HomeBusiness News

11 వేల పాయింట్లపైకి నిఫ్టీ

Published: Thu,February 7, 2019 12:41 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

-358 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-5 నెలల గరిష్ఠ స్థాయికి సూచీలు

ముంబై, ఫిబ్రవరి 6: స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు భారీ లాభాలను నమోదు చేసుకున్నాయి. రిజర్వు బ్యాంక్ తన పరపతి సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలున్నట్లు అంచనాలు వెలువడంతో సూచీలు ప్రారంభం నుంచే భారీ లాభాల దిశగా పయనించాయి. ఆర్థిక సేవలు, ఐటీ, మెటల్ విభాగాలకు చెందిన స్టాక్‌లను కొనుగోలు చేయడానికి మదుపరులు ఎగబడటంతో ప్రధాన సూచీలు ఐదు నెలల గరిష్ఠ స్థాయిని తాకాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 358.52 పాయింట్లు(0.98 శాతం) లాభపడి 36,975.23 పాయింట్లకు చేరుకోగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 128.10 పాయిం ట్లు(1.17 శాతం ఎగిసి) 11,062.45 పాయింట్లకు చేరుకున్నది. నాలుగు నెలల తర్వాత నిఫ్టీ మళ్లీ 11 వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రిజర్వు బ్యాంక్ తన చివరి పరపతి సమీక్షను గురువారం ప్రకటించనున్నది. దీంతో ఈక్విటీ మార్కెట్లలో సెంటిమెంట్ మెరుగుపడిందని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

ద్రవ్యోల్బణం అదుపులో ఉండటంతో వడ్డీరేట్లను యథాతధంగా కానీ లేదా తగ్గించే అవకాశాలు మెండుగా ఉండటం సూచీలు పుంజుకోవడానికి దోహదపడ్డాయి. 30 స్టాకుల్లో కేవలం రెండు మాత్రమే నష్టపోయాయి. వీటిలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు ఉన్నాయి. కానీ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఓఎన్‌జీసీ, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు నాలుగు శాతానికి పైగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ లార్జ్‌క్యాప్ ఇండెక్స్ 1.13 శాతం లాభపడగా, మిడ్ క్యాప్ స్వల్పంగా నష్టపోయింది. రంగాల వారీగా చూస్తే మెటల్, ఐటీ, ఇంధనం, ఆటో రంగాలకు చెందిన షేర్లకు అనూహ్యంగా మద్దతు లభించింది. దీంతో ఈ రంగాల షేర్లు 2.44 శాతం వరకు లాభపడ్డాయి. అన్ని రంగాల నుంచి వచ్చిన మద్దతుతో దేశీయ మార్కెట్లు ఒక శాతం వరకు లాభపడ్డాయని, నిఫ్టీ 10,650-10,950 పాయింట్ల మధ్యలో ట్రేడింగ్ జరిగిందని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఈక్విటీ మార్కెట్లోకి మళ్లించడం కూడా సూచీలు ఎగువముఖం పట్టడానికి దోహదం చేశాయి.

కోలుకున్న ఆర్‌కామ్ షేరు

గడిచిన మూడు రోజులుగా పాతాళంలోకి పడిపోయిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చిం ది. బుధవారం ఒక దశలో 11 శాతం వరకు పడిపోయి రికార్డు స్థాయికి పతనమైన షేరు చివరకు 0.74 శాతం లాభంతో రూ.5.48 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో కంపెనీ షేరు 1.80 శాతం ఎగబాకి రూ.5.65 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 2.25 కోట్ల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 27 కోట్ల షేర్లు చేతులు మారాయి. దివాలా పిటిషన్‌తో సోమవారం 35 శాతం, మంగళవారం 28.5 శాతం పతనం చెందింది.

రూపాయికి చిల్లులు తప్పవు!

ప్రస్తుత సంవత్సరంలో రూపాయికి మరిన్ని చిల్లులు తప్పవని ఇండస్ట్రీ వర్గాలు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాదిలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 78 స్థాయికి పడిపోనున్నదని కార్వీ వార్షిక కమోడిటీ అండ్ కరెన్సీ రిపోర్ట్ 2019లో పేర్కొంది. ద్రవ్య, కరెంట్ ఖాతా లోటు ఆందోళనకర స్థాయిలో కొనసాగుతుండటంతో దేశీయ కరెన్సీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని నివేదికలో హెచ్చరించింది. డాలర్-రుఫీ ఎక్సేంజ్ రేటు కనీసంగా 68-69.50 మధ్యలోను, గరిష్ఠంగా 73.70-74.50 మధ్య స్థాయిలో కదలాడవచ్చునని కార్వీ కమోడిటీ అండ్ కరెన్సీ సీఈవో రమేష్ వరఖేద్కర్ తెలిపారు. ఒక దశలో 74.50కి పడిపోయిన మారకం విలువ ఈ ఏడాదిలో 78 స్థాయికి తగ్గవచ్చునని ఆయన అంచనావేస్తున్నారు.

1086

Recent News