ఏడు సెషన్లు..1,500 పాయింట్లు

Thu,March 21, 2019 01:52 AM

Sensex ends higher Nifty holds 11,521

-భారీగా లాభపడ్డ సెన్సెక్స్
ముంబై, మార్చి 20: స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు లాభాల్లో ముగిశాయి. బ్లూచిప్ కంపెనీల షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించడం సూచీలు స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. 38,433.86 పాయింట్ల వద్ద ప్రారంభమైన 30 షేర్ల ఇండెక్స్ సూచీ..ఒక దశలో 38,489.81 గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 23.28 పాయింట్లు లాభపడి 38,386.75 వద్ద ముగిసింది. గడిచిన ఏడు సెషన్లలో సెన్సెక్స్ ఏకంగా 1,500 పాయింట్లు లాభపడినట్లు అయింది. అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి వచ్చిన మద్దతుకు తోడు దేశీయంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సూచీలు భారీగా పుంజుకున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం 11.35 పాయింట్లు తగ్గి 11,521.05కు పరిమిత మైంది. అమెరికా ఫెడరల్ రిజర్వు తన పరపతి సమీక్షను ప్రకటించనుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనడంతో దేశీయ సూచీలు స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయని మార్కెట్ విశ్లేషకులు వెల్లడించారు. మార్చి నెలకుగాను డెరివేటివ్ కాంట్రాక్టు గడువు దగ్గర పడుతుండటంతో మదుపరుల్లో ఆందోళన మరింత తీవ్రతరమైందన్నారు.

స్టాక్ మార్కెట్లో ఇన్ఫోసిస్ 2.36 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలువగా.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.39 శాతం బలపడింది. వీటితోపాటు యెస్ బ్యాంక్ 1.27 శాతం, ఎల్ అండ్ టీ 1.19 శాతం, సన్‌ఫార్మా 1.07 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ, వేదాంత, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్, కొటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీలు స్వల్పంగా లాభపడ్డాయి. కానీ, ఎన్‌టీపీసీ 4.29 శాతం పతనం చెందింది. ఓఎన్‌జీసీ 3.28 శాతం తగ్గగా, కోల్ ఇండియా, టాటా స్టీల్, మారుతి సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, టాటా మోటర్స్, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, టీసీఎస్, ఐటీసీ, హీరో మోటోకార్ప్‌లు రెండు శాతానికి పైగా మార్కెట్ వాటాను కోల్పోయాయి.

ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలైన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీలు కూడా ఐదు శాతానికి పైగా నష్టపోయాయి. వరుసగా రెండో రోజు రిలయన్స్ కమ్యూనికేషన్ షేరు 10 శాతం ఎగబాకగా, జెట్ ఎయిర్‌వేస్ మాత్రం ఐదు శాతం పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ భగ్గుమనడం వల్లనే చమురు విక్రయ సంస్థల షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. రంగాల వారీగా చూస్తే రియల్టీ ఇండెక్స్ 2.21 శాతం వరకు లాభపడగా, ఐటీ, టెక్, క్యాపిటల్ గూడ్స్, హెల్త్‌కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్ షేర్లు కూడా మదుపరులను ఆకట్టుకున్నాయి. రూ.1,771.61 కోట్ల విలువైన షేర్లను విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు కొనుగోలు చేయగా, దేశీయ పెట్టుబడిదారులు మాత్రం రూ.1,323.17 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

నేడు మార్కెట్లకు సెలవు

హోలీ సందర్భంగా గురువారం స్టాక్ మా ర్కెట్లు సెలవుపాటించనున్నాయి. వీటితోపా టు బులియన్, కమోడిటీ, ఇతర మార్కెట్లు కూడా పనిచేయవు. మళ్లీ శుక్రవారం యధావిధిగా మార్కెట్లు పనిచేయనున్నాయి.

రూపాయి రికవరీ

రూపాయి రికవరీ అయింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ 13 పైసలు బలపడి రూ.68.83 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులను కుమ్మరించడం, క్రూడాయిల్ ధరలు శాంతించడం రూపాయి బలపడటానికి ప్రధాన కారణమని ఫారెక్స్ డీలర్ వెల్లడించారు. అమెరికా ఫెడరల్ రిజర్వు తన పరపతి సమీక్షను ప్రకటించడంతో డాలర్‌తో ఒత్తిడి మరింత పెరిగింది.

767
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles