ఈ-కామర్స్‌కు పండుగే పండుగ

Mon,October 15, 2018 12:10 AM

Shoppers from tier II III cities throng e commerce sites for festive offers

-ఎగబడుతున్న కొత్త కస్టమర్లు
-ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోంచి పెరిగిన అమ్మకాలు
-మొబైల్స్, గృహోపకరణాలకు డిమాండ్

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: దసరా, దీపావళి పండుగల సందర్బంగా ఈ-కామర్స్ కొనుగోళ్లు అదిరిపోతున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, పేటీఎం లాంటి ఈ-కామర్స్ కంపెనీలు వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. అయితే అన్నింటి కన్నా ఆశ్చర్యకరంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఈ అమ్మకాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లను ఈ-కామర్స్ కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ డిస్కౌంట్లు దిపావళి వరకూ కొనసాగనున్నాయి. కొత్త వినియోగదారులు మూడింతలు పెరిగినట్టు అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ తెలిపారు. ఇందులో అత్యధికంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోంచే ఉన్నారన్నారు. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ అన్ని విభాగాల్లోనూ రికార్డ్ బ్రేకింగ్ అమ్మకాలు జరుగుతున్నట్టు ప్రకటించింది. మొబైల్ ఫోన్స్, గృహోపకరణాల అమ్మకాలు గతంలో ఎన్నడూ లేనంతగా జరుగుతున్నట్టు ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. కేవలం నాలుగు రోజుల్లోనే పండుగ సీజన్ అమ్మకాల లక్ష్యాన్ని చేరుకున్నట్టు చెప్పారు.

అయితే ఈ రెండు ఈ-కామర్స్ కంపెనీలు నికరంగా ఎంత అమ్మకాలు జరిపింది మాత్రం వెల్లడించలేదు. ఈ రెండు కంపెనీల సైట్లలో కనిపిస్తున్న బ్రాండ్లు, డిస్కౌంట్లకుతోడు సులభ ఫైనాన్సింగ్ ఆప్షన్లతో వినియోగదారులు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దాదాపు వంద పట్టణాల నుంచి 6 కోట్ల మంది తమ పేటీఎం మాల్‌ను సందర్శించారని ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ సిన్హా తెలిపారు. ఈ సంఖ్య మెట్రో నగరాలకు అదనం అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న కొనుగోళ్ల ఊపు కొనసాగితే 500 కోట్ల డాలర్ల అమ్మకాలను సాధించే అవకాశాలున్నట్టు చెప్పారు. ఇదిలాఉండగా, ఇప్పటికే కొత్త వినియోగదారులు 38 శాతం మేర ఉన్నారని స్నాప్‌డీల్ తెలిపింది. ఆదివారం నాటికి 15 లక్షల ఆర్డర్లను పొందినట్టు షాప్‌క్లూస్ పేర్కొంది. తమకు మూడు, నాలుగో తరగతి పట్ణాణాల నుంచి కూడా ఆర్డర్లు అందుతున్నాయని వెల్లడించింది.

పండుగ సీజన్ అమ్మకాలను పేటీఎం మాల్ అక్టోబర్ 9 నుంచే ప్రారంభించగా, మిగతా ఈ-కామర్స్ కంపెనీలు 10వ తేదీ నుంచి ప్రారంభించాయి. కొన్నింటిలో సోమవారంతోనే ఆఫర్లు ముగుస్తున్నాయి. అయితే దీపావళికి మరిన్ని ఆఫర్లతో రావాలని చూస్తున్నాయి. కాగా, గత మూడు రోజుల్లోనే రూ. 11,085 కోట్ల అమ్మకాలను జరిపినట్టు రెడ్‌సీర్ కన్సల్టింగ్ అంచనా వేసింది. ఇందులో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు 46లక్షల మేర జరగ్గా, గృహోపకరణాలు కోటీ 70 లక్షల యూనిట్లను విక్రయించాయని తెలిపింది. పండుగల సీజన్ ముగిసేనాటికి ఈ ఏడాదికి నిర్దేశించుకున్న 300 కోట్ల డాలర్ల అమ్మకాల లక్ష్యాన్ని ఈ-కామర్స్ పరిశ్రమ చేరుకోగలదని అంచనా వేసింది.

985
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles