మార్కెట్లకు ఆర్బీఐ దెబ్బ

Thu,December 7, 2017 12:19 AM

Sensex falls 205 pts RBI maintains status quo on repo rate

-అమ్మకాల ఒత్తిడిలో బ్యాంకింగ్ షేర్లు
-సెన్సెక్స్ 205, నిఫ్టీ 74 పాయింట్లు పతనం
rbi-market
ముంబై, డిసెంబర్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా నష్టపోయాయి. ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచుతూ నిర్ణయం తీసుకోవడం మదుపరులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రధానంగా బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 205.26 పాయింట్లు క్షీణించి 32,597.18 వద్ద ముగియగా, నిఫ్టీ 74.15 పాయింట్లు పడిపోయి 10,044.10 వద్ద నిలిచింది. ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాల నడుమ మార్కెట్‌కు జోష్‌నిచ్చే ఎలాంటి కీలక నిర్ణయాలనూ ఆర్బీఐ తీసుకోలేకపోయింది. పైగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో వృద్ధిరేటు అంచనాను 6.7 శాతం వద్దే ఉంచింది. ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 6.3 శాతానికి పెరిగినప్పటికీ దాన్ని పరిశీలనలోకి తీసుకోకపోవడంతోనే మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నదని నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఇక బీఎస్‌ఈ బ్యాంకింగ్ సూచీ 1.23 శాతం దిగజారగా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యెస్ బ్యాంక్ షేర్లు 2.27 శాతం మేర విలువను కోల్పోయాయి. ఆయా రంగాలవారీగా చూస్తే మెటల్, టెలికం, పీఎస్‌యూ, మౌలిక, క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్, విద్యుత్, ఆటో షేర్లు 2.03 శాతం నుంచి 0.73 శాతం వరకు పతనమయ్యాయి. మిడ్-క్యాప్ సూచీ 0.89 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 0.66 శాతం మేర నష్టపోయాయి. మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ కూడా నిరాశాజనకంగా కదలాడటం మదుపరుల పెట్టుబడుల ఉత్సాహాన్ని మరింత కుంగదీసింది. ఆసియా, ఐరోపా దేశాల్లోని ప్రధాన మార్కెట్లూ నష్టాల్లోనే ముగిశాయి.

299
Tags

More News

VIRAL NEWS