సెన్సెక్స్ @ 40,000

Fri,May 24, 2019 12:40 AM

Sensex hits 40000 mark for the first ever Nifty crosses 12000

-12 వేల మార్కును దాటిన నిఫ్టీ..
-జోష్ పెంచిన ఎన్నికల ఫలితాలు
-ఆల్‌టైమ్ హైని తాకి అంతలోనే పతనం..
-మదుపరుల లాభాల స్వీకరణతో నష్టాల్లో సూచీలు

ముంబై, మే 23: ఎగ్జిట్ పోల్స్ హుషారే మరోసారి కనిపించింది. తాము కోరుకున్న ప్ర భుత్వం.. మళ్లీ కేంద్రంలో కొలువుదీరుతున్నదన్న మదుపరుల ఆనందంతో ఉదయం ఆర ంభం నుంచీ సూచీలు రికార్డు స్థాయిల వైపునకు పరుగులు పెట్టాయి. ఈ క్రమంలోనే ము నుపెన్నడూ లేనివిధంగా సెన్సెక్స్ 40 వేల మార్కును, నిఫ్టీ 12 వేల స్థాయిని అధిగమించాయి. ఆల్‌టైమ్ హై గరిష్ఠ స్థాయిలను తాకు తూ సెన్సెక్స్ 1,000 పాయింట్లకుపైగా ఎగిసి 40,124.96 పాయింట్లను చేరింది. దీంతో మదుపరుల సంపద ఒక్కసారిగా రూ.2.87 లక్షల కోట్లు ఎగబాకింది. కానీ అంతలోనే తగ్గుముఖం పడుతూపోయాయి. చివరకు నష్టాల్లో ముగిశాయి. ఇది.. గురువారం భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ సరళి. కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ సర్కారే అధికారంలోకి వస్తున్నదన్న ఆశలతో ఉవ్వెత్తున ఎగిసిన సూచీలను.. మదుపరుల లాభాల స్వీకరణ నిరాశపరిచింది.

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తున్నా.. సూచీలు మాత్రం ప్రారంభ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. వచ్చిన లాభాలను ఒడిసి పట్టుకోవాలన్న మదుపరుల ఆశ.. సూచీలకు నష్టాలను మిగిల్చింది. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 298.82 పాయింట్లు లేదా 0.76 శాతం పతనమై 38,811.39 వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 80.85 పాయింట్లు లేదా 0.69 శాతం క్షీణించి 11,657.05 వద్దకు దిగజారాయి. నిజానికి 2014 ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిన రోజైన మే 16న సెన్సెక్స్ 261.14 పాయింట్లు లేదా 0.90 శాతం పెరిగి 24,121.74 వద్ద, నిఫ్టీ 79.85 పాయింట్లు లేదా 1.12 శాతం అందుకుని 7,203 వద్ద నిలిచాయి. కానీ మదుపరుల లాభాల స్వీకరణతో ఈసారి భిన్నమైన పరిస్థితులను చూడాల్సి వచ్చింది. ఎఫ్‌ఎంసీజీ, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఫైనాన్స్, టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఆటో రంగాల షేర్లు 1.82 శాతం మేర నష్టపోయాయి.

45 వేల స్థాయికి సెన్సెక్స్

వచ్చే ఏడాది జూన్‌కల్లా బీఎస్‌ఈ సెన్సెక్స్ 45,000 స్థాయికి ఎగబాకుతుందని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. మార్కెట్‌లో ఎలక్షన్ మూడ్ కొనసాగే వీలుందని పేర్కొన్నది. మరోసారి అధికారం చేజిక్కించుకున్న నరేంద్ర మోదీ సర్కారు.. సంస్కరణలను కొనసాగిస్తే మదుపరులు పెట్టుబడులతో పోటెత్తడం ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈసారి పేదలకు నగదు బదిలీ పెంపు, ఎగుమతుల బలోపేతంపై దృష్టి తదితర కీలక అంశాలపై కేంద్రం కన్నేయవచ్చని వెల్లడించింది.

రూ.75 లక్షల కోట్లు మోదీ హయాంలో పెరిగిన మార్కెట్ విలువ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో మదుపరుల సంపద రూ.75 లక్షల కోట్లకుపైగా పెరిగింది. గడిచిన ఐదేండ్లలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో పరుగులు తీసిన నేపథ్యంలో బీఎస్‌ఈ సంస్థల మార్కెట్ విలువ రూ.75.25 లక్షల కోట్లు ఎగబాకింది. 2014 మే 16 నుంచి ఇప్పటిదాకా (2019 మే 23) బీఎస్‌ఈ సెన్సెక్స్ 14,689.65 పాయింట్లు పుంజుకున్నది. రెండోసారీ కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి వస్తున్నదన్న ఫలితాల మధ్య గురువారం ట్రేడింగ్ ఒకానొక దశలో మునుపెన్నడూ లేనివిధంగా సూచీ 40,124.96 పాయింట్లను తాకింది. ఈ క్రమంలో మార్కెట్లు ముగిసే సమయానికి ఉన్న గణాంకాల ప్రకారం ఈ ఐదేండ్ల కాలంలో బీఎస్‌ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.1,50,25,175.49 కోట్లను చేరిందని తేలింది. 2014 ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు గెలిచి స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మార్కెట్లు నూతన స్థాయిలను, సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్న సంగతీ విదితమే. దీంతోనే మదుపరుల సంపద రెట్టింపైంది. ఈసారి కూడా పోయినసారిలాగే ఒంటరిగానే బీజేపీ మెజారిటీ సీట్లను గెలువడంతో మార్కెట్లపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. కాగా, ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్కెట్ విలువ రూ.8,46,751.88 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, టీసీఎస్ (రూ.7,72,728.58 కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (రూ.6,36,120.68 కోట్లు), హిందుస్థాన్ యునిలీవర్ (రూ.3,79,028.92 కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ (రూ.3,66,149.73 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

10,000 నుంచి 40,000 పాయింట్లకు

-13 ఏండ్లలో రికార్డు స్టాయికి
నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే) సర్కార్ వరుసగా రెండోసారి గద్దెనెక్కనుండటంతో మండే ఎండలోనూ స్టాక్ మార్కెట్లు లాభాల జడివానలో తడిసిముద్దయ్యా యి. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్న స్టాక్ మార్కెట్లు మే 23న మరో చారిత్రక స్థాయికి చేరుకున్నది. తొలిసారిగా ఫిబ్రవరి 6, 2006లో ఐదంకెల(10,000 పాయింట్లు) స్థాయికి చేరుకున్న బీఎస్‌ఈ సెన్సెక్స్ గురువారం 40,000 పాయింట్లను ముద్దాడింది. కేవలం 13 ఏండ్లలో ఈ చారిత్రక రికార్డు స్థాయికి చేరుకుంది. ఇటీవలకాలంలో ఆర్థిక సేవల రంగానికి చెందిన స్టాకులు అత్యధికంగా లాభపడటం సెన్సెక్స్ దూసుకుపోవడానికి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌లో ఇండస్‌ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు కీలక పాత్ర పోషించాయి.

నిలకడైన, బలమైన నాయకత్వం కలిగిన ప్రభుత్వం మళ్లీ రావడం స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకోవడానికి దోహదపడ్డాయని రిలయన్స్ సెక్యూరిటీ ఈడీ, సీఈవో గోప్‌కుమార్ తెలిపారు. గడిచిన 13 ఏండ్లకాలంలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, మారుతి, హిందుస్థాన్ యునిలీవర్‌లు 800 శాతం నుంచి 2,832 శాతం వరకు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్ మాత్రం 7,575 శాతం లాభపడింది. మే 22 స్టాక్ మార్కెట్ ముగిసేవరకు ఉన్న గణాంకాల ప్రకారం ఈ విషయం వెల్లడైంది. దీంతో బజాజ్ ఫైనాన్స్ రూ.2 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్నది. గడిచిన 14 నెలల్లోనూ కంపెనీ షేరు ధర రెండింతలు ఎగబాకి రూ.1,702కి చేరుకున్నది. ఇదే సమయంలో సెన్సెక్స్ 19 శాతం లాభపడింది.

నమో 2.0

లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో నరేంద్ర మోదీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుపొందారు. ఎన్డీయే 2.0.. మరిన్ని సాహసోపేత సంస్కరణలపై ఇండస్ట్రీకి కొత్త ఆశల్ని రేకెత్తిస్తున్నది. ఆయన నాయకత్వం సృష్టించిన ప్రభంజనంపై పరిశ్రమ వర్గాలు ప్రశంసల జల్లు కురిపించాయి. ఎవరెవరు ఏమన్నారో?.. వారి మాటల్లోనే..

అభివృద్ధి సాధించిన విజయం. బలమైన నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో వృద్ధిరేటు ఆకర్షణీయం కావాలి
- చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్
సుస్థిర ప్రభుత్వంతో దేశంలోకి విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. దేశీయ సంస్థల్లో విశ్వాసం కూడా పెంపొందుతుంది. నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు
-బీకే గోయెంకా, అసోచామ్ అధ్యక్షుడు
సాహసోపేత నిర్ణయాలు, గొప్ప సంస్కరణల అమలుకు నరేంద్ర మోదీ సర్కారుకు మరోసారి స్పష్టమైన మెజారిటీని ప్రజలు అందించారు
-రాజీవ్ తల్వార్, పీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు
ప్రపంచంలోనే ఓ అతిపెద్ద ప్రజాస్వామ్యయుత దేశానికి ఎన్నికైన అత్యంత శక్తిమంత నేతగా నేడు నరేంద్ర మోదీ నిలిచారు. ఆయన నాయకత్వంలో దేశం వృద్ధిపథంలో వెళ్లాలి
-ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ చైర్మన్
నరేంద్ర మోదీపై ప్రజలు మరోసారి నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఆర్థిక ఫలాలు అట్టడుగు స్థాయి వర్గాలకూ అందాలి. వృద్ధిదాయక పాలనను ఆశిస్తున్నాం
-సునీల్ భారతీ మిట్టల్, భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్
నరేంద్ర మోదీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. సంస్కరణలు గెలిచాయి. ఆయన నాయకత్వంలో ప్రపంచంలోనే భారత్ సూపర్ పవర్‌గా ఎదగాలి
-ఉదయ్ కొటక్, కొటక్ బ్యాంక్ సీఎండీ
ప్రజాస్వామ్యం సాధించిన విజయమిది. ప్రజలు అభివృద్ధికి ఓటేశారు. నరేంద్ర మోదీ మరో ప్రగతిదాయక పాలనకు శ్రీకారం చుట్టాలి
-అనిల్ అగర్వాల్, వేదాంత రిసోర్సెస్ చైర్మన్
గత ఐదేండ్ల సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పిది. మరో ఐదేండ్లు నరేంద్ర మోదీ సర్కారు జన రంజకంగా పాలించి దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలి
-కిరణ్ మజుందార్ షా, బయోకాన్ సీఎండీ
ఈసారి దేశ జీడీపీ పురోగతిపై నరేంద్ర మోదీ సర్కారు దృష్టి పెడుతుందని భావిస్తున్నాం. మరిన్ని సంస్కరణలతో అన్ని రంగాల్లో భారత్ ప్రకాశించాలి
-ఆదీ గోద్రెజ్, గోద్రెజ్ గ్రూప్ చైర్మన్
ప్రజలు బీజేపీకి ఘన విజయాన్ని అందించారు. తమ ప్రియతమ నేతను జాతి నాయకుడిగా ఎన్నుకున్నారు. మోదీ రాకతో వృద్ధి అవకాశాలు మెరుగయ్యాయి
-హర్ష గోయెంకా, ఆర్పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్
వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ప్రగతికి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీల అమలు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. ఉద్యోగ కల్పన పెరుగాల్సిన అవసరముంది
-తులసీ తంతి, సుజ్లాన్ గ్రూప్ సీఎండీ

1234
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles