ఆగని సెన్సెక్స్ పతనం

Tue,February 19, 2019 12:44 AM

-310 పాయింట్లు నష్టపోయిన సూచీ
-10,700 పాయింట్ల దిగువకు నిఫ్టీ
-బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ,ఆటో షేర్లలో అలజడి

ముంబై, ఫిబ్రవరి 18: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు భారీ పతనాన్ని నమోదు చేసుకున్నాయి. విదేశీ పెట్టుబడులపై నెలకొన్న ఆందోళనకు దేశీయ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు కూడా తోడవడంతో దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాలు పోటెత్తాయి. వరుసగా ఎనిమిది ట్రేడింగ్ సెషన్లలో ఈక్విటీ మార్కె ట్లు లాభాల రుచిని చూడలేకపోయాయి. ఈ వారంలోనైనా లాభాల బాట పడుతాయన్న స్టాక్ మార్కెట్ల విశ్లేషకుల అంచనాలు పటాపంచలు అయ్యాయి. ఫలితంగా 30 షేర్ల ఇండెక్స్ బీఎస్‌ఈ సూచీ 310.51 పాయింట్లు లేదా 0.87 శాతం తగ్గి 35,498.44 పాయింట్లకు జారుకున్నది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ కూడా 83.45 పాయిం ట్లు తగ్గి 10,640.95 వద్ద ముగిసింది. దీంతో సెన్సెక్స్ 35,500 దిగువకు, నిఫ్టీ 10,700 కిందకు జారుకున్నట్లు అయింది. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, ఐటీ, ఆటో, ఫార్మా రంగాల షేర్లలో అత్యధికంగా అమ్మకాలు జరిగాయి. వడ్డీరేట్ల తగ్గింపుపై ఈ గురువారం బ్యాంకర్లతో సమావేశంకానున్నట్లు రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించడంతో బ్యాంకింగ్ రంగ షేర్లు కుదేలయ్యాయి. ఈ నెల మొదట్లో సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించినప్పటికీ ఎస్‌బీఐ మినహా ఏ బ్యాంకు కూడా వడ్డీరేట్లను తగ్గించకపోకపోవడంపై దాస్ గుర్రుమీదున్నారు. కాగా, టీసీఎస్, యెస్ బ్యాంక్, ఐటీసీ, సన్‌ఫార్మా, రిలయన్స్, కోల్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, ఎస్‌బీఐ, మారుతి, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల షేర్లు అత్యధికంగా 2.91 శాతం వరకు నష్టపోయాయి. కానీ, ఓఎన్‌సీజీ, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, వేదాంత ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇంద్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీల షేర్లు మాత్రం రెండు శాతం వరకు లాభపడ్డాయి. దేశ సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొంటుండటంతో విదేశీ మదుపరుల్లో నెలకొన్న ఆందోళన తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో ఈక్విటీ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను భారీ స్థాయిలో ఉపసంహరించుకోవడంతో సూచీలు అమ్మకాలకు గురవుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రూపాయి బలహీనపడటం, చమురు ధరలు భగ్గుమంటుండటం కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అమెరికా-చైనా దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉండటంతో అంతర్జాతీయ దేశాల సూచీలు పెరిగినప్పటికీ వీటి ప్రభావం దేశీయ సూచీలపై పెద్దగా కనిపించలేదు. రంగాలవారీగా చూస్తే బ్యాంకెక్స్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, మెటల్, టెక్‌లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొగా, టెలికం, రియల్టీ మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి.

యెస్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ దెబ్బ
నేటి మార్కెట్లో యెస్ బ్యాంక్ షేరు అత్యధికంగా పతనం చెందింది. రుణ వితరణపై ఆర్‌బీఐ హెచ్చరికలు జారీ చేయడంతో ప్రారంభంలో 8 శాతానికిపైగా పతనం చెందిన షేరు ధర చివరకు 2.5 శాతం నష్టంతో రూ.213.15 వద్ద ముగిసింది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ 2.28 శాతం పతనం చెంది రూ.214 వద్ద ముగిసింది.

భారీగా లాభపడ్డ రిలయన్స్, డీహెచ్‌ఎఫ్‌ఎల్ షేర్లు


గడిచిన కొన్ని రోజులుగా భారీ పతనాన్ని మూటగట్టుకున్న అనిల్ అంబానీకి చెందిన షేర్లు ఎట్టకేలకు లాభాల బాటపట్టాయి. వచ్చే సెప్టెంబర్ వరకు తాకట్టుకింద పెట్టిన ఆస్తులను విక్రయించబోమని రుణాలు ఇచ్చిన బ్యాంకులు ప్రకటించడంతో రిలయన్స్ గ్రూపు షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. వీటిలో రిలయన్స్ పవర్ 11.27 శాతం లాభపడగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ 10.91 శాతం, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్రక్చర్ 7.40 శాతం, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 6.71 శాతం, రిలయన్స్ నవల్ అండ్ ఇంజినీరింగ్ 5.15 శాతం లాభపడ్డాయి. అలాగే రిలయన్స్ క్యాపిటల్ 2.86 శాతం, రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్ 2.64 శాతం చొప్పున పెరిగాయి. అలాగే దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐదు శాతం వరకు ఎగబాకింది. ఈ సంస్థలో మరో ప్రైవేట్ కంపెనీ పది శాతం వాటా కొనుగోలు చేయబోతున్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో డీహెచ్‌ఎఫ్‌ఎల్ షేరు ధర 4.67 శాతం లాభపడి రూ.128.90 వద్ద స్థిరపడింది.

793
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles