఆయోగ్ సభ్యుడు బిబేక్ దేబ్రాయ్ చైర్మన్‌గా ఐదుగురు సభ్యులతో గత నెలలో ఏర్పాటైన పీఎంఈఏసీ తొలి సమావేశం బుధవారం ఇక్కడ జరిగింది. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఈ సందర్భంగా వృద్ధిరేటు పురోగతి దారులపై మాట్లాడగా, దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే పది ప్రాధాన్యతా రంగాల అభివృద్ధే మార్గమని పీఎంఈఏసీ అభిప్రాయపడింది. వృద్ధిరేటుతోపాటు ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు, ఎగుమతులు, ద్రవ్యవిధానం, వ్యవసాయం, వినియోగం-తయారీ-సామాజిక రంగా లు, ఆయా సంస్థల్లో ఆర్థిక పరిపాలన, ప్రభుత్వ వ్యయం, సంఘటిత-అసంఘటిత రంగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఆర్థిక సమస్యలకు పరిష్కార మార్గాలైన వీటి గురించి ప్రధానికి వివరించనున్నట్లు సమావేశం అనంతరం విలేఖరులతో దేబ్రాయ్ చెప్పారు.

ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు అంచనాలపై..


ఇదిలావుంటే దేశ జీడీపీ అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకులు తగ్గించడంపై పీఎంఈఏసీ సభ్యుడు, ప్రముఖ ఆర్థికవేత్త అయిన రథిన్ రాయ్ ఖండించారు. ఐఎంఎఫ్ వృద్ధి అంచనాలు 80 శాతం, ప్రపంచ బ్యాంకు వృద్ధి అంచనాలు 65 శాతం తప్పేనని విలేఖరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

తెలిస్తే జాగ్రత్తపడేవారు: జైట్లీ


పెద్ద నోట్ల రద్దు గురించి ముందే తెలిస్తే.. అక్రమార్కులు జాగ్రత్తపడేవారని, పారదర్శకంగా వెళ్తే ఫలితం దక్కేది కాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. నిరుడు నవంబర్ 8వ తేది రాత్రి ప్రధాని మోదీ ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించగా, దీని గురించి ముందే తెలిస్తే నల్లధన కుబేరులు.. తమ అక్రమ సంపదను భూములు, బంగారం ఇతరత్రా మార్గాల్లోకి మళ్లించేవారన్నారు. అందుకే పెద్ద నోట్ల రద్దు విషయంలో పారదర్శకంగా కాకుండా రహస్యంగా ఉండాల్సి వచ్చిందన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన..న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయం విద్యార్థులనుద్దేశించి జైట్లీ మాట్లాడారు.

118

More News

VIRAL NEWS