చివర్లో కొనుగోళ్లు

Wed,January 9, 2019 12:35 AM

Sensex rises 130 points Nifty settles at 10802 led by bank stocks

మధ్యాహ్నం తర్వాత బ్యాంకింగ్ షేర్లలో వచ్చిన కొనుగోళ్ల మద్దతు, అంతర్జాతీయ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్‌తో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ముగిశాయి. చాల సేపు నష్టాల్లో ట్రేడ్ అయిన ప్రధాన సూచీలు బ్యాంకింగ్, ఫార్మా, ఆటో షేర్ల దన్నుతో లాభాలను ఆర్జించగలిగాయి. నిఫ్టీ 30.35 పాయింట్ల లాభంతో 10,802.15 వద్ద ముగియగా, సెన్సెక్స్ 130.77 పాయింట్ల లాభంతో 35,980.93 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడంతో రూపాయి మారకం విలువ మరోసారి బలహీన పడింది. దీంతో మార్కెట్లు తొలుత ఒడిదుడుకులతో నష్టాల పాలయ్యాయి. బ్యాంకుల మొండి బకాయిలు తగ్గుముఖం పట్టాయన్న రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ వ్యాఖ్యలు, ప్రభుత్వానికి రూ. 40,000 కోట్ల ఆర్బీఐ స్పెషల్ డివిడెండ్ వంటి పాజిటివ్ వార్తలతో బ్యాంకింగ్ షేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇండెక్స్ హెవీ వెయిట్స్ ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త గరిష్ఠ స్థాయిని నమోదు చేయగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మూడు శాతంకు పైగా లాభ పడడంతో ఇండెక్స్ నష్టాలన్నీ పూడ్చుకుపోయాయి. అమెరికా, చైనా వాణిజ్య చర్చలు, ఆర్థిక ఫలితాల సీజన్ ప్రారంభం కావడంతో ఇన్వెస్టర్లు చాలా వరకు అప్రమత్త ధోరణిని అవలంభించారు. గత రెండు నెలలుగా సైడ్‌వేస్‌లో ట్రేడవుతున్న మార్కెట్లు ఆర్థిక ఫలితాలు, ఆర్థిక గణాంకాల ఆధారంగా మార్కెట్ నిర్ణయాత్మక దిశను నిర్దేశించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా, బ్యాంకింగ్ రంగానికి వస్తున్న సానుకూల వార్తలతో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఇండెక్స్ గరిష్ఠంగా 2.77 శాతం లాభపడింది. ఫార్మా 1.51 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.74 శాతం, ఆటో 0.45 శాతం, ఆర్థికసేవల రంగం 0.38 శాతం చొప్పున లాభపడ్డాయి. మీడియా ఇండెక్స్ 1.24 శాతం నష్టపోగా, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ ఇండెక్స్ అతి స్వల్ప నష్టాలతో దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. మిడ్‌క్యాప్ 0.13 శాతం నష్టంతోనూ, స్మాల్‌క్యాప్ 0.25 శాతం లాభంతో ముగిసింది. ప్రధాన సూచీలు లాభాల్లో ముగిసినప్పటికీ మార్కెట్ బ్రెడ్త్ నెగటివ్‌గా ఉంది. ఎన్‌ఎస్‌ఈలో 908 షేర్లు నష్టాలతో ముగిస్తే, 869 షేర్లు లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో మొత్తం 20 షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిని నమోదు చేయగా, 67 షేర్లు కొత్త 52 వారాల కనిష్ఠ స్థాయిని నమోదు చేశాయి. నిఫ్టీలోని సన్‌ఫార్మా 4.17 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3.15 శాతం, ఎస్‌బీఐ 3.15 శాతం , టాటామోటార్స్ 2.62 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా, జీఎంటర్‌టెయిన్‌మెంట్ 2.99 శాతం, యూపీఎల్ 1.67 శాతం, కోటక్‌బ్యాంక్ 1.49 శాతం, బీపీసీఎల్ 1.38 శాతం చొప్పున నష్టపోయాయి. ఎఫ్‌ఐఐలు రూ. 553.78 కోట్ల అమ్మకాలు జరపగా, డీఐఐలు రూ.698.17 కోట్ల కొనుగోళ్లు జరిపారు.

విలీనం వార్తలతో కుదేలు

విలీనం వార్తలతో గృహ్ ఫైనాన్స్, బంధన్ బ్యాంకు షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. గృహ్ ఫైనాన్స్ షేరు 16.6 శాతం నష్టపోయి రూ. 256 ముగిసింది. ఒకదశలో రూ. 253.05 కనీస స్థాయిని కూడా నమోదు చేసింది. మరో బంధన్‌బ్యాంక్ కూడా ఒకదశలో 6 శాతం పైగా నష్టపోయి చివరికి 4.80 శాతం నష్టంతో 477.05 వద్ద ముగిసింది. ప్రతి 1000 గృహ్ ఫైనాన్స్ షేర్లకు 568 బంధన్ బ్యాంకు షేర్లు ఇచ్చే ప్రతిపాదనతో విలీన ప్రతిపాదనను రెండు కంపెనీల బోర్డులు ఆమోదం తెలిపాయి. ఈ విలీన ప్రతిపాదన ప్రకారం గృహ్ ఫైనాన్స్‌ను రూ. 20,900 కోట్లుగా అంచనా వేశారు. కాగా, దీంతో బంధన బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటా 61 శాతానికి తగ్గనున్నది.

683
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles