వరుస లాభాలకు బ్రేక్

Thu,January 10, 2019 11:35 PM

sensex loss 106 points and nifty loss 34 points

లాభాల స్వీకరణకే మొగ్గు.. కొరవడిన కొనుగోళ్లు
స్టాక్ మార్కెట్ వరుస లాభాలకు బ్రేక్ పడింది. గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతుండటంతోపాటు బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో ప్రధాన సూచీలు నష్టాలతో ముగిశాయి. రూపాయి మారకం విలువ బలహీనంగా ట్రేడ్ అవుతుండడం కూడా సెంటిమెంట్ బలహీనపడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 106.41 పాయింట్ల నష్టంతో 36,106.50 వద్ద ముగిసింది. నిఫ్టీ 33.55 పాయింట్ల నష్టంతో 10,821.60 వద్ద నిలిచింది. ప్రస్తుత ఆర్థిక ఫలితాల్లో నిఫ్టీ కంపెనీ రాబడులు తగ్గుముఖం పట్టవచ్చునన్న అంచనాలు కూడా మార్కెట్‌ను కుంగదీశాయి. అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు కూడా అడుగంటిపోవడంతో మార్కెట్‌లో ఇన్వెస్టర్లు కొత్త కొనుగోళ్లకు ఆసక్తి చూపలేదు. మార్కెట్ ముగిసిన తర్వాత నిఫ్టీ హెవీ వెయిట్ కంపెనీ టీసీఎస్ ఫలితాలు వెల్లడించనున్న క్రమంలో కూడా అప్రమత్తత ధోరణి కనిపించింది. బ్యాంక్ నిఫ్టీ 0.69 శాతం నష్టపోయింది.

కాగా, ఆర్థిక సేవల రంగం ఇండెక్స్ 0.56 శాతం, మెటల్ సూచీ 0.11 శాతం చొప్పున నష్టపోయాయి. ఫార్మా ఇండెక్స్ 0.32 శాతం, ఆటో సూచీ 0.29 శాతం లాభపడగా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు 0.40 శాతం చొప్పున లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో మొత్తం 882 షేర్లు నష్టాల్లో, 877 షేర్లు లాభాల్లోను ముగిశాయి. కాగా, 12 షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిని నమోదు చేయగా, 48 షేర్లు 52 వారాల కనిష్ఠ స్థాయిని నమోదు చేశాయి. నిఫ్టీలో టైటాన్ 1.58 శాతం, టాటామోటార్స్ 1.34 శాతం, ఐషర్ మోటార్స్ 1.18 శాతం, బజాజ్ ఆటో 1 శాతం చొప్పున లాభపడ్డాయి. కాగా, హింద్ పెట్రో 2.76 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 2.42 శాతం, గ్రాసిం 1.95 శాతం, ఇన్‌ఫ్రాటెల్ 1.84 శాతం చొప్పున నష్టపోయాయి. ఎఫ్‌ఐఐలు రూ. 344.58 కోట్ల అమ్మకాలు జరుపగా, డీఐఐలు రూ. 10.98 కోట్ల కొనుగోళ్లు జరిపారు.

489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles