అలుపెరుగని బుల్స్ సెన్సెక్స్@ 38,000

Fri,August 10, 2018 12:52 AM

Sensex takes 11 sessions to scale 38,00

స్టాక్ మార్కెట్‌లో రికార్డుల హోరు మోగుతున్నది. అలుపు లేకుండా బుల్ రన్ కొనసాగుతున్నది. ఈ పరుగుకు బ్రేక్ పడే సూచనలు కూడా కనిపించడం లేదు. సెన్సెక్స్ తొలిసారిగా 38,000 స్థాయికి ఎగువన ముగిసింది. కేవలం పది ట్రేడింగ్ సెషన్లలోనే 37,000 స్థాయి నుంచి 38,000 స్థాయికి ఎగిసింది. దేశీయ ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ వ్యాఖ్యానాలతో గ్లోబల్ ట్రేడ్ భయాలను తోసిరాజని రోజుకో కొత్త శిఖరాన్ని అధిరోహిస్తున్నది. బ్యాంకింగ్ షేర్లు భారీలాభాలతో ముగిసాయి. ఐసీఐసీఐ బ్యాంక్ సెన్సెక్స్‌లో టాప్ గెయినర్‌గా వుంది. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లకు తోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు కొనుగోళ్లు పెంచడంతో పాటు కార్పోరేట్ రాబడులు ప్రోత్సాహకరంగా ఉండడంతో మార్కెట్లు కొత్త గరిష్ఠ స్థాయిలను ఏర్పాటు చేస్తున్నాయి. నిఫ్టీ ఒకదశలో 11,495.25 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుని చివరికి 20.70 పాయింట్ల లాభంతో 11,470.70 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ 38,076.23 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకి చివరికి 136.81 పాయింట్ల లాభంతో 38,024.37 వద్ద ముగిసింది. కాగా, బ్యాంక్ నిఫ్టీ 257.55 పాయింట్ల లాభంతో 28,320 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 4 శాతం పైగా లాభపడ్డాయి. హిందాల్కో3.4 శాతం, ఎస్‌బీఐ 2.90 శాతం లాభంతో ముగిసాయి. కాగా, భారతీ ఎయిర్‌టెల్ 4.75 శాతం, టైటాన్ 2.14 శాతం, ఓఎన్‌జీసీ 2.03 శాతం చొప్పున నష్టపోయాయి. కాగా, ఎన్‌ఎస్‌ఈలో మొత్తం 923 షేర్లు లాభాలతో ముగిస్తే 877 షేర్లు నష్టాలతో ముగిసాయి. ఎఫ్‌ఐఐలు రూ. 370.68 కోట్ల కొనుగోళ్లు జరపగా, డీఐఐలు 85.39 కోట్ల అమ్మకాలు జరిపారు.

పడిలేస్తున్న స్మాల్, మిడ్‌క్యాప్‌లు


ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్యలో వచ్చిన పతనంలో భారీగా నష్టపోయిన మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు మళ్లీ పెరుగుతున్నాయి. బీఎస్‌ఈ-500 ఇండెక్స్ గత పది రోజుల్లో 2.7 శాతం లాభపడితే దాదాపు 240 షేర్లు సగటున 3 శాతం పైగా లాభపడ్డాయి. ఇందులో 60 షేర్లు 10-60 శాతం లాభపడ్డాయి. ఈ 60 షేర్లలో 15 షేర్లు 20 నుంచి 50 శాతం మేర లాభపడ్డాయి. క్వాలిటీ, 8కే మైల్స్, రిలయన్స్ నావల్, ఆర్‌కామ్, వినతి ఆర్గానిక్స్, వెల్‌స్పన్ ఇండియా, ఐనాక్స్ లీజర్, భారత్ ఎలక్ట్రానిక్స్‌లు ఈ కోవలోనివే. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లోని 180 షేర్లు 10-50 శాతం మేర పెరిగాయి. మిడ్‌క్యాప్ షేర్లలో 12 షేర్లు 10 నుంచి 33 శాతం మేర పెరిగాయి. ఇదిలాఉండగా, ఇప్పటి వరకు 1010 కంపెనీలు తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించగా, వీటి అమ్మకాలు సగటున 17 శాతం పెరగ్గా, నికరలాభం 14 శాతం పెరిగింది.

421

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles