దలాల్ స్ట్రీట్‌కు డాలర్ దెబ్బ

Tue,September 11, 2018 03:07 AM

Sensex plunges 467 points and Nifty loses 151 points

- సెన్సెక్స్ 468, నిఫ్టీ 151 పాయింట్ల నష్టం
- రూ. 1.96 లక్షల కోట్లు హాంఫట్
-ఆర్నెళ్లలో అతిపెద్ద పతనం
-సెంటిమెంట్‌ను దెబ్బతీసిన ట్రేడ్ వార్, క్రూడాయిల్

ముంబై, సెప్టెంబర్ 10: స్టాక్‌మార్కెట్ ఆరు నెలలో అతి పతనాన్ని చవిచూసింది. రూపాయ మారకం విలువ రికార్డు స్థాయికి పతనం కావడం, చైనాపై అదనపు సుంకాలతో అమెరికా అధ్యక్షుడు కాలుదువ్వడం వంటి అంశాలతో నిఫ్టీ, సెన్సెక్స్‌లు ఒక శాతం పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 467.65 పాయింట్ల(1.22 శాతం)నష్టంతో 37,922.17 వద్ద ముగిస్తే, నిఫ్టీ 151 పాయింట్ల నష్టంతో 11,438.10 వద్ద ముగిసింది. మార్చి 16న పడిపోయి 509.54 పాయింట్ల తర్వాత సెన్సెక్స్‌కు ఇదే గరిష్ఠ స్థాయి పతనం. ఈ పతనంతో ఒక్కరోజులోనే రూ 1.96 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకు పోయింది. దీంతో బీఎస్‌ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.1,96,130.84 కోట్లు తగ్గి రూ.1,55,43,657 కోట్లకు పడిపోయింది. కాగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 72.67ల కనీస స్థాయికి పతనం అయింది. నిఫ్టీలోని 50 షేర్లలో కేవలం 8 షేర్లు మాత్రమే లాభాలతో ముగిసాయి. కాగా, సెన్సెక్స్‌లోని 30 షేర్లలలో కేవలం 4 షేర్లు మాత్రమే స్వల్ప లాభాలతో ముగిసాయి. మార్కెట్ పతనం కావడానికి రూపాయి పతనంతో పాటు శుక్రవారం నాడు మార్కెట్ ముగిసిన తర్వాత విడుదలైన కరెంట్ ఖాతాలోటు, ఫారెక్స్ నిల్వల డాటా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో కరెంట్ ఖాతా లోటు 1.58 బిలియన్ డాలర్లకు పెరిగిందన్న వార్తలకు తోడు వాణిజ్య లోటు పెరిగిపోతుందన్న ఆందోళన మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వం చెల్లించాల్సిన రుణాల భారం కూడా రూ. 79.8 లక్షల కోట్లకు పెరిగిందన్న వార్తలు మార్కెట్ పతనాన్ని శాసించాయి. క్రూడాయిల్ ధరలు మరో సారి అరశాతం పైగా పెరిగాయి. నవంబర్ నుంచి ఇరాన్ చమురు సరఫరాపై ఆంక్షలు అమలులోకి రానున్నందున చమురు మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. బ్రెంట్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 77.88 డాలర్లకు చేరుకుంది. ఈ అంశాలకు తోడు దేశీయ ప్రభుత్వ పదేండ్ల బాండ్లపై రాబడి అత్యధికంగా 8.11 శాతానికి చేరుకున్నాయి. 2014, నవంబర్ తర్వాత ఇదే అత్యధిక స్థాయి. చైనా దిగుమతుపై మరో 267బిలియన్ డాలర్ల అదనపు సుంకాలను విధించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లన్నీ ఒడిదుడుకులతో ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ ఒడిదుడుకుల ఇండెక్స్ ఇండియా విక్స్ ఏకంగా పది శాతం మేర పెరిగింది. ఐటీ మినహా అన్ని రంగాల ఇండెక్స్‌లూ నష్టాల్లోనే ముగిసాయి.

ఐటీ ఇండెక్స్ కూడా నష్టపోకుండా సరిగ్గా క్రితం స్థాయిలోనే ముగిసింది. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్, 2.16 శాతం, ఫార్మా ఇండెక్స్ 2.01 శాతం, ఆటో ఇండెక్స్ 1.75, మెటల్ ఇండెక్స్ 1.70 శాతం, రియాల్టీ ఇండెక్స్ 1.51 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.02 శాతం చొప్పున నష్టపోయాయి. కాగా, మిడ్‌క్యాప్ -100 ఇండెక్స్ 1.72 శాతం, స్మాల్‌క్యాప్-100 ఇండెక్స్ 1.23 శాతం చొప్పున నష్టపోయాయి. కాగా, ఎన్‌ఎస్‌ఈలో మొత్తం 1227 షేర్లు నష్టపోగా, కేవలం 593 షేర్లు మాత్రమే లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్ 4.98 శాతం, ఇండియా బుల్స్‌హౌజింగ్ 4.23 శాతం, బజాజ్‌ఫిన్ సర్వ్ 4.02 శాతం, సన్‌ఫార్మా 3.99 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 3.64 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.54 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.14 శాతం, ఎస్‌బీఐ 2.35 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.54 శాతం, కోల్ ఇండియా 1.96 శాతం చొప్పున పడిపోవడంతో సూచీ మూడు వారాల కనిష్ఠ స్థాయికి చేరుకోవడానికి కారణమైంది. వీటితోపాటు వేదాంతా, ఇండస్‌ఇండ్, ఓఎన్‌జీసీ, బజాజ్, హెచ్‌యూఎల్, హీరో, ఐటీసీ, మారుతి, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్, టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఇన్ఫోసిస్‌లు 3.44 శాతం వరకు పతనం చెందాయి. కానీ, హెచ్‌సీఎల్‌టెక్ 1.54 శాతం, యాక్సిస్ బ్యాంక్, విప్రో, టీసీఎస్, జీలు లాభపడ్డాయి. ఎఫ్‌ఐఐలు రూ. 841.68 కోట్ల విలువైన షేర్లను, డీఐఐలు రూ. 289. 66 కోట్ల షేర్లను విక్రయించారు.

టెక్నికల్స్ - బేరిష్ బెల్ట్ హోల్డ్

గత రెండు రోజులు వచ్చిన లాభాలు ఒక్క రోజులోనే మొత్తం హరించుకుపోయాయి. నిఫ్టీ 20 రోజుల చలన సగటుకు దిగువన ముగిసింది. బుధవారం నాడు నమోదు అయిన కనీస స్థాయి 11393 స్థాయి ప్రస్తుతానికి మార్కెట్ కీలక మద్దతు. ఈ స్థాయిని దిగిపోతే మార్కెట్ మరింత బేరిష్‌గా మారే అవకాశాలుంటాయి. నిఫ్టీలో మరో బేరిష్ ప్యాట్రన్ హెడ్ అండ్ షోల్డర్ ఏర్పడుతున్నది. బుధవారం నాటి కనీస స్థాయి దిగువకు పతనం అయితే ఈ ప్యాట్రన్ బ్రేక్‌డౌన్ కూడా జరుగుతుంది. నిఫ్టీ మళ్లీ 11600 స్థాయిని అధిగమిస్తేనే బుల్లిష్ సెంటిమెంట్ మెరుగు పడుతుంది. ఆర్‌ఎస్‌ఐ వంటి ప్రధాన ఇండికేటర్ 50 దిగువకు పతనం కావడంతో బేరిష్ లక్షణాలకు సంకేతాలను ఇస్తున్నది. ప్రస్తుతానికి కొనుగోళ్లకు దూరంగా ఉండడమే మేలు.

1044
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles