హమ్మయ్య.. లాభాలొచ్చాయ్‌!

Wed,May 15, 2019 02:17 AM

Sensex gains 228 pts Nifty ends at 11,222

-తొమ్మిది రోజుల నష్టాలకు తెర సెన్సెక్స్‌ 228, నిఫ్టీ 74 పాయింట్లు వృద్ధి
ముంబై, మే 14: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఎట్టకేలకు లాభాలను అందుకున్నాయి. తొమ్మిది రోజులపాటు వరుస నష్టాలను చవిచూసిన సూచీలు.. మంగళవారం మదుపరుల కొనుగోళ్ల మద్దతుతో తిరిగి కోలుకున్నాయి. బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 227.71 పాయింట్లు పుంజుకుని 37,318.53 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 73.85 పాయింట్లు అందిపుచ్చుకుని 11,222.05 వద్ద నిలిచింది. ఒకానొక దశలో సెన్సెక్స్‌ 37,572.70 పాయింట్లు, నిఫ్టీ 11,294.75 పాయింట్ల గరిష్ఠాన్ని తాకాయి. ఆర్థిక, ఇంధన రంగ షేర్లలో పెట్టుబడులకు మదుపరులు ఆసక్తి కనబరిచారు. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, ఐటీసీ, ఎస్‌బీఐ షేర్లు.. స్టాక్‌ మార్కెట్ల లాభాలకు ప్రధాన కారణంగా నిలిచాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 7 పైసలు కోలుకోవడం కూడా మంగళవారం మదుపరుల్లో కొనుగోళ్ల జోష్‌ను పెంచింది. మరోవైపు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ సెన్సెక్స్‌ టాప్‌-10 సంస్థల్లో తిరిగి అగ్రస్థానానికి చేరు కున్నది. కంపెనీ రూ.7,98,385.98 కోట్ల వద్ద సంస్థ మార్కెట్‌ విలువ స్థిరపడింది.

ద్రవ్యోల్బణం తగ్గినందువల్లే..

ఏప్రిల్‌లో టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు 3.07 శాతానికి తగ్గుముఖం పట్టడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ఉత్తేజపరిచింది. వచ్చే నెల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్ల కోతకు ఇది దోహదపడగలదన్న అంచనాలూ.. మార్కెట్లను పరుగులు పెట్టించాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం కూడా 2.92 శాతంతో ఆర్బీఐ పరిధిలోనే ఉన్నది. ఈ క్రమంలోనే రెపో రేటు కోతల అంచనాల మధ్య ఆర్థిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అలాగే సన్‌ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, వేదాంత, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తదితర షేర్లు 5.87 శాతం నుంచి 5.40 శాతం మేర పుంజుకున్నాయి. టెలికం, ఎనర్జీ, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాలు లాభాలపరంగా టాప్‌-3లో నిలిచాయి. 2.81 శాతం వరకు వృద్ధిని కనబరిచాయి. అయితే టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

తరలిపోతున్న ఎఫ్‌ఐఐలు

మరోవైపు విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐ) రూ.2,011.85 కోట్ల విలువైన పెట్టుబడులను వెనుకకు తీసుకున్నారు. దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐ) మాత్రం రూ.2,242.91 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. సోమవారం సైతం ఎఫ్‌ఐఐలు రూ.1,056.01 కోట్ల పెట్టుబడులను స్టాక్‌ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. డీఐఐలు మాత్రం రూ.1,057.91 కోట్ల షేర్లను కొన్నారు. కాగా, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులకు దారితీయగా, మెజారిటీ ఆసియా, ఐరోపా సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి.

679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles