దద్దరిల్లిన దలాల్‌స్ట్రీట్

Sat,May 25, 2019 12:36 AM

-రికార్డు స్థాయికి చేరుకున్న స్టాక్ మార్కెట్లు
-623 పాయింట్ల లాభంతో 39,435కి చేరిన సెన్సెక్స్
-ఫలితాల కిక్కుతో దూసుకెళ్లిన మార్కెట్లు

ముంబై, మే 24: సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ విజయఢంకా మోగించడంతో దలాల్‌స్ట్రీట్ దద్దరిల్లింది. నూతన ప్రభుత్వం సంస్కరణలకు మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అంచనాతో మదుపరులు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మరో శిఖరాగ్రానికి చేరుకున్నాయి. గురువారం బీఎస్‌ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 40 వేల పాయింట్ల చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకి కిందకు పడిపోయిన సూచీలు ఆ మరుసటి రోజే మరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నాయి. లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు నిలకడగా ట్రేడ్ అయ్యాయి. ఆ తర్వాత విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ఉత్సాహంతో దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఎగబడి కొనుగోళ్లు జరుపడంతో చివరి గంటలో భారీగా పుంజుకున్నది. 39,076.28 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఒక దశలో 38,824కి పడిపోయింది.

చివరకు వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 623.33 పాయింట్లు లేదా 1.61 శాతం లాభపడి 39,434.72 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ చరిత్రలో ఈ గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ కూడా 187.05 పాయిం ట్లు లేదా 1.60 శాతం బలపడి 11,844.10 వద్ద స్థిరపడింది. మళ్లీ సుస్థిరమైన ప్రభుత్వం రావడంతో ఈ వారంలో సెన్సెక్స్ 1,503 పాయింట్లు లాభపడగా, అదే నిఫ్టీ 437 పాయింట్లు ఎగబాకింది. 542 పార్లమెంట్ సీట్లకుగాను నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌కు 300కిపైగా మోజార్టీ రావడంతో మదుపరుల్లో ఉత్సాహం ఉరకలెత్తిందని మార్కెట్ వర్గాలు వెల్లడించారు. శుక్రవారం మార్కెట్లో 26 స్టాకులు లాభాల్లో ముగియగా, కేవలం నాలుగు మాత్రమే నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 5.09 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది.

వీటితోపాటు ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్‌టెల్, వేదాంత, టాటా మోటర్స్‌ల షేర్లు నాలుగు శాతానికి పైగా లాభపడ్డాయి. మరోవైపు ఎన్‌టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, హెచ్‌యూఎల్‌లు మాత్రం మార్కెట్ వాటాను కోల్పోయాయి. మదుపరుల నుంచి లభించిన మద్దతుతో రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రీయల్, టెలికం, ఆటో రంగాలకు చెందిన షేర్లు నాలుగు శాతానికి పైగా లాభపడ్డాయి. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 2.43 శాతం లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 1.61 శాతం పెరిగింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.2,026.33 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

రూ.2.53 లక్షలకోట్లు పెరిగిన సంపద

లాభాల జడివానలో మదుపరులు తడిసిముద్దయ్యారు. స్టాక్ మార్కెట్ల ర్యాలీతో ఈక్విటీ పెట్టుబడిదారుల సంపద శుక్రవారం ఒకేరోజు రూ.2.53 లక్షల కోట్ల మేర పెరిగింది. బీఎస్‌ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.2,53,830.19 కోట్లు పెరిగి రూ.1,52,71,407.47 కోట్లకు చేరుకున్నది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రావడంతో ఇక సంస్కరణల్లో వేగం పుంజుకోనుండటం, మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పరుగులు పెట్టనున్నదన్న అంచనాలతో మార్కెట్లు దౌడ్‌తీశాయని ఐసీఐసీఐ సెక్యూరిటీ ఎండీ, సీఈవో విజయ్ చందోక్ తెలిపారు.

తగ్గిన ఫారెక్స్ రిజర్వులు

గత కొన్ని వారాలుగా భారీగా పుంజుకున్న విదేశీ మారకం నిల్వలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. మే 17తో ముగిసిన వారానికిగాను విదేశీ మారకం నిల్వలు 2.05 బిలియన్ డాలర్లు తగ్గి 417.99 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. విదేశీ కరెన్సీ రూపంలోవున్న ఆస్తుల విలువ తగ్గడం ఇందు కారణమని రిజర్వు బ్యాంక్ శుక్రవారం నివేదికను విడుదల చేసింది. అంతక్రితంవారంలో ఫారెక్స్ రిజర్వులు 1.368 బిలియన్ డాలర్లు పెరిగి 420.055 బిలియన్ డాలర్లకు చేరాయి. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 2.030 డాలర్లు తరిగిపోవడంతో 390.197 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దీంతో మొత్తం ఫారెక్స్ రిజర్వులపై ప్రతికూల ప్రభావం చూపిందని ఆ నివేదిక వెల్లడించింది. అలాగే బంగారం రిజర్వులు యథాతథంగా 23.021 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అలాగే ప్రత్యేకంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి రూపంలో ఉన్న ఫండ్లు 9.8 మిలియన్ డాలర్లు తగ్గి 1.444 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.

రూపాయి పైపైకి 49 పైసలు లాభపడిన మారకం

స్టాక్ మార్కెట్లతోపాటు దేశీయ కరెన్సీ విలువ భారీగా లాభపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒకేరోజు 49 పైసలు బలపడి రూ.69.53 వద్ద స్థిరపడింది. సార్వత్రిక ఎన్నికల్లో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావడంతో రూపాయికి మరింత కిక్కునిచ్చిందని ఫారెక్స్ డీలర్ పేర్కొన్నారు. మొత్తంమీద ఈ వారంలో మారకం విలువ 70 పైసలు లాభపడింది. దేశీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు నిలకడగా ఉండటం, మళ్లీ ఎన్‌డీఏ సర్కార్ రావడం, నిధుల ప్రవాహం పుంజుకోవడం, క్రూడాయిల్ ధరలు దిగొస్తుండటంతో కరెన్సీ బలపడటానికి ప్రధాన కారణాలు. కానీ, ఇదే సమయంలో అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధమేఘాలు ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. వారాంతంలో 69.75 వద్ద ప్రారంభమైన ఎక్సేంజ్ రేటు..ఒక దశలో 69.81 స్థాయికి పడిపోయింది. చివరకు నిన్నటి ముగింపుతో పోలిస్తే 49 పైసలు బలపడి 69.53 వద్ద ముగిసింది. చమురు ధరలు దిగిరావడం, ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడంతో ఫారెక్స్ మార్కెట్లో సెంటిమెంట్ మెరుగుపడిందని పీసీజీ హెడ్ వీకే శర్మ తెలిపారు.

1619
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles