అన్నీ మంచి శకునాలే..

Wed,March 13, 2019 02:07 AM

-కొనుగోళ్ల జోష్‌లో మదుపరులు
-భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
-సెన్సెక్స్ 482, నిఫ్టీ 133 పాయింట్లు వృద్ధి
-కలిసొచ్చిన విదేశీ పెట్టుబడులు, రూపాయి విలువ

ముంబై, మార్చి 12: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 481.56 పాయింట్లు ఎగబాకి 37,535.66 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 11,300 స్థాయిని అధిగమించి 133.15 పాయింట్ల లాభంతో 11,301.20 వద్ద నిలిచింది. విదేశీ మదుపరుల నుంచి నిలకడగా పెట్టుబడుల రాక, డాలర్‌తో పోల్చి తే రూపాయి మారకం విలువ బలపడటం, కేంద్రంలో ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు.. మదుపరులను కొనుగోళ్ల వైపునకు నడిపించాయి. అలాగే అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల లాభాల ప్రభావం కూడా భారతీయ స్టాక్ మార్కెట్లపై కనిపించింది. సోమవారం కూడా సూచీలు భారీ లాభాలనే అందుకోగా, ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ 864.23 పాయింట్లు, నిఫ్టీ 265.80 పాయింట్లు ఎగిశాయి. ఇక ఈ నెలలో ఇప్పటిదాకా సెన్సెక్స్ 1,668.22 పాయింట్లు, నిఫ్టీ 508.4 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో ప్రధాన సూచీలైన హాంకాంగ్ 1.46 శాతం, షాంఘై 1.10 శాతం, కొరియా 0.89 శాతం, జపాన్ 1.79 శాతం చొప్పున లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలోనూ కీలక సూచీలైన జర్మనీ 0.28 శాతం, ఫ్రాన్స్ 0.28 శాతం మేర పుంజుకోగా, బ్రిటన్ సూచీ మాత్రం 0.32 శాతం నష్టపోయింది. అటు అమెరికా మార్కెట్లలో కూడా లాభాలే నమోదైయ్యాయి.

రెండు నెలల గరిష్ఠానికి రూపాయి


డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మంగళవారం రెండు నెలలకుపైగా గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. 18 పైసలు పెరిగి 69.71 వద్ద స్థిరపడింది. ఎగుమతిదారులు డాలర్లను అమ్మేయగా, బ్యాంకర్లూ రూపాయికి మద్దతునిస్తూ డాలర్ల విక్రయాలు జరిపారు. దేశీయ మార్కెట్లలోకి పెరిగిన విదేశీ పెట్టుబడుల ప్రవాహం కూడా రూపాయి విలువకు అండగా నిలిచింది.

కార్పొరేట్ బాండ్లకు ఉత్సాహం


మరోవైపు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. కార్పొరేట్ బాండ్లలో విదేశీ పెట్టుబడుల పరిమితిని ఎత్తివేసింది. ఓ సంస్థలో 20 శాతానికి మించి కార్పొరేట్ బాండ్ పోర్ట్‌ఫోలియోను విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు (ఎఫ్‌పీఐ) కలిగి ఉండరాదని నిరుడు జూన్‌లో సెబీ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సూచనల మేరకు ఈ పరిమితిని ఉపసంహరించుకుంటున్నట్లు మంగళవారం సెబీ ప్రకటించింది. తక్షణమే తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

రియల్టీ షేర్లు ఆకర్షణీయం


రియల్ ఎస్టేట్ రంగ షేర్ల కొనుగోలుకు మదుపరులు అమితాసక్తిని కనబరిచా రు. దీంతో ఈ రంగ సూచీ 2.60 శాతం పెరిగింది. టెలికం, బ్యాంకింగ్, హెల్త్‌కేర్, ఫైనాన్స్ రంగాల షేర్లూ మదుపరులను ఆకట్టుకున్నాయి. భారతీ ఎయిర్‌టెల్ షేర్ విలువ అత్యధికంగా 4.61 శాతం పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, సన్ ఫార్మా, ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటా ర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ల విలువ కూడా 3.69 శాతం మేర పుంజుకున్నది. బజాజ్ ఫైనాన్స్, ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, యెస్ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ, హీరో మోటోకార్ప్ షేర్ల విలువా 1.13 శాతం పెరిగిం ది. అయితే రూపాయి విలువ బలపడటంతో ఐటీ రంగ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మ హీంద్రా, మిండ్‌ట్రీ షేర్లు 1.22 శాతం క్షీణించాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ షేరు 5 శాతానికిపైగా పడిపోయింది.

1727
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles